ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి : అసెంబ్లీ సహాయ కార్యదర్శికి బీఆర్‌ఎస్ నేతల వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు వ్యక్తిగత ప్రయోజనాలే కాదు…అభివృద్ధి కోసం కాదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ సహాయ కార్యదర్శి ఉపేందర్‌రెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలను తమ లేఖలో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అమాయాకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో పది మంది ఎమ్మెల్యేలు పాల్గొంటూనే…తాము కాంగ్రెస్‌లో చేరలేదని బుకాయిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామంటూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటనను ఈసందర్భంగా గుర్తు చేశారు.
ఆయనకు కేసీఆర్‌పై నమ్మకముంటే ఇంట్లో కేసీఆర్ ఫొటో, మెడలో బీఆర్‌ఎస్ కండువా వేసుకోవాలని సూచించారు. అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్టు చెబుతున్నారు సరే…కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ మారి ఇప్పుడు నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారి తప్పు చేశామంటూ ఆ పది మంది బహిరంగంగా ఒప్పుకోవాలనీ, లేదంటే పార్టీ మారలేదని కేసీఆర్ దగ్గర పిటిషన్ పెట్టుకోవాలని సూచించారు. వీళ్లంతా దొరికిపోయిన దొంగలనీ, సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.