ఉద్యమాలే ఊపిరిగా జీవితం : సంస్మరణ సభలో పలువురు వక్తలు
నవతెలంగాణ-బంజారాహిల్స్
నిత్య అధ్యయన శీలుడు, మార్క్సిస్ట్ ఉపాధ్యాయులు, ప్రజా పోరాట యోధులు సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అని పలువురు వక్తలు కొనియాడారు. కమ్యూనిస్టులంతా ఐక్యం కావాలని కోరుకుంటున్న తరుణంలో.. సురవరం భౌతికంగా దూరం కావడం దురదృష్ట కరమన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో మంగళవారం సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన వహించి మాట్లాడారు. ప్రజా సమస్యలతో మమేకమై ఉద్యమాలను నిర్మించిన అగ్రగణ్యులు సుధాకర్‌రెడ్డి అని చెప్పారు. ఆయన లేని లోటు కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిదన్నారు. మీడియా అకాడమీ చైర్మెన్ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ ఫాసిస్టు ధోరణులను ముందే పసిగట్టిన నాయకులు సుధాకర్‌రెడ్డి అన్నారు. విద్యార్థి నేతగా మొదలైన ఆయన జీవితం.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారని కొనియాడారు. రావి నారాయణరెడ్డి ఆడిటోరియం ప్రాంగణంలో సుధాకర్‌రెడ్డి పేరుతో స్మారక హాల్ ఏర్పాటు చేయాలని, ఇందుకు ట్రస్ట్ సభ్యులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. చివరి క్షణం వరకు ఉద్యమాలే ఊపిరిగా జీవించిన గొప్ప నాయకుడు సుధాకర్‌రెడ్డి అని చెప్పారు. ఎంపీగా నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాల తరలింపు ద్వారా ఫ్లోరైడ్ సమస్య పరిష్కారించడానికి కృషి చేశారన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఎస్.వి.సత్యనారాయణ మాట్లాడు తూ.. సుధాకర్‌రెడ్డి సద్గుణాల్లో కొన్నైనా అలవ ర్చుకుని ఆచరించడం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. తెలంగాణ రచయిత సంఘం కార్యదర్శి నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ.. ఈ కల్లోల సమాజంలో మన కలలను చరిత్రార్థం చేసిన కల్లోల మేఘం సురవరం అని అన్నారు.
జస్టిస్(రిటైర్డ్) చంద్రకుమార్ మాట్లాడుతూ.. సురవరం సుధాకర్‌రెడ్డి తన తొలి రాజకీయ గురువు అని తెలిపారు. ఆర్థిక పోరాటాలను వర్గ పోరాటాలుగా మార్చడం, పార్టీ బలోపేతానికీ కృషి చేయడం ద్వారా ఆయన ఆశయం నెరవేర్చాల్సిన అవసరముందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండి.యూసుఫ్ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి ఎదగడానికి సురవరం సుధాకర్‌రెడ్డి స్ఫూర్తి అని తెలిపారు. సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమా కుల జంగయ్య మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి మరణం విప్లవోద్యమానికి తీరని లోటన్నారు. శ్రామిక మహిళా ఫోరం అధ్యక్షులు ప్రేం పావని మాట్లాడుతూ.. మహిళా నేతల రక్షణకు ఆయన అనునిత్యం ఆలోచించేవారిని గుర్తు చేసుకున్నారు. సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఆయన పేరుతో ప్రతి ఏటా స్మారకోపాన్యాసం, అవార్డు అందజేయడం సముచితంగా ఉంటుందన్నారు. సీనియర్ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఏ పనినైనా ప్రజాస్వామికంగానే కాకుండా మనస్ఫూర్తితో చేసే గొప్ప నాయకుడు సురవరం అని కొనియాడారు. ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ.. ఆయనను కోల్పోవడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని, దానిని సుధాకర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి కొంత తీర్చాలని కోరారు. కోశాధికారి ఉజ్జని రత్నాకర్ రావు మాట్లాడుతూ.. సురవరం తెలంగాణ అమరవీరుల సార్మక ట్రస్ట్ అధ్యక్షులుగా ట్రస్ట్ ఏర్పాటుతోపాటు నిర్వహణకు ఎనలేని కృషి చేశారన్నారు. సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి పట్ల పార్టీ, ప్రభుత్వం చూపిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు. తమ కోరిక మేరకు సురవరం సుధాకర్‌రెడ్డి స్వగ్రామంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి, పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని విధులు విడుదల చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకటరెడ్డి, రిటైర్డ్ జడ్జి కాంతయ్య, వ్యవసాయ శాస్త్రవేత్త అప్పారావు, రావి ప్రతిభా, శ్రీనివాస్ నాయుడు, టి.సురేశ్ పాల్గొన్నారు.
ప్రజా పోరాట యోధుడు సురవరం సుధాకర్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES