Tuesday, March 31, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్సమస్యలపై ప్రజాపోరు

సమస్యలపై ప్రజాపోరు

- Advertisement -

– దద్దరిల్లిన కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు
– ఆశాల అరెస్టులపై నిరసనలు
– రాష్ట్ర వ్యాప్తంగా స్కీం వర్కర్ల ధర్నాలు
– జడ్చర్లలో ఆశాల భారీ రాస్తారోకో.. ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన పోలీసులు
– రూ.10వేల ఫిక్స్‌డ్‌ వేతనం కోసం మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నాలు
– విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికుల నిరసనలు

ప్రజా సమస్యలు, స్కీం వర్కర్ల వేతనాలు, డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ.. మరోవైపు ఆశాల అక్రమ అరెస్టులు, నిర్బంధంపై రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిరసనలు, ధర్నాలతో అట్టుడికాయి. వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడులు చేపట్టారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఆశాలు పెద్దఎత్తున రాస్తారోకో చేయగా.. పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. విద్యుత్‌ ఆర్టిజన్‌ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం రూ.10వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాలు చేశారు.
నవతెలంగాణ- విలేకరులు
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని నేషనల్‌ హైవే-44 రహదారిపై ఆశాలు భారీఎత్తున రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆశాలకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆశావర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడి దీప్లా నాయక్‌, నాయకులు తెలుగు సత్తయ్య, ఆశా కార్యకర్తలను ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో 163 జాతీయ రహదారిపై ఆశా వర్కర్స్‌ రాస్తారోకో చేపట్టారు. ఎస్‌ఐ ఉపేందర్‌ ఆధ్వర్యంలో నాయకులు రాజేందర్‌, సద్దాం, నీలాదేవి, రవి గౌడ్‌ను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. నాయకులను విడిచిపెట్టే వరకు తాము కదలబోమని ఆశాలందరూ రోడ్డుపైనే బైటాయించారు. అలాగే, ఏటూరునాగారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మహబూబాబాద్‌ జిల్లా కొరివి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలో అంబేద్కర్‌ సెంటర్‌లో మహాధర్నా చేపట్టారు.పెద్దపల్లి జిల్లా బసంతనగర్‌ ప్రధాన రహదారిపై ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, అశ్వారావుపేట తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ విగ్రహం వద్ద, మండల కేంద్రాల్లో రాస్తారోకోలు చేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆశా వర్కర్లు హైవేపై చేపట్టిన ధర్నాను పోలీసులు భగం చేశారు. ఉదయం నుంచి ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

విద్యుత్‌ ఉద్యోగుల నిరసన
విద్యుత్‌ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్స్‌, ఆన్‌మెండ్స్‌, పీస్‌ రేట్‌ కార్మికుల, స్పాట్‌ బిలర్‌ కార్మికులు సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(టీవీఏఈజేఏసీ) ఆధ్వర్యంలో ఆసిఫాబాద్‌ డివిజన్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వీరి పోరాటానికి 327, 1104 విద్యుత్‌ ఉద్యోగుల యూనియన్‌లు మద్దతు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా సర్కిల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు మహాధర్నా నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్‌ కార్మికులు మహాధర్నా నిర్వహించారు.

లేబర్‌ కోడ్స్‌ ప్రతులు దగ్ధం
ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా(టీయూసీఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నాలుగు లేబర్‌ కోడ్స్‌ ప్రతులను మహబూబాబాద్‌ జిల్లా కేందంలోని కోర్టు ఎదుట దగ్ధం చేశారు. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు కె.సూర్యం పాల్గొని మాట్లాడారు. లేబర్‌ కోడ్లు వెంటనే రద్దు చేయాలని కోరారు. వరంగల్‌ జిల్లాలో కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేరళ ప్రభుత్వం తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో నాలుగు లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ సత్య శారదకు వినతిపత్రాన్ని అందజేశారు.

గిరిజన గ్రామాల్లో వసతులు కల్పించాలని..
గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు డిమాండ్‌ చేశారు. నిర్మల్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట టీఏజీఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివాసుల సమస్యలపై ధర్నా నిర్వహించారు.

ఫిక్స్‌డ్‌ వేతనం కోసం మధ్యాహ్న భోజన కార్మికులు
తమ సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ ఆధ్వర్యంలో చలో రంగారెడ్డి కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌కు కార్మికులు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. ఈ అరెస్టులను ఖండిస్తూ ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు స్వప్న మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తే అరెస్టులు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తమకు రూ.10వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే కడ్తాల్‌ మండలంలో మధ్యాహ్న భోజన కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. ఈ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ కేటాయించి పెండింగ్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, అనంతరం కలెక్టర్‌ హరితకు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -