సీఐటీయూ జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ
నవతెలంగాణ – చండూరు
గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండలం కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ ) చండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి చండూరు ఎంపీడీవోబి. యాదగిరి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామపంచాయతీ కార్మికులకు రెండు మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉండడం వల్ల అప్పులు తెచ్చుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నార ని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనం రూ.26000 వేలు ఇవ్వాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఏ ఒక్క గ్రామ పంచాయతీ కార్మికుని తొలగించకుండా ఒక సర్కులర్ విడుదల చేయాలని, ఆదివారం సెలవు అందరికీ అమలయ్యే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వాలని, నూతనంగా గెలిచిన కొన్ని గ్రామాల సర్పంచులు కార్మికులను ఇబ్బందుల గురి చేస్తున్నారని, కార్మికులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని ఆయన అన్నారు.
ప్రతి గ్రామపంచాయతీలో కార్మికులందరికీ రెండు జతల బట్టలు, సబ్బులు, చెప్పులు, నూనెలు, ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులందరికీ రూ.10 లక్షల పోస్టల్ బీమా జీబీ నిధుల నుండి కట్టించాలని, ట్రాక్టర్ నడిపే డ్రైవర్లకు డ్రైవింగ్ నేర్పించి వారికి లైసెన్సులు ఇవ్వాలని ఆయన అన్నారు. ఆన్లైన్లో లేని కార్మికుల పేర్లను వెంటనే ఆన్లైన్లో చేర్చాలని అయన అన్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలోనే మాడుగుల పల్లి మండలం కలివేల పాలెం, గజలాపురం, దామరచర్ల మండలం తేట్టేకుంట గ్రామపంచాయతీల లో కార్మికులను పనిలోకి రాకుండా గ్రామ సర్పంచ్ లే అడ్డుకుంటున్నారని, ఇంకా కొన్ని గ్రామపంచాయతీల లో వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.
సంవత్సరాల తరబడి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను తమ పరిధిలోని వెంటనే పరిష్కరించాలని లేనియెడల సమ్మెలోకి వెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు చిట్టిమల్ల లింగయ్య, మొగుదాల వెంకటేశం, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్( సీఐటీయూ ) అధ్యక్షులు నాంపల్లి శంకర్, యూనియన్ ప్రధాన కార్యదర్శి రేవెల్లి సైదులు, యూనియన్ నాయకులు నాగిళ్ల లక్ష్మయ్య, దాసరి కృష్ణయ్య, తిప్పర్తి అండాలు, మల్లయ్య, జంగమ్మ, పుష్పమ్మ, బెరే బిక్షమయ్య, నేరల్ల వెంకటయ్య, కందికంటి నగేష్, సైదులు, మహేందర్, కోరే నగేష్, సత్తయ్య, శరత్ తదితరులు పాల్గొన్నారు.



