Tuesday, January 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజలు రైల్వే ట్రాక్‌లు దాటొద్దు

ప్రజలు రైల్వే ట్రాక్‌లు దాటొద్దు

- Advertisement -

భద్రతా మార్గదర్శకాలపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజరుకుమార్‌ శ్రీవాస్తవ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రైళ్లు సజావుగా నడపడానికి ట్రాక్‌ నిర్వహణ, పనులు జరిగే ప్రదేశాలు, ప్రాంతాల్లో భద్రతను నిర్ధారించడంలో రైలు కార్యకలాపాల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (జీఎం) సంజరుకుమార్‌ శ్రీవాస్తవ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కోరారు. లెవెల్‌ క్రాసింగ్‌ గేట్ల వద్ద భద్రతపై సాధారణ ప్రజలు రైల్వే ట్రాక్‌లను దాటొద్దని విజ్ఞప్తి చేశారు. జోన్‌ వ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రతను మెరుగుపర్చడానికి రైళ్లలోని విద్యుత్‌ పరికరాల భద్రతపై జోన్‌వ్యాప్తంగా భద్రతా తనిఖీలను కూడా ఆయన సమీక్షించారు. అగ్నిమాపక భద్రతకు సంబంధించి ఫైర్‌ అండ్‌ స్మోక్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఎస్‌డీఎస్‌) పనితీరుపై జోన్‌లో చేపట్టిన ప్రత్యేక భద్రతా డ్రైవ్‌ల గురించి అధికారులు వివరించారు. ఈ డ్రైవ్‌లను ముందుముందు కొనసాగించాలని డీఆర్‌ఎంలను ఆయన ఆదేశించారు. రైళ్ల లోపల, స్టేషన్‌ ప్రాంగణంలో అగ్ని ప్రమాదాలకు సంబంధించిన ముందస్తు జాగ్రత్త బోర్డులను ప్రముఖంగా ప్రర్శించాలని కోరారు. ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తతపై అవగాహన కల్పించాలని సూచించారు. అగ్నిమాపక యంత్రాలు, పొగ గుర్తింపు పరికరాలు వంటి అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలను అవసరాల మేరకు కొనుగోలు చేయడంలో చురుకైన ప్రణాళికలను రూపొందించాలని కోరారు. ఏమైనా సమస్యలను గమనిస్తే వాటిని తక్షణమే పరిష్కరిస్తూ అసాధారణ సంఘటనలు జరగకుండా నివారించడానికి సకాలంలో దోహడపడాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్‌ మేనేజర్‌ సత్యప్రకాశ్‌, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతోపాటు ఆరు డివిజన్ల డివిజనల్‌ రైల్వే మేనేజర్లు వీడియో కాన్షరెన్స్‌లో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -