నరహరిపురంలోని శరభయ్య ఒకసారి పొరుగూరుకు కాలినడకన తన చేతిలో డబ్బు సంచీతో పనిమీద బయలుదేరాడు. అతడు ఆ ఊరుకు వెళ్లాలంటే ఒక అడవిని దాటాల్సి ఉంది. ఆ అడవిలో క్రూరమగాలు లేవు. అందువల్ల శరభయ్య ఎవ్వరూ తోడు లేకుండా ఒంటరిగా బయలుదేరాడు.
అతడు ఆ అడవిని సమీపించగానే అకస్మాత్తుగా వెనుకనుండి ఒక కోతి వచ్చి అతని సంచిని లాక్కొని మెరుపులా మాయమైంది.శరభయ్య దాని వెంబడి పరిగెత్తినా లాభం లేకపోయింది. తన అజాగ్రత్తకు తనను తానే తిట్టుకున్నాడు శరభయ్య. ఆ సంచిలో చాలా డబ్బు ఉంది. ”అయ్యో! ఇప్పుడు నా సంచి ఎలా దొరుకుతుంది? డబ్బు లేకుండా నేను పొరుగూరు వెళ్లి ఏం ప్రయోజనం? అది లేకుండా నా పని పూర్తి కాదే! ఇప్పుడు నేను ఏం చేయాలి?” అని ఏడవసాగాడు.
ఇంతలో రామయ్య అనే వ్యక్తి ఎదురుగా వచ్చి ఎందుకు ఏడుస్తున్నావని ఆ శరభయ్యను ప్రశ్నించాడు? శరభయ్య తాను డబ్బు సంచి పోగొట్టుకున్నట్లు చెప్పాడు. అప్పుడు రామయ్య ”మీరేం బాధపడకండి! మీ సంచి మీకు తప్పకుండా దొరుకుతుంది. మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళితే అక్కడ చేమంతిపురం అనే ఊరు వస్తుంది. అక్కడ ధర్మయ్య అనే పరోపకారికి ఈ కోతుల గురించి బాగా తెలుసు. చాలా కోతులు ఆయన ఇంటికి ఆహారం కొరకు వస్తాయి కూడా! బహుశా ఈ కోతి కూడా ఆయన ఇంటికి వెళ్లి ఉంటుంది. అక్కడ మీ సంచి దొరకవచ్చు” అని సలహా ఇచ్చాడు.
వెంటనే శరభయ్య ఆ ఊరికి చేరి ధర్మయ్యను కలిసి తన డబ్బు సంచి ఒక కోతి ఎత్తుకుపోయిందని చెప్పాడు. తర్వాత శరభయ్య ”అయ్యా! మీ ఇంటికి ఈరోజు కోతులు వచ్చాయా! వాటి చేతుల్లో మీరు నా సంచిని చూశారా?” అని ధర్మయ్యను ప్రశ్నించాడు. అప్పుడు ధర్మయ్య ”కోతులు వచ్చాయి గాని వాటి చేతుల్లో నేను ఆ సంచిని చూడలేదు. నీవేం భయపడకు! అవి తినే పదార్థాలు కావు కాబట్టి నీ సంచి ఎక్కడికీ పోదు. తప్పకుండా దొరుకుతుంది. అది అందులో ఏదైనా ఆహార పదార్థాలు ఉన్నాయేమోనని ఎత్తుకెళ్లింది. కోతికి డబ్బులు ఎందుకు? ఒక్క దొంగలకు మాత్రం ఆ సంచి దొరకకుంటే చాలు” అని ధైర్యం చెప్పాడు. అప్పుడు శరభయ్య చాలా నిరాశ పడ్డాడు. అది గమనించిన ధర్మయ్య ”ఒక పని చేద్దాం. రేపు మళ్లీ కోతులు వస్తాయి. అవి ఒకవేళ నీ సంచి తెచ్చినా ఫరవాలేదు. లేకుంటే మనమే వాటిని వెంబడించి వెళ్దాం! అంతవరకు నువ్వు మా ఇంట్లోనే ఉండు” అని అతనికి అతిథ్యం ఇచ్చాడు. అందుకు శరభయ్య సంతోషించాడు.
మరునాడు కోతులు వచ్చాయి. కానీ వాటి చేతుల్లో డబ్బు సంచి మాత్రం లేదు. వెంటనే ధర్మయ్య శరభయ్యతో పాటు కోతుల వెంబడి వాటిని అనుసరించి వెళ్ళాడు. అవి కొద్దిదూరం వెళ్ళిన తర్వాత అడవిలోని చెట్లల్లో మాయమయ్యాయి. అప్పుడు శరభయ్య చాలా నిరాశ పడ్డాడు. ధర్మయ్య అతనికి ధైర్యం చెప్పి తిరిగి వస్తుండగా ఒక చెట్టుకు ఆ సంచి వేలాడుతూ కనిపించింది. ధర్మయ్య వెంటనే దాన్ని తీసి చూశాడు. అందులో శరభయ్య డబ్బు సురక్షితంగా ఉంది. వెంటనే అతడు దానిని శరభయ్యకు అప్పగించాడు. శరభయ్య ఎంతో సంతోషించి ”అయ్యా! మీలాంటి పరోపకారులు ఉండడం వల్లనే నాలాంటి వారికి మేలు జరుగుతున్నది. మీ సహాయాన్ని నేను మరవలేను” అంటూ తన సంచిని వెతుకుటలో తనకు సహకరించినందుకు ధర్మయ్యకు తన ధన్యవాదాలను తెలిపాడు.
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535



