”డాక్టరైతే ఎంబిబిఎస్ చేయాలి, ఫిజియోథెరపీ అంటే మసాజ్ చేయడమే కదా?”, ”ఈ కోర్సు చదివి ఏమవుతావు?” ఇలాంటి ప్రశ్నలు నేను తరచుగా వింటున్నవే. కానీ నేను ఎంచుకోవాలనుకుంటున్న కోర్సు గురించి ప్రజలకు తెలియని నిజాలను వివరించాలనే సంకల్పంతో ఈ వ్యాసాన్ని రాస్తున్నాను. అదే ఫిజియోథెరపీ. ఒక శాస్త్రీయ, శరీరాన్ని మళ్లీ క్రియాశీలంగా మార్చే వైద్య విధానం.
ఫిజియోథెరపీ అంటే కేవలం వ్యాయామం లేదా మసాజ్ చేయడం మాత్రమే కాదు. ఇది గాయపడిన, శస్త్రచికిత్స పొందిన, వద్ధాప్యం వల్ల కదలలేని స్థితిలో ఉన్న, పక్షవాతంతో బాధపడుతున్నవారిని తిరిగి కదలగలిగే స్థితికి తీసుకెళ్లే శాస్త్రీయ ప్రక్రియ. ఈ ప్రయాణంలో ఫిజియోథెరపిస్టు పాత్ర అత్యంత కీలకమైనది. ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేయగలగడం ఓ విజ్ఞానం అయితే, ఆ శస్త్రచికిత్స అనంతరం రోగిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం మరో విశిష్ట సామర్థ్యం. ఆ బాధ్యతను ఫిజియోథెరపీ చేపడుతుంది.
చిన్న కోర్సు కాదు – గొప్ప బాధ్యత
ఫిజియోథెరపీ అనేది నాలుగేళ్ల డిగ్రీ కోర్సు. దీనిలో నరశాస్త్రం (Neurology, ఆర్థోపెడిక్స్ (Orthopedics), కార్డియోపల్మనరీ (Cardiopulmonary), పిల్లల చికిత్స (Pediatrics) వంటి విభాగాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయించబడుతుంది. క్లినికల్ ప్రాక్టీసు ద్వారా విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరుస్తారు. ఇది చిన్న కోర్సు కాదు. ఇది బాధితుల మానసిక, శారీరక కోణాల్లో సమగ్రంగా సహాయం చేసే బాధ్యతను అలవర్చే కోర్సు.
ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత
ఈ కోర్సుకు కేవలం మన దేశంలోనే కాకుండా కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి అభివద్ధి చెందిన దేశాల్లో విశేష గౌరవం, అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఫిజియోథెరపిస్టులకు ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. విదేశాల్లో చదువుకు, వృత్తి అవకాశాలకు ఇది ఒక బలమైన మార్గం.
MBBS, BDS, BPT వంటి వైద్య రంగాల మధ్య తేడాలు ఉండవచ్చు. కానీ ప్రతి వైద్య విద్యార్థి లక్ష్యం మాత్రం ఒక్కటే. అదే ప్రజల శ్రేయస్సు. శస్త్రచికిత్స చేసే వ్యక్తి ఒక వైద్యుడు అయితే, రోగిని మానసికంగా, శారీరకంగా కోలుకునేలా చేసే వ్యక్తీ మరో వైద్యుడే. అందుకే ఒకరినొకరితో పోల్చే అవసరం లేదు. ప్రతి శాఖకూ ఉన్న ప్రాముఖ్యత తక్కువదేం కాదు.
నా అభిమతం
నేను ఫిజియోథెరపీ చదవాలనుకున్నప్పటి నుంచే అనేక ప్రశ్నలు, విమర్శలు ఎదురయ్యాయి. ”ఇది డాక్టరా?”, ”ఇది మగవాళ్లే చేసే కోర్సు కదా!” అనే చిన్నచూపు పలికింది. అయినప్పటికీ, నాకు తెలుసు… ఈ కోర్సు ద్వారా నేను ఒక్కరిని ఐన తిరిగి నడిచే స్థితికి తీసుకురాగలిగితే, అది నా జీవితంలో గొప్ప విజయంగా నిలుస్తుంది.
ప్రస్తుతం కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫిజియోథెరపీ అభ్యర్థిగా, నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను – ఈ కోర్సును చిన్నచూపు చూడకండి. ఇది సేవాధారితమైనదే కాక, గౌరవప్రదమైన వృత్తి మార్గం. ఇది బాధితునికి మానవత్వంతో పునరుత్తేజం ఇవ్వగలిగే శక్తివంతమైన రంగం.
– వర్షిణి ఉప్పుల
ఫిజియోథెరపీ అభ్యర్థి, వరంగల్
ఫిజియోథెరపీ- మసాజ్ కాదు, జీవనాన్ని మళ్లీ నడిపించే వైద్య విధానం
- Advertisement -
- Advertisement -