విద్యా కమిషన్ సిఫారసులను ఖండించిన పెటా టిఎస్
హైదరాబాద్ : తెలంగాణ విద్యా కమిషన్ నివేదికలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత తగ్గిస్తూ చేసిన సిఫారసులను వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సంఘం తెలంగాణ (పెటా టిఎస్) తీవ్రంగా ఖండించింది. పీఈటీల పని వేళలను మధ్యాహ్నం 2 నుంచి 7 గంటలకు పరిమితం చేయాలనటం విద్యా కమిషన్ అశాస్త్రీయ, అవగాహన లోపమని పెటా టిఎస్ అధ్యక్ష, కార్యదర్శులు బి. రాఘవరెడ్డి, పి. కృష్ణమూర్తి గౌడ్‌లు తెలిపారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘విద్యా కమిషన్ వ్యాయామ విద్యపై అవగాహన లేకుండా సిఫారసులు చేసింది.
కనీస సదుపాయాలు లేని పాఠశాలల్లో టేబుల్ టెన్నిస్‌ను ప్రవేశపెట్టాలని కమిషన్ సిఫారసు చేసింది. అందుకు బదులుగా కాలిస్తెనిక్స్, ప్రాథమిక కదలిక నైపుణ్యాల అభివృద్ది, మాస్ డ్రిల్స్, మార్చ్ ఫాస్ట్, ఫిజికల్ డిస్‌ప్లే, లైట్ ఆపరేటస్ డ్రిల్స్‌ను బోధించాలి. జాతీయ విద్యా విధానం ప్రకారం వ్యాయామ విద్యను మూల్యాంకన సబ్జెక్ట్‌గా చేయాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో నిపుణులు, మేధావుల అభిప్రాయాలను పరిగణనిలోకి తీసుకుని విద్యా కమిషన్ నివేదికలో మార్పులు చేయాలని కోరుతున్నామని’ పేర్కొన్నారు. కార్యక్రమంలో పెటా టిఎస్ నాయకులు శక్రు నాయక్, దినేశ్ కుమార్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.



