Tuesday, October 7, 2025
E-PAPER
Homeజాతీయంబీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ కొట్టివేత

బీసీ రిజర్వేషన్లపై పిటిషన్‌ కొట్టివేత

- Advertisement -

విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉండటమే కారణం
అక్కడే తేల్చుకోవాలన్న
సర్వోన్నత న్యాయస్థానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 9ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున విచారణకు నిరాకరించింది. విచారణ పరిధి హైకోర్టులో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో 9ని తీసుకువచ్చింది. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ గతనెల 29న వంగ గోపాల్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ప్రభుత్వ జీవోతో తనకు నష్టం జరుగుతుందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ దవే, అభిషేక్‌ మను సింఘ్వీ, ఏడీఎన్‌ రావులు హాజరయ్యారు. తొలుత పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవో 9ని సవాల్‌ చేస్తూ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్టు చెప్పారు. మధ్యలో ప్రభుత్వం తరపు న్యాయవాది ఏడీఎన్‌ రావు జోక్యం చేసుకొని…

ఇదే అంశంపై హైకోర్టులో రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనానికి నివేదించారు. ఈ వాదనలపై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ స్పందిస్తూ… ”హైకోర్టు స్టే ఇవ్వకపోతే, ఆర్టికల్‌ 32 కింద సుప్రీంకోర్టుకు వస్తారా?. అసలు 32 ప్రకారం పిటిషన్‌ ఎందుకు ఫైల్‌ చేశారు” అని ప్రశ్నించారు. మరోసారి పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… దసరా సెలవులకు ముందు, హైకోర్టు చివరి పని దినం రోజు ముగిశాక శుక్రవారం సాయంత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 తీసుకువచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ జీవోను సవాల్‌ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశామన్నారు. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. జీవోపై స్టే ఇవ్వలేదని తెలిపారు. అందువల్లే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో 9 ప్రకారం… ఈ నెల 9 నుంచి నామి నేషన్లు ప్రక్రియ మొదలు కానుందని తెలిపారు. అందువల్ల స్టే ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అలాగే ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లపై ఈ నెల 8న హైకోర్టు విచారణ చేపట్టనున్నట్టు వివరించారు.ఈ వాదన లతో ఏకీభవించని ధర్మాసనం పిటిషన్‌ను విచారిం చేందుకు నిరాకరించింది. ఆర్టికల్‌ 32 కింద నేరుగా సుప్రీంకోర్టుకు ఎలా వస్తారని జస్టిస్‌ సందీప్‌ మెహతా ప్రశ్నించారు. ఈ అంశంపై హైకోర్టులోనే రెండు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున అక్కడే తగిన ఉత్తర్వులు పొందాలన్నారు. విచారణ పరిధి రాష్ట్ర హైకోర్టు పరిధిలోనిదని తేల్చి చెప్పారు. పిటిషన్‌ను ఉప సంహరించుకునేందుకు పిటిష నర్‌కు స్వేచ్ఛను ఇస్తూనే డిస్మిస్‌ చేస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -