వాత పెట్టి నూనె రాసినట్లు ప్రభుత్వ విధానాలు
అంతర్జాతీయంగా చమరు ధరలు తగ్గినా మోడీ తగ్గించరు
నవతెలంగాణ – ఆలేరు
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే డీజిల్ పెట్రోల్ గ్యాస్ లను జీ.ఎస్.టి. పరిధిలోకి తీసుకురావాలని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. సోమవారం నాటి నుండి జీ.ఎస్.టి. తగ్గించడం వల్ల పేద మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందని చెప్పడం దీపావళి ముందుగానే వచ్చింది అనడం హాస్యాస్పదంగా ఉందంటూ నవ తెలంగాణతో చెప్పారు. నిత్యవసర సరుకులపై 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో అత్యధిక టాక్స్లవసూలులు చేసి ఇప్పుడు తగ్గించామంటూ గొప్పగా చెప్పుకోవడం పేద మధ్యతరగతి ప్రజల కు వాత పెట్టి నూనె రాసినట్లు గా ఉందంటూ మోడీ ప్రభుత్వం జీ.ఎస్.టి. తగ్గిందని చెప్పుకోవడం పట్ల ఎద్దేవా చేశారు.
అంతర్జాతీయంగా చమరు ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో ప్రస్తుతం 61 శాతం టాక్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి అన్నారు. బిజెపి మోడీ ప్రభుత్వం 43% టాక్స్ తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం18% టాక్స్ తో ఇద్దరు కలిసి అరవై ఒక శాతం వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ గ్యాస్ తీసుకు వస్తే జీ.ఎస్.టి.18 శాతం పన్నుతో ఇప్పుడున్న ధరలతో 43% తగ్గుతాయి. ఈ పని ఎందుకు చేయడం లేదో చెప్పాలన్నారు.
ప్రస్తుతం పెట్రోల్ 107 రూపాయల వరకు చేరుకుంది అదే జీ.ఎస్.టి. పరిధిలోకి తీసుకువస్తే 70 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది గ్యాస్ బండ రూ.500 డీజిల్ రూ.45 ప్రజలకు ఇవ్వవచ్చు అని వివరించారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పటికీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక ధరలు మనదేశంలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ భారత్ కు దిగుమతి 40 శాతం సబ్సిడీతో దిగుమతి అవుతుంది. అయినా పెట్రోల్ ధరలు తగ్గడం లేదు.. ఎందుకంటే ఆ వచ్చిన క్రూడ్ ఆయిల్ అంబానీ కంపెనీలు శుద్ధిచేసి ఐరోపా దేశాలకు ఎగుమతి చేసుకొని లక్షల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రజలకు ఎలాంటి ఉపశమనం లేదన్నారు రష్యా నుండి దిగుమతి చేసుకున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంపు 50% సుంకాల పేరుతో మన ప్రజలకు ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్పోరేట్లకు వత్తాసు పలుకుతుంది మోడీ ప్రభుత్వం అంటూ విమర్శించారు.
ప్రధాని మోడీ ఎన్నికల రాగానే హిందూ ముస్లిం పాకిస్తాన్ చైనా అంటూ ప్రజలను మనోభావాలను రెచ్చగొట్టి గద్దెనెక్కి 80 శాతం గా ఉన్న హిందువులకు మీదనే టాక్స్లు వసూలు చేస్తున్న ప్రజలు గుర్తించలేని విధంగా బిజెపి బోధిమీడియా వాట్స్అప్ యూనివర్సిటీలు ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తుండడం పట్ల దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి ప్రజలను చైతన్యం చేయడంలో ముందు ఉండే కమ్యూనిస్టుల బలం చట్టసభల్లో పెరగాల్సిన అవసరం ఎక్కువగా ఉందన్నారు. బూర్జువా పార్టీలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి.
ప్రజలకు వ్యతిరేకంగా వచ్చే చట్టాలకు మద్దతు ఇవ్వడం లేదా తటస్థంగా ఉండడం చేస్తున్నాయి.2019లో ఒక లక్షా నలభై ఏడు వేల కోట్లు కార్పోరేట్లకు టాక్సీలు మినాయింపు తో రాయితీ ఇచ్చింది. ఇది ప్రజల సొమ్ము అని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం అదే సంవత్సరంలో రెండు లక్షల 40 వేల కోట్లు పెట్రోల్ మీద టాక్స్ రూపేనా సామాన్య మధ్యతరగతి పేద ప్రజల నుండి వసూలు చేసింది కార్పొరేట్లకు రాయితీలు ప్రజలకు కష్టాలు పాలక పక్షాల పాలన తీరు ఉందన్నారు.
సెప్టెంబర్ 22 నుండి నిత్యవసర ధరలు జీఎస్టీ నుండి 18 నుండి 5 శాతానికి తగ్గిపోతుందని బిజెపి ఐటీ సెల్ గోది మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది.బిజెపి పార్టీ అయితే ఏకంగా మోడీ చిత్రానికి పాల అభిషేకం చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టూత్ పేస్టులు సబ్బులు తలనూనె లాంటి ధరలు తగ్గితే మహా అంటే 500 నుండి వెయ్యి రూపాయలు రూపాయలు ఒక కుటుంబానికి మిగులుతుండొచ్చు నిజంగా తగ్గించాల్సింది పెట్రోల్ డీజిల్ గ్యాస్ వాడని ఇల్లు లేదు వీటి ధరలు తగ్గితే ఒక్కొక్క కుటుంబానికి నెలకు 3 నుండి 5వేల రూపాయల వరకు భారం తగ్గుతుంది.
డీజిల్ ధర తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి కూరగాయలు పప్పు దినుసులు ఇలా ఒక్కటేంటి వందలాది వస్తువుల ధరలు తగ్గుతాయి తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి తిరిగి వస్తువులు కొనడం వల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కానీ ఆ పని ప్రభుత్వాలు చేయడానికి సిద్ధంగా లేరు అన్నారు.పోరుగు దేశాలైన అడుక్కుతింటున్న పాకిస్తాన్ దివాలా తీసిన శ్రీలంకలో కూడా భారత్ కంటే తక్కువ ధరలో పెట్రోల్ ఉంది. రష్యా నుండి సబ్సిడీతో వస్తున్న పెట్రోల్ ఉత్పత్తులు అంబానీ కంపెనీ లాభాల కోసం ప్రభుత్వ విధానాలు ఉన్నాయి తప్ప భారతీయుల కోసం హిందువుల పేద మధ్యతరగతి ప్రజల కోసం కాదన్నారు .
చిరు వ్యాపారులను సైతం జీ.ఎస్.టి. పరిధిలోకి
గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా షాపులు తోపుడు బండ్లు వ్యాపారులు బట్టల షాపులు ట్రాక్టర్ యజమానులు చిన్న చిన్న హోటల్స్ సైతం వదిలిపెట్టకుండా జిఎస్టి పరిధిలోకి తెచ్చేందుకే కొత్త కుట్రకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. బ్యాంకుల నుండి ఏటీఎంలో నుండి 500 నోట్లను త్వరలో అందుబాటులో లేకుండా చేసి మొత్తం డిజిటల్ పేమెంట్ ల ద్వారా లావాదేవీలు జరిపే విధంగా ప్రభుత్వం ముందు ముందు ప్రజలకు నొప్పి తెలియకుండా బారాలు వేయనుంది అన్నారు బ్యాంకర్లకు మౌఖిక ఆదేశాలు కూడా అందాయన్నారు.ప్రస్తుతం కొన్ని వస్తువులు ధరలు తగ్గినట్టు అనిపించినా రాబోయే కాలంలో అన్ని వ్యాపారలను జీ.ఎస్.టి. పరిధిలోకి తీసుకువస్తే ప్రజలకు పెనుబారం కానుందని హెచ్చరించారు. బిజెపి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే ప్రజల తక్షణ కర్తవ్యం గా ఉందన్నారు.