Saturday, March 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఅసైన్డ్‌ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

అసైన్డ్‌ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

- Advertisement -

ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తాం
మాదిగలకు అండగా ఉంటా : తెలంగాణ మాదిగ ఉద్యోగుల ధన్యవాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో అసైన్డ్‌ భూములకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా లిడ్‌క్యాప్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ భవన్‌, కాచిగూడ నింబోలిఅడ్డలో బాబూ జగ్జీవన్‌రాం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తామనీ, దానికి సంబంధించిన ప్రక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఈ విషయంలో సీఎస్‌తో సమీక్షించాలని మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్‌లకు సూచించారు. ఏప్రిల్‌ 14 అంబేద్కర్‌ జయంతిలోపే వాటికి అవసరమైన నిధులు విడుదల చేస్తామని చెప్పారు. మహాభారతంలో మిత్రుడు బార్బరీకుని కోసం సర్వం ఒడ్డి, ఊపిరిపోయే వరకు నిలబడి మిత్రధర్మం నిర్వహించిన కర్ణునిలా మాదిగలకు అండగా ఉంటానని మాటిచ్చారు.

కర్ణుని లక్షణం బలహీనుల పక్షాన నిలబడి పోరాడే లక్షణమనీ, అందుకే బలహీనులైన మాదిగల పక్షాన రాజకీయంగా నిలబడ్డానని సీఎం తెలిపారు. తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం నిర్వహించిన ధన్యవాద సభలో సీఎం ఏ.రేవంత్‌ రెడ్డి పాల్గొని మాట్లాడారు.ఎస్సీ వర్గీకరణ కోసం జరిగిన ఉద్యమంలో మొదట్నుంచి తన వంతు సాయం చేశానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. వర్గీకరణ కోసం గతంలో అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇస్తే నాటి ప్రభుత్వం తనను బయటికి పంపించిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రజాపాలన రావడంలో మాదిగలు అండగా నిలబడ్డారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించినట్టు చెప్పారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో వెనువెంటనే వర్గీకరణ కోసం అవసరమైన చర్యలను తీసుకున్నట్టు సీఎం తెలిపారు.

అదే క్రమంలో పదోన్నతుల్లో వర్గీకరణ, లిడ్‌క్యాప్‌ భూముల రక్షణ, అసైన్డ్‌ల్యాండ్స్‌ సమస్యలు అన్నింటినీ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. పరిష్కరించే క్రమంలో వెనుక నుంచి తనపై జరిగే దాడిలో అండగా నిలబడాలని ఆయన కోరారు. మాదిగల హక్కులకు లిఖితపూర్వకంగా చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదనీ, అవి చివరి పేదవారి వరకు చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులుగా మీదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పంచేందుకు ప్రభుత్వం వద్ద భూముల్లేవనీ, నజరానాలు ఇచ్చేందుకు నిధులు లేవనీ, నాణ్యమైన విద్యనందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. నాణ్యమైన విద్యతో ఐఏఎస్‌, ఏపీఎస్‌, ప్రజా ప్రతినిధులుగా ఎదిగి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు.

పదోన్నతుల్లో వర్గీకరణను పరిశీలిస్తాం : మంత్రి దామోదర రాజనర్సింహ
పదోన్నతుల్లో వర్గీకరణ అమలు డిమాండ్‌ను పరిశీలిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి నిబద్ధత కలిగిన నాయకుడనీ, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అన్ని ఒత్తిడులను తట్టుకుని ముందుకెళ్లారని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం, సామాజిక భద్రతను అందించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని తెలిపారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ అందించిన రిజర్వేషన్‌ ప్రయోజనాలు అందరికీ అందించాలనే లక్ష్యంతో చేసిన వర్గీకరణ ఫలాలు అందుతున్నాయని అన్నారు. విద్య ప్రవేశాల్లోనూ, ఉద్యోగ నియామకాల్లోనూ గతంలో ఎప్పుడు రాని ఎస్సీ ఉప కులాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో అంబేద్కర్‌ భవన్‌, కాచిగూడ నింబోలిఅడ్డలో బాబూ జగ్జీవన్‌రాం భవన్‌లను నూతన భవనాలను నిర్మించేందుకు అనుమతించాలని ముఖ్యమంత్రిని కోరారు.

లిడ్‌క్యాప్‌ భూములను కాపాడాలి
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రాష్ట్రంలో అసైన్డ్‌ భూములకు పట్టాలివ్వాలనీ, అదే విధంగా లిడ్‌క్యాప్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ప్రొఫెసర్‌ కాశీం మాట్లాడుతూ ఉన్నత విద్యలో అవకాశం కోసం ఒక జీవో ఇవ్వాలనీ, పదోన్నతుల్లో వర్గీకరణ కోసం మరో జీవోను జారీ చేయాలని కోరారు. ఓపెన్‌లో పదోన్నతులు పొందిన వారితో పోలుస్తూ ఎస్సీ రిజర్వేషన్లో నియామకం పొందిన వారి పదోన్నతులకు ఆటంకాలు కల్పిస్తున్నారని చెప్పారు. మాదిగ అమరవీరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం, డబుల్‌ బెడ్‌ రూం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనీ, జాంబవ భవన్‌ను తమకు కేటాయించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -