– కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు ఇచ్చే యోచనలో సిట్
– మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐపీఎస్ అనిల్ కుమార్‌లను కూడా ప్రశ్నించే అవకాశం
– నాలుగో రోజు కొనసాగిన ప్రభాకర్‌రావు విచారణ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఫోన్‌ట్యాపింగ్ కేసు మరో కీలక ములుపు తిరగబోతున్నది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావులను ఈ కేసులో విచారించడానికి గానూ వారికి నోటీసులు ఇచ్చే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి సిట్ అధిపతి, నగర పోలీసు కమిషనర్ వి.సి సజ్జనార్ తన తోటి విచారణాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగినట్టు ఇప్పటి వరకు సిట్ జరిపిన దర్యాప్తులో బయట పడింది. ఈ కేసులో ఇప్పటి వరకు విచారించిన పోలీసు అధికారుల నుంచి అన్యాపదేశంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోని కీలక నేతల ఆదేశాల మేరకే ఫోన్‌ట్యాపింగ్ జరిపినట్టు వాంగ్మూలాలనిచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా సిట్ కస్టడీలో ఉన్న ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్‌రావు విచారణలో సైతం తన పైఅధికారుల ఆదేశాల మేరకే ఫోన్‌ట్యాపింగ్ జరిపినట్టు సిట్ అధికారులు వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని కోణాల నుంచి విచారిస్తున్న సిట్ అధికారులు.. జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌లు దాదాపుగా రాజకీయపరమైనవే కావడం, వాటి వెనుక రాజకీయ దురుద్దేశాలే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయానికి వచ్చేలా ఉండటంతో సిట్ అధికారులు దీనిని రాజకీయ కోణంలో కూడా చూస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావులను విచారించాలనే యోచన సాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఒకట్రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశమున్నదని సమాచారం.
అదేసమయంలో ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ ఓఎస్డీగా ఉన్న సమయంలో రాష్ట్ర డీజీపీగా పని చేసిన మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన అదనపు డీజీ అనిల్ కుమార్‌లను సైతం విచారించడానికి సిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇక మంగళవారం నాలుగో రోజు తమ కస్టడీలో ఉన్న ప్రభాకర్‌రావును ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో ఇమిడి ఉన్న కొలిక్కిరాని వ్యవహారాలపై సిట్ అధికారులు విచారించారని సమాచారం.
ఫోన్‌ట్యాపింగ్ కేసు కీలక మలుపు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



