నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు. దీనికి సృజన తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు. సిద్ధిపేట జిల్లా నంగునూరుకు చెందిన టేకు కుమార స్వామి ప్రస్థానమే ఇందుకు నిదర్శనం. పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించిన కుమారస్వామి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. హాస్టల్‌లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. బుడగ జంగాల సామాజిక తరగతికి చెందిన కుమారస్వామి పట్టుదలతో పీహెచ్‌డీ పట్టా అందుకుని పలువురి ప్రశంసలు అంరదుకున్నాడు.
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని రామచంద్రాపూర్‌కు చెందిన టేకు కుమారస్వామి ‘ఆకుకూరల్లో కాడ్మియం విష ప్రభావాన్ని తగ్గించడంలో పర్పుల్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా పాత్ర’ (రోల్ ఆఫ్ పర్పుల్ నాన్-సల్ఫర్ బ్యాక్టీరియా టూ మిటిగేట్ కాడ్మియం టాక్సిసిటీ ఇన్ లీఫీ వెజిటబుల్స్) అనే అంశంపై పరిశోధన చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య రజని పర్యవేక్షణలో వృక్షశాస్త్రంలో ఈ పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. దాంతో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా లభించింది. ఈ పరిశోధన ద్వారా ఆకుకూరల్లో భారీ లోహాల వల్ల కలిగే విష ప్రభావాన్ని తగ్గించేందుకు జీవ సాంకేతిక పరిష్కారాలకు మార్గం సుగమం అవుతుంది. మట్టి లేకుండా నీటితో మొక్కలు పెంచే (హైడ్రోపోనిక్స్) పద్ధతిలో కూరగాయల సాగుపైనా కుమారస్వామి పరిశోధనలు చేశారు. ఈ పద్ధతిలో మట్టి లేకుండా నీటిలో పోషకాలను కలిపి మొక్కలను పెంచారు. దీనివల్ల తక్కువ స్థలంలో కలుపు, పురుగుల బెడద లేకుండా ఏడాది పొడవునా అధిక దిగుబడులు సాధించవచ్చు. పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్, ఔషధ పుట్టగొడుగుల సాగు (మెడిసినల్ మష్రూమ్ కల్టివేషన్), తాజా లేదా ఉప్పు నీటిలో పెరిగే ఒక రకమైన నీలి-ఆకుపచ్చ ఆల్గే (శైవలం) అయిన స్పైరులినా ఉత్పత్తి వంటి ఆధునిక వ్యవసాయ జీవ సాంకేతిక అంశాలపైనా విస్తృతంగా పరిశోధనలు చేశారు. ప్రత్యేకంగా ఔషధ గుణాలు అధికంగా ఉన్న కార్డిసెప్స్, మెడిసినల్ మష్రూమ్ సాగుపై కుమారస్వామి చేసిన పరిశోధనలు ఆరోగ్య రంగానికి ఉపయోగపడే విలువైన ఉత్పత్తుల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పవచ్చు. ఆర్థిక పరిమితులు, వ్యక్తిగత కష్టాలను అధిగమిస్తూ అపారమైన కృషి, పట్టుదలతో ఉన్నత విద్యను పూర్తి చేసిన కుమారస్వామి విజయం గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.
పేదరికాన్ని అధిగమించి..
కుమార స్వామి తల్లిదండ్రులు ఎల్లవ్వ, ఉప్పలయ్య దినసరి కూలీలు. కూలి దొరకని రోజు పస్తులే. ఈ స్థితిలో తమ పిల్లలను బడికి పంపడం వారి ఆర్ధిక స్థితికి సాధ్యం కాదు. ఈ స్థితిలో ఉపాధ్యాయులు కుమారస్వామి గుర్తించి నంగునూరు బీసీ విద్యార్థుల వసతి గృహంలో ఒకటో తరగతిలో చేర్పించి బడికి వెళ్లేలా చేశారు. నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 496 మార్కులు పొందారు. నంగునూరు జూనియర్ కళాశాలలో చేరి ఇంటర్ చదువుతూనే సెలవుల్లో కూలి పనులకు వెళ్లేవాడు. ఇంటర్ బైపీసీ 727 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బీజెడ్‌సీ) కోర్సులో 1058 మార్కులు సాధించారు. పీజీ ప్రవేశ పరీక్షలు ప్రతిభను కనబరిచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్సీ (వృక్ష శాస్త్రం) చదివారు. ఎమ్మెస్సీలో 1641 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. యూజీసీ నెట్ (జాతీయ అర్హత పరీక్ష) రాసి ఉత్తీర్ణులుయ్యారు. దాంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హత సాధించారు. తాజాగా పీహెచ్‌డీ పట్టాను పొందారు.
ప్రోటీన్ బౌల్స్ అమ్మి..
ఉస్మానియాలో పీహెచ్‌డీ చేస్తూనే తన కుటుంబ పోషణ కోసం కుమారస్వామి సూపర్ సలాడ్ ప్రోటీన్ బౌల్స్ అమ్మారు. హైదరాబాద్‌లో విశేష ఆదరణ పొందిన ఆ ప్రోటీన్ బౌల్స్, హెల్తీ సలాడ్స్‌కు ట్రెండ్‌ను హైదరాబాద్ నగరంలో తొలిసారిగా ప్రజల్లోకి తీసుకువచ్చారని అంటున్నారు. ‘సూపర్ సలాడ్స్’ బ్రాండ్ పేరుతో ప్రోటీన్ అధికంగా ఉన్న 20 రకాలయిన ధాన్యాలు, తాజా కూరగాయలతో సహజమైన పదార్థాలతో, పోషక విలువలు కోల్పోకుండా ప్రోటీన్ బౌల్స్‌ను తయారుచేస్తున్నారు. ఈ ప్రోటీన్ బౌల్స్‌ను రూ.30, రూ.40, రూ.50ల బాక్స్‌ల్లో అమ్ముతూ ఉపాధి పొందుతున్నాడు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ సమీపంలో వీటిని విక్రయిస్తున్నారు. కుమార స్వామి తయారు చేసిన సూపర్ సలాడ్ బ్రాండ్‌కు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 10 లక్షల మంది వీక్షించడం గమనార్హం. ఈ సూపర్ సలాడ్ బౌల్‌ను హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారు.
సుద్దముక్కలు, కూరగాయలతో నమూనాలు
ఇంటర్ చదివే సమయంలో అప్పటి ప్రధానాచార్యుడు సుదర్శన్.. వ్యర్థాలతో వివిధ అలంకరణ సామగ్రి తయారు చేసేవాడు. సుదర్శన్ రూపొందించిన వాటిని గమనించిన కుమార స్వామి.. తనలోని సృజనాత్మకతకు పదును పెట్టాడు. ఎలాంటి శిక్షణ లేకుండానే తీరిక సమయాల్లో సుద్ద ముక్కలతో వివిధ వస్తువులను తయారు చేసేందుకు ప్రయత్నించి సఫలమయ్యాడు. అలా స్వయంగా అభ్యసించి వివిధ వస్తువులను అందంగా తయారు చేస్తూ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. వివిధ సందర్భాల్లో కూరగాయలతో నమూనాలు తయారు చేసి పర్యావరణ రక్షణ కాంక్షను తెలిపి అభినందనలు పొందాడు. కుమార స్వామి 2011, 2015 సంవత్సరాల్లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ పోటీల సమయంలో వినూత్నంగా ఆలోచించాడు. క్రికెట్ అభిమానులకు పర్యావరణ ఆవశ్యకతను తెలిపేందుకు కూరగాయలతో ప్రపంచ కప్ నమూనాలను రూపొందించి పలువురి ప్రశంసలు పొందాడు. 2011 ప్రపంచ కప్ సమయంలో దోసకాయ, టమాటాలతో రూపొందించిన ప్రపంచ కప్ నమూనా ద్వారా యువతలో పర్యావరణ చైతన్యానికి కృషి చేశాడు. 2015 ప్రపంచ కప్ పోటీల సమయంలో వంకాయ, టమాటాతో రూపొందించిన ప్రపంచ కప్ నమూనాతో పర్యావరణ పరిరక్షణ ప్రచారం చేసి అభినందనలు అందుకున్నాడు.
సొప్పారి రాములు
9959003290



