నవతెలంగాణ-హైదరాబాద్: పాలస్తీనియులను హింసించడానికి ఇజ్రాయిల్‌కు ప్రపంచం అధికారమిచ్చిందన్నట్లు వ్యవహరిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనా భూభాగంలో పాలస్తీనియన్లపై నిరంతరం హింస సాగుతోందని, ఇది శారీరక, మానసిక రూపాల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1967 నుండి ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో హక్కులపై యుఎన్ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఫ్రాన్సెస్కా అల్బనీస్ సోమవారం యుఎన్హెచ్ఆర్సిలో ‘హింస, జాతినిర్మూలన’ అనే పేరుతో తాజా నివేదికను ప్రదర్శించారు. ‘ఒకప్పుడు గోప్యంగా జరిగిన దాడులు, ప్రస్తుతం బహిరంగంగా కొనసాగుతున్నాయి. అత్యున్నత రాజకీయస్థాయిలో ఆమోదం పొందిన వ్యవస్థీకృత అమానుషం, బాధ, అవమానపాలన కొనసాగుతోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘హింస కేవలం జైలు గోడలు, విచారణ గదులకే పరిమితం కాలేదని’ ఇజ్రాయిల్ చేస్తున్న హింస ప్రభుత్వ విధానంగా మారిపోయిందని అన్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు, మంత్రులు మద్దతు తెలపడంతో ఇజ్రాయిల్‌కు పాలస్తీనియన్లను హింసించడానికి అనుమతి లభించినట్లైందని అన్నారు. సామూహికం నిర్బంధం, మానవతాసాయం, ఆహారాన్ని అనుమతించకపోవడం, విశృంఖలంగా కొనసాగుతున్న సైనిక దురాక్రమణ, పాలస్తీనా ప్రజలపై హింస, అణువణువునా నిఘా, దాడులతో ఆక్రమిత పాలస్తీనా భూభాగం ఒక సామూహిక శిక్షా కేంద్రంగా మారిందని అన్నారు.



