నవతెలంగాణ -పరకాల
పరిశుభ్రతను పాటించి స్వచ్ఛ పరకాల నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ పరిధిలో వనమహోత్సవం, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు, మున్సిపల్ సిబ్బందికి బట్టల పంపిణీ, స్వచ్ఛ ఆటోలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, కలెక్టర్ స్నేహ శబరీష్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రజాకర్ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించిన చరిత్ర పరకాలకు ఉందంటూ పరకాల ప్రాశస్త్యాన్ని కలెక్టర్ స్నేహ శబరిష్ కు వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందే పరకాల తాలూకా కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతమన్నారు.
ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల పరకాల ప్రాంతం గత నాయకుల స్వార్థం మూలంగా వెనుకబాటుకు గురైందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రం కావడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ భూపాలపల్లి జిల్లా చేయడంతో పరకాలకు అన్యాయం జరిగిందన్నారు. అయినప్పటికీ వాటిని అధిగమిస్తూ పరకాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల పరకాల కేంద్రంగా 200 కోట్ల రూపాయలతో 22 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆగస్టు రెండవ తేదీలోపు టెండర్లు పూర్తికానున్నయన్నారు. ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం 18 నెలల లోపు పాఠశాలను ప్రారంభించుకునే అవకాశం ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.గత ప్రభుత్వ హయాంలో మహిళలకు అభయహస్తం ఎగవేశారన్నారు, పావలా వడ్డీ రుణాలు చెల్లిస్తామని వాటి ఊసే ఎత్తలేదన్నారు. బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు అరిచేతుల వైకుంఠం చూపించి కుటుంబ దోపిడీ కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు.
ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన
పరకాలలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉద్యోగ, వ్యాపార, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే టాస్క్ సహకారంతో వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అంతేకాకుండా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే సంగం మండలంతో పాటు దామెర మండలం ల్యాదల్లలో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్సచ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. పరకాలలో సైతం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేయడానికి గతంలో ఇదే మున్సిపాలిటీలో జరిగిన సమావేశంలో ఐటీ మంత్రితో చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.
40 కోట్లతో పట్టణ అభివృద్ధి పనులు
పరకాల పట్టణంలో వరద ముంపు సమస్య అత్యధికంగా ఉన్నందున టి యు ఎఫ్ డి సి ద్వారా 15 కోట్లతో టెండర్లు పూర్తి చేసి డ్రైనేజీ తదితర పనులను చేస్తున్నామంటూ ఎమ్మెల్యే తెలిపారు.మరో 9 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆధారంగా ముందుకుపోవడం జరుగుతుందన్నారు. సీసీ రోడ్డు డ్రైనేజీల నిర్మాణం కోసం ఖర్చు చేస్తున్న 24 కోట్ల రూ.తో పాటు అమృత్ స్కీం కింద డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారానికి 11 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథ పైప్ లైన్స్ ద్వారా సమస్యలు ఎదురవుతున్నందున పరకాల పటంతో పాటు, కామారెడ్డి పల్లి గ్రామానికి వాటర్ సమస్య లేకుండా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు.
34 కోట్లతోని ప్రత్యేకమైన పైపులైన్ ద్వారా 24 గంటలు నీరందే విధంగా ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది. తొందర్లోనే జపానెడ్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరకనుందన్నారు. అభివృద్ధిలో ప్రభుత్వ కృషి ఎంత అయినప్పటికీ ప్రజలు భాగస్వామ్యమైతే తప్ప పారిశుద్ధ్య సమస్య పట్టణాభివృద్ధి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్నారు. ప్రతి ఒక్కరూ పరకాల పట్టణ అభివృద్ధి కోసం భాగస్వాములై కావాలంటూ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
డిప్యూటేషన్ మీద వెళ్లిన సిబ్బంది వెనక్కు: సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కమిషనర్ సుష్మ సూచన మేరకు పరకాల నుండి వరంగల్ మున్సిపాలిటీ డిప్యూటీషన్ పై వెళ్లిన 32 మంది మున్సిపల్ ఉద్యోగులను వెనక్కు తీసుకురావడం జరుగుతుందన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి వారందరూ ఇక్కడే విధులు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పారిశుద్ధి సమస్య పరిష్కారానికి ఎక్కడ తగ్గేది లేదని అవసరమైతే ప్రైవేట్ భాగస్వామ్యంతోనైనా పట్టణాన్ని స్వచారి పట్టణంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులకు సూచించారు.
కమిషనర్ కృషి అభినందనీయం
పరకాల అభివృద్ధి కోసం మున్సిపల్ కమిషనర్ సుష్మ చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.వాల్ రైటింగ్ ద్వారా ఆ వాడలలో నిర్వహించే పారిశుధ్య పనుల వివరాలుతోపాటు మునిసిపల్ జవాన్లు సిబ్బంది ఫోన్ నెంబర్లను డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పారిశుధ్య సమస్య ఇతర సమస్యలు పరిష్కారం కోసం ప్రతి సోమవారం డయాల్ యువర్ కమిషనర్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తూ పరకాల పట్టణంలో ఏ మూల సమస్య ఉన్న అధికారుల దృష్టికి చేరే విధంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పరిశుభ్రత కోసం తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు.
45 రోజుల్లో దాటితే ఇందిరమ్మ ఇల్లు రద్దు
ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులు ప్రొసీడింగ్ ఇచ్చిన 45 రోజులలోపు ఇల్లు నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే ప్రొసీడింగ్ ఆర్డర్స్ రద్దు చేయాల్సిందిగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వారి స్థానంలో ఇల్లు కట్టుకోగలిగిన అర్హులకు కేటాయించాలని సూచించారు. పట్టణంలో మొదటి విడతగా 469 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. 45 శాతం మంది మాత్రమే ఇది నిర్మాణ పనులు ప్రారంభించారన్నారు. మిగతావారు సైతం త్వరగా పనులు ప్రారంభించేలా అధికారులు కృషి చేయాలన్నారు. లేనట్లయితే వారిని తొలగించి వారి స్థానంలో అర్హులైన కట్టుకోగలిగిన వారికి అవకాశం కల్పించాలన్నారు.
కాలనీలలో కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలి: కలెక్టర్ స్నేహ శబరిష్
పారిశుద్ధ్య వ్యక్తాలతో ఆయా కాలనీలలో ప్రజల భాగస్వామ్యంతో కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. పరకాల పట్టణంలో 8 టన్నుల వేస్టేజ్ ఉత్పత్తి అవుతున్నందున పర్యావరణానికి తీవ్ర ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. కంపోస్ట్ యూనిట్ల ద్వారా వ్యర్థాలను ఉపయోగించి కంపోస్టు ఎరువులను తయారు చేయడం ద్వారా ఆర్థిక పరిపుష్టితోపాటు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు.
100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కంపోస్ట్ యూనిట్ల తయారీకి కావలసిన శిక్షణమెప్మా సహకారంతో ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంట్రెడ్డి,ఆర్డీవో డాక్టర్ కే నారాయణ, తహసిల్దార్ తోట విజయలక్ష్మి, ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, సమన్వయ కమిటీ నాయకులు సోదా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.