Tuesday, February 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫొటో మార్ఫింగ్‌ చట్టవ్యతిరేకం : హైకోర్టు

ఫొటో మార్ఫింగ్‌ చట్టవ్యతిరేకం : హైకోర్టు

- Advertisement -

నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోను మార్ఫింగ్‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని హైకోర్టు అభిప్రాయపడింది. మార్ఫింగ్‌ చట్ట వ్యతిరేకమని సుప్రీం కోర్టు ఉత్తర్వులను జారీ చేసిందని గుర్తు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి మార్ఫింగ్‌ ఫొటో పోస్టు చేశారంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన కావలి వెంకటేష్‌పై నమోదైన కేసుపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని మద్దూర్‌ పీఎస్‌ ఎస్‌హెచ్‌వో, ఫిర్యాదుదారు నర్సింహకు జస్టిస్‌ శ్రీనివాసరావు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను మార్ఫింగ్‌ చేసి, దాన్ని వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో పోస్టు చేశారన్న ఫిర్యాదు మేరకు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ వెంకటేష్‌ వేసిన పిటిషన్‌పై విచారణ ఈనెల 11కు వాయిదా వేశారు.

పిటిషనర్‌కు బెదిరింపుపై వివరణ ఇవ్వండి
గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలపై పిటిషన్‌ వేస్తే ఆ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థుల నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ న్యాయవాది బొమ్మరాజు నర్సింగ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తన పిటిషన్‌ వల్ల పరీక్షలను హైకోర్టు రద్దు చేసిందనీ, తనకు రక్షణ కల్పించాలని పిటిషనర్‌ వాదన. విచారణను ఈనెల తొమ్మిదో తేదీకి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తుకారాంజీ సోమవారం ప్రకటించారు. రక్షణ కల్పించాలని డీజీపీని కోరినప్పటికీ చర్యలు లేవనీ, కొందరు దాడి చేయడమే కాకుండా, కారు అద్దాలను పగలగొట్టి చంపుతామంటూ బెదించారని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తెచ్చారు.

భూసేకరణపై స్టేటస్‌కో
ఎలివేటెడ్‌ కారిడార్‌ కోసం సికింద్రాబాద్‌లోని వక్ఫ్‌బోర్డు భూ సేకరణ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్‌ బోర్డు సీఈవో కూడా కౌంటర్‌ దాఖలు చేయాలంది. విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. సికింద్రాబాద్‌లోని వక్ఫ్‌బోర్డుకు చెందిన నాలుగు ఎకరాల భూ సేకరణ చేయరాదంటూ వినతిపత్రం ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేదని మహమ్మద్‌ అబీద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తదుపరి విచారణ ఈనెల 11 వరకు భూసేకరణ ప్రక్రియపై స్టేటస్‌కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయని న్యాయమూర్తి సోమవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.

మల్లారెడ్డికి ఎదురుదెబ్బ
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమి విషయంలో బీఆర్‌ఎస్‌కు చెందిన మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సర్వే నెంబర్‌ 82లోని భూ సర్వేను నిలిపేయాలనే అప్పీల్‌ను కొట్టేసింది. 0.30 గుంటల భూమి తనదేనంటూ శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో భూమి హద్దులు నిర్ణయించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. సర్వే చేయాలంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇవ్వడాన్ని మల్లారెడ్డి, ఇతర కుటుంబసభ్యులు హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. సర్వే వల్ల భూయాజమాన్య హక్కులు తేలవనీ, భూమి హద్దులు మాత్రమే తేలుతాయనీ, కాబట్టి అప్పీల్‌దారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ద్విసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -