మండల, గ్రామ స్థాయి అధికారులు లోతట్టు ప్రాంతాలను పరిశీలించాలని ఆదేశం
నవతెలంగాణ – ఉప్పునుంతల
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప్పునుంతల మండల తాహసిల్దార్ ఎమ్మార్వో ప్రమీల మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తూ, ప్రజలను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా కార్యాలయం నుండి అందుతున్న వర్ష సూచనలను వెంటనే గ్రామాల వాట్సాప్ గ్రూపులు, దండోరా ద్వారా ప్రజలకు చేరవేసి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆమె పేర్కొన్నారు. రైతులు, వృద్ధులు, చిన్నపిల్లలు, పశువులు వర్ష ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మట్టి మిద్దెలలో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. రెవెన్యూ కార్యాలయ సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు తెలిపారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే తాహసిల్దార్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. తాహసిల్దార్ ఎమ్మార్వో ప్రమీల – +91 90001 01491,డిప్యూటీ తాహసిల్దార్ పరశు నాయక్ – +91 94403 45105, పోలీస్ శాఖ డయల్ 100 కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు.