విద్యార్థులు ఆందోళన చెందవద్దు ప్రశాంతంగా పరీక్షలు రాయండి
జిల్లా వైద్యాధికారి బి రామారావు
నవతెలంగాణ – బోనకల్
ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి రామారావు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఫార్మసీ స్టోర్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందుల స్టాక్ వివరాలను ఫార్మా సిస్టర్ రాధాలతను అడిగి తెలుసుకున్నారు. నార్మల్ డెలివరీ ల సంఖ్య వివరాలను మండల వైద్యాధికారిని వేముల స్రవంతిని అడిగి తెలుసుకున్నారు.
ఇదే సమయంలో వైద్యం కోసం వచ్చిన రోగులను మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యం ఎలా చేస్తున్నారని సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా అని వారిని ప్రశ్నించారు. ఇంతవారు మంచిగానే వైద్యం అందిస్తున్నారని సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా వారితో ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని కోరారు. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ ను ఈ నెల ఆఖరి లోపు పూర్తి చేయించాలని మండల ప్రాథమిక వైద్యాధికారిని వేముల స్రవంతికి సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మంచి వైద్యులు ఉంటున్నారని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బును పోగొట్టుకోవద్దని కోరారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మందులను పూర్తిస్థాయిలో సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల మందులు ప్రతిరోజు అందుబాటులో ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట మండల ప్రాథమిక వైద్యాధికారిని వేముల స్రవంతి, నర్సింగ్ ఆఫీసర్లు ఉదయశ్రీ, అనూష, ఫార్మసీ ఆఫీసర్ రాధాలత సిబ్బంది తదితరులు ఉన్నారు.
అనంతరం రెసిడెన్షియల్ విద్యాలయాలలో తనిఖీలలో భాగంగా మండల కేంద్రంలో గల బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట గదిలోకి వెళ్లి భోజనాలను పరిశీలించారు. వంట వారితో మాట్లాడి పలు సూచనలు చేశారు. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వంటగది స్టోర్ రూమును పరిశుభ్రతను ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఎటువంటి ఆందోళన భయపడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు.
ఆందోళన చెందటం వలన పరీక్షలో బాగా రాయలేరని, పరీక్షలు బాగా రాయలేదని ఆ తర్వాత భయాందోళన చెందటం దీని ఫలితంగా ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. పరీక్షలలో ముందుగా మీకు వచ్చిన వాటికి సమాధానం సంతృప్తిగా రాయమని సూచించారు. శాంతంగా ఉంటే పరీక్షలు కూడా బ్రహ్మాండంగా మీరు రాయగలుగుతారని ఆయన విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట విద్యాలయం ప్రిన్సిపాల్ పాసంగులపాటి వెంకట పద్మావతి పలువురు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.



