నవతెలంగాణ – కంటేశ్వర్ : నిజామాబాద్ ప్రజలు పోలీస్ శాఖ సూచించిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదు. ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుంది. ఎక్కువశబ్దంతో డి.జే లను ఏర్పాటుచేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడతారని తెలిపారు.
రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డి.జే ల సౌండ్ సిస్టం పూర్తిగా నిషేదం గలదు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డి. జేలు. సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేటు పరిధిలో నిషేదం గలదు.
500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమనికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలి. మాల్స్, సినిమా ధియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటి నిబంధనలు తప్పనిసరి పాటించాలి. ప్రతీ ఒక్కరు క్యూ పద్దతిని తప్పనిసరి పాటించాలి.
డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపద్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరగుతుంది. ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకి విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలచినచో ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.
నిజామాబాద్ పోలీసుల నిబంధనలను ఎవ్వరయిన అతిక్రమించిన యెడల వారిపై సంబంధిత చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లకు / ఎస్.ఐ లకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అధికార ఉత్తర్వులను జారీ చేశారు. ఇట్టి ఉత్తర్వులు తేది:16-07-2025 నుండి తేది 31-07-2025 వరకు అమలులో ఉంటుంది. కావున ప్రజలందరూ సంబంధిత పోలీస్ అధికారులకు సహకరించగలరు అని కోరారు.