నవతెలంగాణ – తుంగతుర్తి
తుంగతుర్తి సర్కిల్ వ్యాప్తంగా సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిసినందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగతుర్తి సర్కిల్ సిఐ నాగేశ్వరరావు, ఎస్సై క్రాంతి కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసరం ఉంటే తప్ప వర్షాల సమయంలో బయటికి రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అన్ని గ్రామాలలోని చెరువులు, కుంటలు అలుగులు పోస్తున్నాయి. కావున అలుగుల దగ్గరికి చేపల వేటకు పిల్లల్ని వెళ్లనీయవద్దని కోరారు. రైతులు కరెంటు బావుల దగ్గరికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వరద నీరు వెళ్లే నాలాలు, మ్యాన్ హోల్స్ సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే ప్రమాదాలు గతంలో చూశామని, కావున ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిటి కన్నా ముఖ్యంగా ఎవరికివారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాత మట్టి గోడల ఇండ్లలో ఎవరైనా ఉన్నట్లయితే వేరొక చోట నివాసం ఉండాలని సూచించారు. అంతేకాదు ప్రధానంగా మెరుపులు పడుతున్న సమయంలో ఇనుప తీగలకు దూరంగా ఉండాలనీ, బట్టలు తీయడానికి పైఅంతస్థుకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇనుముకు సంబంధించిన వస్తువులను తాకకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఎందుకంటే విద్యుత్ ప్రవహించే అవకాశం ఉండి తద్వారా ప్రాణాలు కోల్పోతారని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కిల్ ప్రజలు సహకరించాలని కోరారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES