కోటి మందికి చీరల పంపిణీ.. వృద్ధులకు ప్రత్యేక సంఘాలు : మేడారం మాస్టర్ ప్లాన్, పుష్కర ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష
నవతెలంగాణ – ములుగు/గోవిందరావుపేట
మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో రూ.10లక్షలతో నిర్మించనున్న ‘ఇందిరా మహిళా శక్తి’ భవనానికి ఆమె భూమిపూజ చేశారు. అనంతరం మేడారంలో జిల్లా అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోందన్నారు.
మేడారం జాతరలో స్టాళ్ల ద్వారా మహిళలకు రెట్టింపు ఆదాయం లభించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాలో మహిళా సంఘాల సమావేశాల కోసం 42 శాశ్వత భవనాలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించాలని, పూర్తయిన ఇండ్లకు నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మేడారంలో గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు, జంపన్న వాగుపై చెక్ డ్యామ్‌ల నిర్మాణం కోసం సర్వే చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాలు(2027) సందర్భంగా పుష్కర ఘాట్ల వద్ద పారిశుధ్యం, పార్కింగ్, మరుగుదొడ్లు, హైమాస్ లైట్ల ఏర్పాటులో ఎలాంటి లోటు పాట్లు ఉండకూడదన్నారు.
ఇదే వేదికపై 25 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే, కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై బదిలీ అవుతున్న ఐటిడిఏ పీఓ చిత్ర మిశ్రాను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) సిహెచ్ మహేందర్ జి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ సునీత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, డీఆర్డీఓ శ్రీనివాస్, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, ఆర్డీఓ వెంకటేష్, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు’ప్రజా ప్రభుత్వం’ పెద్దపీట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



