పండుగ నాడు- పట్టణ ప్రముఖ రాజకీయ నాయకుడు తన ఇంట్లో కూర్చుని ఇడ్లీ సాంబార్ లాగిస్తున్నాడు.
పట్టు చీర కట్టిన భార్య గబగబా వచ్చి ”ఏమండీ… టిఫన్ తిన్నాక మిద్దె మీదకు రండి. పండుగ రోజు కదా, పిల్లలతో కలిసి ఫొటో దిగుదాం” అని చెప్పింది.
పక్కనే బాంబు పడినట్లు గబగబా ఇడ్లీ ప్లేటులో చెయ్యి కడిగి ”నాకు అర్జెంటు పని ఉంది. వెళ్ళాలి” అని సర్రుసర్రున ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.
‘ఇదేందబ్బా… పిల్లలతో ఫొటో దిగడానికి కూడా టైం లేదంటాడు నా మొగుడు’ అని ఉరిమి చూసింది మొగుడు వెళ్తున్న జీపును.
ఆమె ముఖానికి జీపు వదిలే నల్ల పొగ తగిలింది తప్పితే సమాధానం దొరకలేదు. ‘ఫొటోలకు ఫోజులు ఇవ్వాలన్నా, భద్రంగా దాచుకోవాలన్నా ముచ్చట పడే నా మొగుడికి ఏమయ్యిందబ్బా’ అనుకుంటూ ఇంటి పనుల్లో మునిగిపోయింది.
—
స్వీట్ షాప్ ప్రారంభం…
రంగురంగుల బెలూన్లు గాలిలో ఎగురుతూ ఉన్నాయి. తీపి మిఠాయిలు పంచుతూ ఉన్నారు.
పలకరించి వద్దామని మన నాయకుడు అక్కడికి వెళ్ళాడు. తీసుకెళ్ళిన పూల గుత్తి వారికి అందించాడు.
వారిచ్చిన తీపి మిఠాయి తింటూ ఉండగా… పడవలాంటి కారు ఒకటి వచ్చి ఆగింది.
అందులో నుంచి బుల్లి తెర నటి దిగింది.
అందరూ ఎగబడి వెళ్లి నటిని ఆహ్వానించారు. పూలు, రంగు కాగితాలు చల్లారు. టపాకాయలు పేల్చారు. కొంటె కుర్రోళ్ళు కేకలు వేశారు.
మన నాయకుడు మాత్రం కుర్చీలోనే ఉండిపోయాడు.
అందరికీ నవ్వుల పువ్వులు విసురుతూ ఆ అందాల నటి మన రాజకీయ నాయకుడిని చూసింది. ‘లోకల్ లీడర్ కదా, మంచి చెడ్డలకు పనికి వస్తాడని అనుకుందేమో…’ నేరుగా మన నాయకుడి దగ్గరికి వెళ్ళింది.
మత్తెక్కించే సెంటు వాసనలు అతడిని ‘ఎక్కడికో తీసుకెళ్ళాయి. నవ్వుతూ ఆమె షేక్ హ్యాండ్ కోసం చేయి చాపింది.
ఆశ్చర్యపోయాడు. వెయ్యి నూనె దీపాల వెలుగు ముఖంతో షేక్ హ్యాండ్ ఇచ్చాడు ”సార్… మీతో సెల్ఫీ తీసుకోవాలని ఉంది, కాదనకండి” అని గోదావరి గలగలల్లా చిరునవ్వు నవ్వుతూ అడిగింది.
సరుక్కున లేచాడు. ముఖానికి పట్టిన చెమటని టిష్యూపేపర్‌తో తుడుచుకున్నాడు.
”సారీ, మేడం” అని చెప్పి అక్కడినుంచి సరసరా వెళ్ళిపోయాడు.
అక్కడున్న వారందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు. ‘అందాల సుందరి… ఏరి కోరి, కాళ్ళ కాడికొచ్చి సెల్ఫీ అడిగితే తుర్రుమంటున్నాడు… పిచ్చిగానీ పట్టిందా ఇతడికి!’ అనుకున్నారు.
రాత్రయ్యింది. టాప్ లెస్ జీపులో ఇంటికి వచ్చాడు.
