Wednesday, December 24, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాలను జనం నమ్మరు

బీఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాలను జనం నమ్మరు

- Advertisement -

– బైపోల్స్‌తో పాటు సర్పంచ్‌ ఎన్నికల్లో ఓడినా వారి తీరు మారలేదు
– రెండేండ్లలో అన్ని రంగాల్లో ఆశించిన ప్రగతి సాధించాం
– గ్రామాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాం
– మహిళా సాధికారతలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచాం : మంత్రి దనసరి అనసూయ సీతక్కతో ‘నవతెలంగాణ’ ఇంటర్వ్యూ


బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారాలను జనం నమ్మరు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం పక్కన పెట్టి వాట్సాప్‌ యూనివర్సిటీని నమ్ముకున్నారు. గోరంతలను కొండంతలు చేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఒక వైపు అభివృద్ధిని, మరో వైపు సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం. గత రెండేండ్లలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకువచ్చే పలు కీలక కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసింది. మేం సాధించిన విజయాలే మా పాలనకు నిదర్శనం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేండ్లు పూర్తి చేసుకుని ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆమె నవతెలంగాణ ప్రతినిధి ఊరగొండ మల్లేశంకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్వూ.. వివరాలు ఆమె మాటల్లోనే…

రెండేండ్లలో మీరు సాధించిన విజయాలేంటి ?
రెండేండ్ల క్రితం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌, ఇందిర్మ ఇండ్లు ఇలా ఎన్నికల ముందు మేమిచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తున్నాం. అదే సందర్భంలో అభివృద్ధిని సైతం పరుగులు పెట్టిస్తున్నాం. కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో మూడింట రెండొంతుల సర్పంచ్‌లను గెలుచుకున్నాం. ఓటమి నుంచి ఇంకా తేరుకోని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నది. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం పక్కన పెట్టి వాట్సాప్‌ యూనివర్సిటీని నమ్ముకున్నారు. గోరంతలను కొండంతలు చేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ వాట్సాప్‌ ప్రచారానికి భయపడుతున్నారా?
వారి ప్రచారం అంతా డొల్లని ఇప్పటికే తేటతెల్లమైంది. తాటాకు చప్పుళ్లకు ఇక్కడ ఎవరు బెదరరు. రెండేండ్లలో వారు గెలిచిన రెండు స్థానాలైన కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో మేం సాధించిన విజయమే ఇందుకు సాక్ష్యం. వాళ్లేన్ని అసత్య ప్రచారాలు చేసినా జనం ఆదరించలేదు. ఇప్పటికై అబద్ధాలను వదిలి రాష్ట్రాభివృద్ధిలో కలిసి రావాలి.

మీ శాఖ ప్రజలకు ఎంతమేర చేరువైంది?
గ్రామ స్వరాజ్యం, మహిళా సాధికారత, మౌలిక వసతుల అభివృద్ధి మూడు ప్రధాన లక్ష్యాలతో తెలంగాణ పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు సాగుతోంది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదు.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చుతూ, గణనీయమైన ఫలితాలను సాధిస్తున్నాం.

గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణంపై ఎలా ముందుకెళ్తున్నారు?
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రహదారి నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రంలో 7,449.50 కి.మీ రహదారుల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా అనుసంధానం లేని గ్రామ పంచాయతీలకు రహదారి కల్పన, జీపీ, మండల, జిల్లా కేంద్రాలకు కనెక్టివిటీ అందించడం, రహదారులను బలోపేతం చేయడం, పునరుద్ధరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రూ.16,007.56 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చాం. వీటిని 17 ప్యాకేజీలుగా విభజించి ఈ-ప్రోక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లు ఆహ్వానించాం.

పంచాయతీరాజ్‌ శాఖ బలోపేతానికి తీసుకున్న చర్యలు?
పంచాయతీరాజ్‌ శాఖను బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నాం ఎంపీడీఓలు, ఎంపీఓల నియామకాలు పూర్తి చేశాం. క్రీడా కోటా కింద 171 మంది పంచాయతీ కార్యదర్శులను నియమించాం. జీవో 317 వల్ల ఇబ్బంది పడ్డ కార్యదర్శులకు డిప్యూటేషన్‌ విధానంలో సౌలభ్యం కల్పించి, వారి సేవలను కొనసాగేలా చూశాం. 92 వేల కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు సమయానికి చెల్లించడం ద్వారా గ్రామీణ సేవా వ్యవస్థలో స్థిరత్వం వచ్చింది. ఇది ఉద్యోగుల నిబద్ధతను పెంచడమే కాకుండా, ప్రజలకు సేవల నాణ్యతను మెరుగుపర్చింది.

చీరల పంపిణీపై వస్తున్న ఆరోపణలు?
అదంతా బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం. వారి హయాంలో పనికిరాని చీరలు అందించారు. కాని మేం నాణ్యమైన చీరలను అందించి వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించాం. కేవలం 5 రోజుల్లోనే 43 లక్షల ఇందిరమ్మ చీరలను తెలంగాణ ఆడబిడ్డలకు పంపిణీ చేసి రికార్డు సృష్టించాం. కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించడమే మా లక్ష్యం. ఇలా ఎన్నో పథకాలతో ముందుకు పోతున్నాం. ఇవి గ్రామీణ జీవితాన్ని మెరుగుపర్చే చోదక శక్తులు. ప్రతి గ్రామంలో పచ్చదనం, నీటి సంరక్షణ, మహిళా సాధికారత కలిసినప్పుడే నిజమైన గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. అదే తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న మార్గం. ప్రతి గ్రామం బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.

మహిళా సాధికారతలో సక్సెస్‌ అయ్యారా?
మహిళా సాధికారిత మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పాలసీ గ్రామీణ మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తెచ్చింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలకు ఆత్మవిశ్వాసం, అవకాశాలు, ఆర్థిక భద్రత ఇందిరా మహిళా శక్తి ద్వారా కలుగుతోంది. ”కోటిమంది మహిళలను కోటిశ్వరులుగా చేయాలి” అన్న ధ్యేయంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్లకుపైగా బ్యాంక్‌ రుణాలు అందిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణాల నుంచి ఆర్డీసీ అద్దె బస్సులకు యాజమానులుగా మహిళలు ఎదిగారు. పెట్రోల్‌ బంకులు నిర్వహిస్తున్నారు. సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు, ఫిష్‌ ట్రక్కులు నడుపుతున్నారు. మహిళా సాధికారితలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -