రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల నిర్వాకం
గ్రేటర్ ఆదాయానికి భారీ గండి
కమర్షియల్ ప్రాపర్టీలు రెసిడెన్షియల్‌గా..
భారీ గోదాములకూ ఇదే వర్తింపు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పర్సనల్ ట్యాక్స్ చర్చనీయాంశమవుతోంది. గ్రేటర్‌లోని చాలా సర్కిళ్లలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల విషయంలో భారీ అవినీతి చోటు చేసుకుంటోంది. రాజేంద్రనగర్ సర్కిల్‌లో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల పనితీరు వివాదాస్పదంగా మారింది. గ్రేటర్ ఆదాయానికి వారు గండికొట్టి పర్సనల్ ఆదాయాన్ని పెంచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కమర్షియల్ ప్రాపర్టీలు రెసిడెన్షియల్‌గా..
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని చాలా కమర్షియల్ ప్రాపర్టీలను ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్‌గా చూపించి యజమానుల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. వాస్తవాలు బయటకు వచ్చినా అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతుండటం గమనార్హం. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా చూసీచూడనట్టు వ్యవహరించడం సరికాదని పలువురు సూచిస్తున్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని డాకేట్ నెంబర్ 603లో (పీటీఐ నెంబర్ 1060601093లో) ఉన్న ప్రాపర్టీని రెసిడెన్షియల్ ప్రాపర్టీగా చూపించి సంవత్సరానికి రూ.232 మాత్రమే ట్యాక్స్ విధించారు. కానీ వాస్తవంగా అక్కడ ఆ ప్రాపర్టీ మొత్తం కమర్షియల్ ప్రాపర్టీగా ఉంది. అదేవిధంగా శివరాంపల్లిలోని ప్రధాన రహదారిపై ఉన్న కమర్షియల్ ప్రాపర్టీలో (పీటీఐ నెంబర్ 1060635679) మార్బుల్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాపర్టీని పూర్తిగా రెసిడెన్షియల్ ప్రాపర్టీగా చూపించి ప్రధాన రహదారిపై ఉన్న ఈ కమర్షియల్ కాంప్లెక్స్‌ను సబ్ జోన్ బి కేటగిరిలో ఉంచి దీనికి ట్యాక్స్ తక్కువ చేసి చూపించారు. ఉప్పర్‌పల్లిలోని మంత్ర మహల్ పక్కన ఉన్న మరో కమర్షియల్ ప్రాపర్టీ (పీటీఐ నెంబర్ 1060201829)లో ప్లెన్త్ ఏరియా తక్కువగా చూపించి ఇక్కడి ట్యాక్స్‌్ ఇన్‌స్పెక్టర్ ఆ కమర్షియల్ ప్రాపర్టీకి నామమాత్రంగా ట్యాక్స్ విధించి చేతులు దులుపుకున్నారు.
గోదాంలకు, షెడ్లకు నో ట్యాక్స్ …
సర్కిల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు కొన్ని గోదామ్‌లకు, షెడ్లకు ఎలాంటి ట్యాక్స్ నెంబర్ కూడా లేదు. కానీ ఇక్కడి ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు చూసీచూడనట్టు వ్యవహరించి, ఆ గోదాంల యజమానుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. మైలార్‌దేవ్‌పల్లిలోని డాకేట్ నెంబర్ 603లో శివరాంపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఉన్న సుమారు ఐదు గోదాంలకు ఇప్పటివరకు ఎలాంటి ట్యాక్స్ విధించలేదు. ఆ గోదాంలు కట్టి ఏండ్లు గడుస్తున్నా ట్యాక్స్ విధించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా బృందావన్‌కాలనీలో ఉన్న రెండు భారీ కమర్షియల్ షెడ్లకు ఒకదానికి మాత్రమే ట్యాక్స్ విధించారు. ఇంకో గోదామునకు ట్యాక్స్ విధించకుండా అధికారులు వదిలేశారు. ఆ రెండు గోదాంల యజమాని ఒకరే కావడంతో ఒకే నెంబర్ తీసుకుని రెండు గోదాములకు ఒక నెంబర్ చూపిస్తున్నారు. ఇందిరా గాంధీ హౌసింగ్ సొసైటీలో చాలా కమర్షియల్ గోదాంలకు అక్కడి ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు నామమాత్రంగా ట్యాక్స్ విధించి జీహెచ్‌ఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నారు. గగన్‌పహాడ్‌లోని పలు కమర్షియల్ గోదాములను రెసిడెన్షియల్‌గా మార్చి గతంలో పనిచేసిన కమిషనర్ భారీగా అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆరాంఘర్ నుంచి దుర్గానగర్ వైపు వెళ్తున్న ప్రధాన రహదారిపై ఒక వ్యక్తి ఎకరంపైగా స్థలంలో నాలుగు గోదాములను నిర్మించి ప్లాస్టిక్ పరిశ్రమ, మార్బుల్ షాప్, ఇతర గోదాములు నిర్మించాడు. వీటన్నింటికీ కలిపి అతి తక్కువ ట్యాక్స్ విధించి ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ చేతులు దులుపుకున్నారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు చేస్తున్న అక్రమాలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. జీహెచ్‌ఎంసీ ఆదాయానికి గండి పడేలా చేస్తున్న ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లపై కఠిన చర్యలు తప్పవు. ఇక నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తాం.
సురేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ సర్కిల్ నూతన కమిషనర్
అధికారుల పర్యవేకణా లోపం
ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. కొంతమంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు దశాబ్దకాలంగా ఇక్కడే పని చేస్తూ ఉండడం, వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లినా పైరవీలతో మళ్లీ రాజేంద్రనగర్ సర్కిల్‌కు వస్తున్నారు. ఇక్కడ వ్యక్తిగత ఆదాయం ఎక్కువగా ఉండడంతో వేరే ప్రాంతానికి వెళ్లి పని చేయడానికి పలువురు ఇష్టపడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వెళ్లి వీరి పనితీరును పర్యవేక్షించాల్సిన ఏఎంసీలు కార్యాలయానికే పరిమితం కావడంతో వీరి అవినీతి రోజురోజుకూ పెరిగిపోతున్నది. గతంలో పలువురు ఏసీబీ దాడుల్లో పట్టుబడినా ప్రస్తుతం పని చేసిన వారిలో ఎలాంటి మార్పు రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.