—
అల్పాహారం తిని మిద్దె మీద సిట్ అవుట్‌లో కూర్చుని న్యూస్ పేపర్లు తిరగేస్తూ ఉన్నాడు.
దూరంగా పలకల శబ్దం. చిన్నచిన్నగా దగ్గరవుతోంది. ‘ఏమిటా…’ అని చూశాడు.
గుట్ట కింద పల్లె గ్రామస్తులు. ఊరేగింపుగా ఇంటి వైపు వస్తున్నారు. జేజేలు పలుకుతూ ఉన్నారు. చాన్నాళ్ళుగా వాళ్ళ ఊరి దగ్గర చెక్ డ్యాం కావాలని కోరుతున్నారు. వానలొస్తే ఊరు జలమయమవుతోందని, చెక్ డ్యాం కడితే ఊర్లోకి నీళ్ళు రావని, నిల్వ ఉన్న నీళ్ళు పొలాలకి ఉపయోగపడుతాయని వారి ఉద్దేశ్యం. అందుకని మన నాయకుడిని సంప్రదించారు. మంత్రితో మాట్లాడి చెక్ డ్యాంని మంజూరు చేయించాడు. అందుకు కతజ్ఞతగా వారు పండ్లు, పూలు తీసుకుని వస్తున్నారని గ్రహించాడు.
నెత్తిన సెంటు మల్లెల వాన కురిసినట్లయ్యింది మన నాయకుడికి. ఆనందపడిపోయాడు.
అయితే కొద్దిసేపటికే అతడి కాళ్ళు, చేతులు వణక సాగాయి. మెడ చుట్టూ చెమట పడుతోంది. పక్కనే ఉన్న నాయకుడి భార్య గమనించింది. ‘ఏమయ్యిందండీ?’ అని అడిగింది.
గుంపులో ఉన్న ఓ మనిషిని చూపించాడు. అతడి చేతిలో కెమెరా ఉంది. ఊర్లో వాళ్ళే ఆ ఫొటోగ్రాఫర్‌ని తీసుకు వచ్చారు.
”ఫొటోలంటే మీకు ఇష్టమే కదా” అని అడిగింది.
”ఒకప్పుడు ఫొటోలంటే భలే మోజు నాకు. అయితే ఇప్పుడు కాదు” అన్నాడు.
”ఎందుకని?” అని మళ్ళీ ప్రశ్న వేసింది.
”ఎవరంటే వాళ్ళు వచ్చి ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటారు. ఎవరి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో తెలియదు. ఎప్పుడైనా వాళ్ళు పోలీసు కేసుల్లోనో, వివాదాల్లోనో ఇరుక్కుంటే మన ఫొటోలను ముందు పెడతారు. పేపర్ల వాళ్ళు రంగురంగుల్లో వాటిని ముద్రిస్తారు. మనకీ వాళ్ళకీ లింకులంటారు. మనల్ని పోలీసులు పిలుస్తారు. దయాదాక్షిణ్యం లేకుండా ప్రశ్నిస్తారు. అడిగిన జనాలకి సమాధానం చెప్పలేం. సందు దొరికితే చాలు, పార్టీ పెద్దలు కసిదీరా నన్ను కిందికి తొక్కేస్తారు. నా రాజకీయ భవిష్యత్తు గంగలో కలిసిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ” అంటూ గబగబా పడకగదిలోకి వెళ్ళాడు.
సర్ది చెబుదామని పైకి లేచింది. మెడలోని బంగారు మంగళ సూత్రాలు మిలమిలమెరుస్తూ కనిపించాయి. గబగబా కిందికి వెళ్ళి ”సార్‌కి ఆరోగ్యం బాలేదు, వారం తర్వాత ఆయనే వచ్చి కలుస్తారు” అని గ్రామస్తులకు సర్ది చెప్పి పంపింది.
వారు అభిమానంగా తెచ్చిన పండ్లు, పూలు ఇచ్చేసి, పలకలు కొట్టుకుంటూ అక్కడినుంచి బయలుదేరారు. దుప్పటి కప్పుకున్న మన నాయకుడికి పలకలు దూరమయ్యే కొద్దీ నిద్ర రావడం మొదలయ్యింది.
-ఆర్.సి.కృష్ణస్వామి రాజు
9393662821
ఫొటో ప్లీజ్ !
- Advertisement -
- Advertisement -