Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం18 నుంచి పెన్షనర్ల రిలే నిరాహార దీక్షలు

18 నుంచి పెన్షనర్ల రిలే నిరాహార దీక్షలు

- Advertisement -

తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర పెన్షనర్లు తమకు ప్రభుత్వం నుంచి రావలసిన పెండింగ్‌ బిల్లులు విడుదల కోసం ఫిబ్రవరి 18 నుంచి హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్టు తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు పి.నారాయణ రెడ్డి, పి.కృష్ణమూర్తి తదితరులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు అందజేశారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడుతూ 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లకు పెన్షన్‌ మాత్రమే ఇస్తున్నారనీ, బకాయిలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్నుంచి మానసిక వేదనకు గురవుతున్నారనీ, ఆత్మహత్యలు చేసుకున్న వారితో కలుపుకుని 45 మంది మరణించారని తెలిపారు. ఆ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అనేక ప్రాతినిథ్యాలు, పోరాటాల అనంతరం ప్రభుత్వం-జేఏసీ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తున్నట్టు చెబుతున్నప్పటికీ అవి ఎవరికి చెల్లిస్తున్నారో అర్థం కావడం లేదని వారు తెలిపారు. అంతకు ముందు రిటైర్‌మెంట్‌ వయస్సు పెంచడంతో పదవీ విరమణలు 2024 మార్చి నుంచి ఎక్కువగా ఉన్నాయనీ, వారికి బకాయిలు చెల్లించడం లేదంటే మరి ఎవరికి చెల్లిస్తున్నది? అని వారు ప్రశ్నించారు. బకాయిలు పూర్తిగా చెల్లించా లంటే నెలకు కనీసం రూ.1,000 కోట్లు విడుదల చేయాలనీ, దానిని కూడా ట్రెజరీకి మొదట వచ్చిన బిల్లులను మొదట చెల్లించే విధానం అమలు చేయాలనీ, బిల్లులు ఎవరకి చెల్లిస్తున్నారో వివరాలు బయటపెట్టాలని వారు డిమాండ్‌ చేసారు.
జేఏసీతో జరిగిన చర్చల సందర్భంగా హెల్త్‌ స్కీం అమలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైందని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం టాప్ర ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో బకాయిలు విడుదలకు నోచుకోని పెన్షనర్లు ఇంట్లో మానసిక వేదనతో చనిపోయే బదులు దీక్షా శిబిరంలోనే మరణించడం మేలని సూచించినట్టు తెలిపారు. దీంతో ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్షలను మొదలుపెట్టి బకాయిలు మొత్తం చెల్లించే వరకు కొనసాగించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయిం చినట్టు వెల్లడించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా తెలిపినట్టు వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం నిర్ణయడం తీసుకో వాలని వారు డిమాండ్‌ చేశారు. నిరాహారదీక్షలను జయప్రదం చేయాలని పెన్షనర్లకు పిలుపునిచ్చారు. ఆన్‌లైన్‌ జూమ్‌ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు డాక్టర్‌ స్వరాజ్‌ కుమార్‌, స్టేట్‌ పెన్షనర్స్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ స్వరాజ్‌ కుమార్‌, జి.అశోక్‌, డాక్టర్‌ ఎల్‌.అరుణ, కె.నాగేశ్వర్‌ రావు, కె.రాంమోహన్‌, జి.అంజనయ్య, రామకృష్ణ, టి. నిరంజన్‌, పి.శ్యాం సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -