No menu items!
Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeప్రధాన వార్తలుక్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపేదే ఫొటో

క్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపేదే ఫొటో

- Advertisement -

– కాలాన్ని బంధించే శక్తి ఫొటోగ్రాఫర్లకే సొంతం : ‘వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే’లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
– నవతెలంగాణ సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్‌ కె.నరహరికి ద్వితీయ బహుమతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

క్లిష్టమైన సమస్యలకు కూడా ఫొటోలు పరిష్కారం చూపిస్తాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో ఆ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఉత్తమ వార్తా ఛాయాచిత్రాల పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు, నగదు పురస్కారాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొంగులేటి మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకు సంబంధించి క్లిష్టమైన కేసును చేధించడంలో ఒక ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫొటో కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఒక ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫోటో ఆధారంగానే హంతకులను పట్టుకున్నారని వివరించారు. ఫొటో జర్నలిస్టుల సంక్షేమానికీ, వారిలో ప్రొఫెషనలిజం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సీఎస్‌ రామకృష్ణా రావు మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేది ఫొటో జర్నలిస్టులనేని తెలిపారు. వీటిలో ఫొటోగ్రఫీకి అంతంత ప్రాధాన్యత ఉందని కొనియాడారు.. సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్‌ ప్రియాంక మాట్లాడుతూ, కాలం గడచినా, ఫొటోలు మాత్రం చెక్కుచెదరకుండా ఉండి మధుర స్మృతులను గుర్తు చేస్తాయని తెలిపారు. ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవాన్ని సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో గత 28 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి 5 విభాగాలకు నిర్వహించిన ఫొటో కాంపిటీషన్‌లో 94 మంది పాల్గొని 744 ఫొటోలను పంపించారని చెప్పారు. ఫొటోగ్రఫి రంగంలో నిష్టాతులైన వారితో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ విజేతలను ఎంపిక చేసిందని వివరించారు. వివిధ విభాగాల్లో విజేతలైన వారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సమాచార శాఖ స్పెషల్‌ కమీషనర్‌ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మెన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సీపీఆర్‌ఓ మల్సూర్‌లతో కలిసి బహుమతితో పాటు నగదు పురస్కారాలను అందజేశారు.

విజేతలు వీరే
రైతుభరోసా విభాగంలో మొదటి బహుమతి సీహెచ్‌.నరేందర్‌ (హైదరాబాద్‌ జిల్లా), ద్వితీయ బహుమతి మహిమాల కైదర్‌ రెడ్డి (కరీంనగర్‌), తృతీయ బహుమతి కరింగు శ్రీను (నల్లగొండ) అందుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు విభాగంలో వనం శరత్‌ బాబు (వరంగల్‌), రమేశ్‌ కుడితల (వరంగల్‌), తడన్ల శ్రవణ్‌ (ములుగు) వరసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు తీసుకు న్నారు. చేయూత విభాగంలో మహిమాల భాస్కర్‌ రెడ్డికి (సిద్ధిపేట) ప్రథమ బహుమతి, బి.బాబు (సిద్ధిపేట) రెండో బహుమతి, క్రింగు వెంకటేశ్‌కు (నల్లగొండ) మూడో బహుమతి లభించాయి. రాజీవ్‌ యువ వికాసం క్యాటగిరీలో మదురి బ్రహ్మాచారి (సూర్యాపేట), కంది శివ ప్రసాద్‌ (ఖమ్మం), ఎరుకుల్ల వీరేశం (పెద్దపల్లి) మొదటి, రెండో, మూడో బహుమతులను కైవసం చేసుకున్నారు. జనరల్‌ (బెస్ట్‌ ఫోటోగ్రఫిక్‌ పిక్‌) విభాగంలో ఆర్‌.హరిప్రేమ్‌కు ప్రథమ బహుమతి రాగా, నవతెలంగాణ దినపత్రిక సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్‌ కె.నరహరికి ద్వితీయ బహుమతి, పి.సంపత్‌ కుమార్‌ చారి (రంగారెడ్డి జిల్లా)కు తృతీయ పురస్కారాన్ని మంత్రి అందజేశారు. ఇవే కాకుండా ప్రతి విభాగంలో మరో ఐదు ఫొటోల చొప్పున 25 మందికి కన్సోలేషన్‌ పురస్కారాలను అందజేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad