నవతెలంగాణ – ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో కుక్కలకు వ్యాపిస్తున్న చర్మ సంబంధిత వ్యాధులపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన గ్రామ సభలో ఈ సమస్యను ప్రస్తావిస్తూ, వెటర్నరీ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు చర్మ వ్యాధులతో బాధపడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఇతర జంతువులకు మాత్రమే కాకుండా మనుషులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి, గ్రామంలోని కుక్కలకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించడంతో పాటు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే గ్రామంలో శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, గ్రామ ప్రజలు మరియు జంతువులను రక్షించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.



