Friday, July 4, 2025
E-PAPER
Homeజాతీయంఖజానా నింపుతున్న వ్యక్తిగత పన్నులు

ఖజానా నింపుతున్న వ్యక్తిగత పన్నులు

- Advertisement -

– దేశ జీడీపీలో వీరిదే అధిక భాగస్వామ్యం
– తగ్గుతోన్న ‘కార్పొరేట్ల’ వాటా
– పన్ను చెల్లింపుదారులను పిండేస్తున్న మోడీ సర్కారు

మోడీ పాలనలో కార్పొరేట్‌ పన్నుతో వచ్చే ఆదాయం కంటే.. వ్యక్తుల ఆదాయంపై విధించే పన్నులే ప్రభుత్వ ఖజానాకు కీలక వనరుగా మారుతున్నాయి. అంతేకాదు.. కార్పొరేట్ల వాటాతో పోలిస్తే దేశ జీడీపీలోనూ అధిక వాటాను కలిగి ఉన్నాయి. సింహభాగం పన్నులు కట్టాల్సిన కార్పొరేట్లు గోరంత పన్నులు కడుతుండగా వారికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నజరానాగా రాయితీల రూపంలో కోట్లు గుమ్మరిస్తోంది. కానీ సగటు ఉద్యోగులు, ప్రజల నుంచి మాత్రం ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నది. మోయలేనన్ని భారాలు మోపుతున్నది. గత కొన్నేండ్లుగా దేశంలో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.
న్యూఢిల్లీ : భారత్‌లో కోట్లాది రూపాయలను గడిస్తున్న కార్పొరేటు, ఇతర బడా సంస్థలు పన్ను చెల్లింపుల ద్వారా దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయని సాధారణంగా వినిపించే మాట. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. చిన్న వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కార్పొరేట్‌ సంస్థల కంటే ఎక్కువ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చిపెడుతున్నారు. ఈ విధంగా ప్రతి ఏడూ ప్రభుత్వానికి ఆదాయం పెరిగిపోతున్నది. గత కొన్నేండ్లుగా దేశంలో ఇదే ట్రెండ్‌ కనిపిస్తుండటం గమనార్హం. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.


ఆదాయ పన్ను 28 శాతం ఎక్కువ
ఆదాయ పన్ను మార్గం ద్వారా 2024-25లో కేంద్రం రూ.12.57 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇది ప్రధానంగా వ్యక్తుల ఆదాయంపై విధించే పన్ను. ఇక కార్పొరేషన్‌ లేదా కార్పొరేట్లు ఆర్జించే లాభంపై విధించిన పన్ను రూ.9.8 లక్షల కోట్లుగా ఉన్నది. అంటే, వ్యక్తుల ఐటీ చెల్లింపులు అనేవి కార్పొరేట్ల కంటే 28 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక ఈ వ్యత్యాసం ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో 33 శాతానికి పెరుగుతుందన్నది ఒక అంచనా.
వేతన జీవులపై మోడీ సర్కారు దాడి
కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదకొండేండ్లలో అంబానీ, అదానీలతో పాటు ఇతర కార్పొరేటు, వ్యాపార సంస్థలు, వ్యక్తుల ఆదాయాలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. ఇక గత కొన్నేండ్ల నుంచి మోడీ సర్కారు వేతన జీవులపై పన్ను పోటుతో దాడి చేస్తున్నది. ముఖ్యంగా, ప్రతీ బడ్జెట్‌ సీజన్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సవరించే పన్ను శ్లాబులు వేతన జీవులకు గుదిబండగా మారుతున్న పరిస్థితులు విధితమే. వేతన జీవులపై విధించే పన్ను విషయంలో మోడీ సర్కారు, నిర్మలా సీతారామన్‌పై సోషల్‌ మీడియాలో విపరీతమైన జోక్స్‌, మీమ్స్‌ పేలుతోన్నాయి.


తొమ్మిదేండ్లలో సీన్‌ రివర్స్‌
ప్రభుత్వ డేటా ప్రకారం ఆదాయ పన్ను, కార్పొరేషన్‌ పన్ను మధ్య నిష్పత్తిని గమనిస్తే ఈ విస్తృతమైన వ్యత్యాసాలను గమనించొచ్చు. 2016-17లో ఆదాయపు పన్ను కంటే.. కార్పొరేట్‌ పన్ను ద్వారా వచ్చిన మొత్తం 28 శాతం ఎక్కువగా ఉన్నది. ఆ సమయంలో కార్పొరేట్‌ పన్ను ద్వారా సమకూరిన మొత్తంలో ఆదాయపు పన్ను మార్గం ద్వారా వచ్చింది 72 శాతమే. అయితే, 2024-25 నాటికి అది పూర్తిగా రివర్స్‌ అయింది. ఆదాయపు పన్ను 128 శాతం పెరిగింది. 28 శాతం పెరుగుదలను అధికంగా నమోదు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ పెరుగుదల 133 శాతంగా, అంటే కార్పొరేటు పన్ను ద్వారా సమకూరే మొత్తం కంటే ఆదాయపు పన్ను ద్వారా వచ్చి చేరే మొత్తం 33 శాతం అధికంగా ఉండనున్నది.


జీడీపీలో ఆదాయ పన్ను వాటా 3.8 శాతం
ఇక దేశ జీడీపీలోనూ కార్పొరేట్‌ ట్యాక్స్‌ల కంటే వ్యక్తిగత ఆదాయ పన్నులే ఎక్కువ శాతాన్ని కలిగి ఉన్నాయి. 2016-17లో దేశ జీడీపీలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ వాటా 3.2 శాతంగా ఉంటే, ఆదాయ పన్ను వాటా 2.3 శాతమే ఉన్నది. 2024-25 నాటికి ఇది పూర్తిగా మారిపోయింది. దేశ జీడీపీలో ఆదాయ పన్ను వాటా 3.8 శాతానికి పెరగగా.. కార్పొరేట్‌ ట్యాక్స్‌ షేర్‌ 3.0 శాతానికి పడిపోయింది.

కార్పొరేట్లకు తాయిళాలు..
ప్రజలకు కష్టాలు కార్పొరేట్లకు తాయిళాలు ప్రకటించే మోడీ సర్కారు.. వేతన జీవుల రెక్కల కష్టం మీదనే నడుస్తున్నదనీ, ఇందుకు పైన పేర్కొన్న గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనమని మేధావులు, విశ్లేషకులు చెప్తున్నారు. వేతన జీవులపై పన్ను రేటును తగ్గించాలనీ, ఎక్కువ ఆదాయాలు, లాభాలను గడించే కార్పొరేట్‌, బడా పరిశ్రమల ద్వారా ఆదాయాన్ని రాబట్టే విషయంపై మోడీ సర్కారు ఆలోచన చేయాలని వారు సూచిస్తున్నారు.
కార్పొరేటు సంస్థల్లో పని చేసేవారే ఆ కంపెనీల కంటే ఎక్కువ శాతం దేశ ఆదాయంలో, జీడీపీలో భాగమవ ుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. కార్పొరేట్లు పన్నులు ఎగ్గొడుతూ ప్రభుత్వ ఖజనాకు చిల్లుపెడుతోన్నా మోడీ సర్కార్‌ మాత్రం సాధారణ ప్రజల నుంచి ఆదాయాలను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -