– ఈసీకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ పిటిషన్లపై స్పందించాలని ఈసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. అక్టోబర్ 28 నుంచి 12 రాష్ట్రాల్లో రెండో దశ సర్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వంటి రాజకీ పార్టీలు, ఎన్‌జీఓలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గతంలో కూడా సర్ ప్రక్రియ జరిగింది కదా.. అని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణలో పిటిషనర్లను ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ల తరుపున న్యాయవాదులు స్పందిస్తూ ‘గతంలో సర్‌ను నిర్వహించినా.. అప్పుడు ఇది జాగ్రత్తగా, సుదీర్ఘంగా జరిగిందని, దాదాపు మూడేండ్లు పట్టింది’ అని చెప్పారు. ‘కానీ, ఎన్నికల సంఘం ఇప్పుడు దీన్ని కేవలం ఒక్క నెలలోనే పూర్తి చేయాలనుకుంటుంది. లక్షలాది మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నారు’ అని సమాధానం ఇచ్చారు. సర్ నిర్వహిస్తున్న 12 రాష్ట్రాలూ భౌగోళికంగా, సాంస్కృతికంగా ఒకదానికొకటి భిన్నమైనవి అని డీఎంకే తరపు న్యాయవాది కపిల్ సిబాల్ తెలిపారు. ఇప్పటికి అనేక రాష్ట్రాల్లోని వివిధ గ్రామీణ ప్రాంతాలు ఇంటర్నెట్ సదుపాయానికి దూరంగా ఉన్నాయని, డ్రాఫ్ట్ రోల్‌ల్లో పేరు కనిపించని ఓటర్లు తమ వివరాలను ఎలా అప్‌లోడ్ చేస్తారని ప్రశ్నించారు.
‘సర్’పై పిటిషన్లు
- Advertisement -
- Advertisement -



