విచారణను నిరాకరించిన హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సింబయాసిస్ యూనివర్సిటీ, సమీప ప్రాంతంలో ఇటీవల 40 కుక్కలను ఒకేరోజు చంపడాన్ని తప్పుపడుతూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై అన్ని హైకోర్టులోని కేసులు సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యాయనీ, ఆ కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీచేసింది. నలభై కుక్కలను చంపిన పంచాయతీ సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ అడ్వకేట్ రిషిహాస్ రెడ్డి వేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు వచ్చినప్పుడు పై విధంగా ఉత్తర్వులు జారీ చేసింది.
జంతు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి : హైకోర్టు
తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. జంతువుల అమ్మకాల దుకాణాలు, పెంపుడు కేంద్రాలు నిర్వహణ చట్టపరంగా ఉండే విధంగా చర్యలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ఎన్జీవో పిల్ దాఖలు చేసింది. దీనిని చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారించింది. ప్రభుత్వ వివరణతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని న్యాయవాది కోరడంతో విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది.
‘ధర్మ రక్ష సభ’కు హైకోర్టు అనుమతి 3 వేల మందితో నిర్వహించుకోవాలని ఆంక్షలు
ఈ నెల 24న రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో తలపెట్టిన ధర్మరక్ష సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అక్రమ వలసదారుల వల్ల దేశ భద్రతకు తలెత్తే ముప్పు గురించి ప్రజలను చైతన్యపర్చేందుకు తాము తలపెట్టిన సభకు పోలీసులు నిరాకరించాని గణేష్ సేన కన్వీనర్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ శ్రవణ్ కుమార్ బుధవారం విచారించారు. ధర్మ రక్ష సభకు షరతులతో అనుమతి మంజూరు చేశారు. ఈనెల 24న సాయంత్రం 3 నుంచి 6 గంటల్లోగా 3 వేల మందితో నిర్వహించుకోవాలనీ, ర్యాలీలు తీయొద్దనీ, రాజకీయ నాయకులను ఆహ్వానించకూడదని షరతులు విధించారు.
రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్లకార్డుల ప్రదర్శనలు, నినాదాలు చేయొద్దని ఖరాఖండిగా చెప్పారు. బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించారు. రాష్ట్రంలోని శరణార్థులు, రోహింగ్యాలకు గుర్తింపు ఉందా? వాళ్ళు చట్టప్రకారం దేశంలో నివసించేందుకు వీలుందా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన వాళ్లని బయటకు పంపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పింది. బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 6,993 మంది శరణార్థులు ఉన్నారని వివరించింది. పిటిషన్‌పై విచారణ ముగిసింది.



