నవతెలంగాణ హైదరాబాద్: సురవరం సుధాకర్ రెడ్డి పోరాట స్పూర్తితో ఫాసిస్ట్ ధోరణి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. రవీంద్రభారతీలో శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో బీవీ రాఘవులు మాట్లాడారు. ఆయన మొదలు పెట్టిన ఆశయాల సాధనకు కోసం కమ్యూనిష్టులందరూ ఏకమై కృషి చేయాలని ఆయన కోరారు. సుధాకర్ రెడ్డి, నేనూ ఏకకాలంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్ర నాయకత్వం స్థానంలో ఉన్నాం. అలా సుమారు 14 ఏండ్లు కలిసి పని చేసిన అనుబంధం ఉందని, ఆయన కలిసి అనేక అంశాలపై పోరాటాలు చేశామని గుర్తు చేసుకున్నారు. పలు అంశాలపై వాదోపవాదలు, భేదాప్రాయాలు వ్యక్తం చేశామని, ప్రజా పోరాటంలో సుధాకర్ రెడ్డిది చెదరని ముద్ర వేశారని కొనియాడారు.
ప్రజల సమస్యలపై కమ్యూనిష్టులను ఏకం చేసి ఆయన ముందుకు సాగిన తీరు నేటి కమ్యూనిష్టులతో పాటు ఇతరులకు ఆదర్శనీయమని చెప్పారు. ఉదాతనంతో, అందర్నీ కలుపుపోయేతత్వం, గొప్ప ప్రజాస్వామికవాది అని గుర్తు చేశారు. విద్యుత్ పోరాటం, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో సుధాకర్ రెడ్డి కీలక పాత్ర వహించారని తెలియజేశారు. అదే విధంగా రైతాంగానికి వ్యతిరేకంగా చేసిన నల్లచట్టాలను నిరసిస్తూ చేసిన పోరాటానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటు అని, ఆయన పోరాట స్ఫూర్తితో అందర్నీ కలుపుకోని ముందు వెళ్తామని, ఆయన కుటుంబానికి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రొఫెసర్ హరగోపాల్ , గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు.