అనాదిగా పితస్వామిక సమాజంగా కొనసాగుతున్న భారతదేశంలో మహిళలు ఇంటా బయటా వివిధ రూపాల్లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గృహహింస, లైంగిక వేధింపులు, పని ప్రదేశంలో వివక్ష, అసంఘటిత రంగంలో తక్కువ వేతనాలు, ప్రకటనల్లో అసభ్యత, సమాన అవకాశాలు లేకపోవడం మొదలైనవి ఎన్నో సామాజిక సమస్యలుగా పేరుకుపోయాయి. అందుకే రాజ్యాంగం లింగ వివక్షను నిషేధించింది. మహిళల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. అయినా గంటకో ఘటనైనా చోటుచేసుకుంటుంది. వివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళలు కట్నకానుకల రూపంలో ఆస్తి తీసుకొస్తారు. కానీ ఒక్క రూపాయి మీదా ఆమెకు హక్కు ఉండదు. భర్త కొట్టినా తిట్టినా అతనితోనే జీవితం అనుకోవాలి. లేదంటే కన్నబిడ్డలను వదులుకోవాల్సిందే. ఇలాంటి ఎన్నో ఉదాహరణలను చూశారు మానసి చౌదరి. ఇలాంటి ఆడవాళ్లకు తమ హక్కుల్ని తెలియజేయాలి అనుకున్నారు. అందుకోసమే ‘పింక్ లీగల్’ను ఏర్పాటు చేసి మహిళలకు అండగా నిలుస్తున్నారు. ఆ పింక్ లీగల్ ప్రయాణం గురించి నేటి జోష్.
ఢిల్లీలోని జిందల్ గ్లోబల్ లా స్కూల్లో మానసి న్యాయశాస్త్రంలో పట్టా పొంది, రాష్ట్రహైకోర్టులో రెండేండ్లపాటు ప్రాక్టీస్ చేశారు. మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ సుప్రీంకోర్టు జస్టిస్‌గా ఉన్నప్పుడు ఆయన వద్ద అసిస్టెంట్‌గా చేశారు. ఆ సమయంలోనే సెక్షన్ 377పై తీర్పు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలు ప్రవేశించ వచ్చనే తీర్పు రావడం జరిగింది.
సుదీర్ఘ అనుభవం కలిగిన మానసి తనకు వ్యక్తిగతంగా ఎదురైన ఓ పరిణామాన్ని జీర్ణించుకోలేక ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లో మహిళల హక్కులు తెలిపే సెక్షన్‌లు ఎన్ని ఉన్నాయి, ఏయే సెక్షన్ల కింద ఏయే హక్కులు మహిళలకు ఉన్నాయనే సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు చేసిన కృషి నేడు ఎందరో స్త్రీలకు ఆసరాగా నిలుస్తోంది.

ఇలా ప్రారంభం
ఇంట్లో, రిలేషన్‌షిప్స్, వర్క్‌ప్లేస్… ఇలా పలు అంశాల్లో మహిళలు ఎదుర్కొనే సమస్యల్ని రీసర్చ్ చేశారు. ఆపై సులువైన భాషలో వాళ్ల హక్కులు, చట్టాల గురించి వెబ్‌సైట్‌లో ఉంచడం మొదలుపెట్టారు. ఇంగ్లిష్‌తోపాటు ఏ భాషలోనైనా చదువుకునేలా ట్రాన్స్‌లేషన్ సేవలను దానికి జోడించారు. మొదట్లో ఆమె ఒక్కరే. తరవాత ఆసక్తి ఉన్నవాళ్లంతా చేరారు. అయితే బాధితులు కేవలం హక్కులు తెలుసుకుంటే సరిపోదు. వారికి న్యాయసాయమూ అందించాలని అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలితో కలిసి ‘న్యాయరీ’ ప్రాజెక్టూ చేస్తున్నారు. వీరికి దేశవ్యాప్తంగా లాయర్ల నెట్‌వర్క్ ఉంది. బాధితులకు సమస్య ఆధారంగా లాయర్‌ని చూపిస్తారు. పేదలకు ఉచిత సాయం అందేలా చూడటం. ఇవేకాదు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కౌన్సెలింగ్ సైతం అందించడం. ఇందుకు ఎన్‌జీఓలు, స్థానిక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. వీరి లాయర్లు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ల్లో ప్రభుత్వ పాఠశాలలు, మురికివాడల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటారు. న్యాయరీకి అన్ని రాష్ట్రాల నుంచీ మంచి స్పందన వస్తుంది. సమస్య ఏదైనా మహిళలకు గుర్తుకు వచ్చేది ‘పింక్ లీగల్’ వీటన్నింటితో లక్షమందికిపైగా సాయమందించారు.
ఫలించిన మూడేళ్ల పోరాటం
ఓ రోజు రాత్రి ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో నలుగురు యువకులు మానసిపై భౌతిక దాడి చేసేందుకు సిద్ధపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మానసి తన వద్ద ఉన్న సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చి ఆ యువకులకు శిక్షపడేలా చేశారు. న్యాయవాదిని కాబట్టి ఆమెకు రూల్స్ తెలుసు.
‘హక్కులు తెలియని మహిళల పరిస్థితి ఏంటి?’ అని ఆలోచించిన మానసి ఆ రోజు నుంచి మూడేళ్లపాటు మహిళలకు న్యాయసమాచారాన్ని అందించేందుకు కసరత్తు చేసింది. ఓ పక్క ఉద్యోగం చేస్తూ.. ఇంకోపక్క సీనియర్ న్యాయవాది వద్ద ప్రాక్టీస్ చేస్తూనే రాత్రివేళల్లో వెబ్‌సైట్ పనుల్లో నిమగమయ్యేవారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉన్న లా బుక్స్ తిరగేశారు.
రాజ్యాంగంలో మహిళలకు ఉన్న హక్కుల గురించి తెలుసుకున్నారు. 2018లో తొలుత ‘లైంగిక వేధింపులు, మహిళల ఆస్తిహక్కులు’ అనే అంశాలపై పైలట్ ప్రాజెక్ట్‌గా వెబ్‌సైట్ ద్వారా సమాచారాన్ని అందించారు. దీనికి మంచి ఆదరణ, స్పందన వచ్చినప్పటికీ, మహిళకు దక్కాల్సిన న్యాయం, హక్కుల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే సంకల్పంతో మరో అడుగు ముందుకేశారు.
2020 మార్చి 8న వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు దానికి సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని నిర్వహించారు. ‘పింక్ లీగల్’ కాన్సెప్ట్ నచ్చి ఆమెతో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు లా స్టూడెంట్స్ కొందరు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు. దీనిలోనే’ఫ్రీ హెల్ప్‌లైన్’ ను ప్రారంభించారు.
బాధితులు ఎవరైనా అప్లికేషన్‌ను పూర్తి చేసి దానిలో ఫోన్ నంబర్ రాసి, సబ్‌మిట్ చేస్తే వాలంటీర్ సదరు మహిళకు ఫోన్ చేసి న్యాయ సలహా అందిస్తారు. అంతేకాదు, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెన్నంటి ఉంటారు. సాంకేతికంగా ఎటువంటి పరిజ్ఞానం లేని వారిని దృష్టిలో పెట్టుకున్న మానసి గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందమయ్యారు.
ఆయాప్రాంతాల్లో మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ‘పింక్‌లీగల్’ గురించి చెప్పి, వారికి ఏయే సెక్షన్‌లు ఎలా ఉపయోగపడతాయనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా అంశంపై వికీపీడియా ఎలా అయితే పూర్తి సమాచారాన్ని అందిస్తుందో.. మహిళలకు చట్టాలు, హక్కులపై ‘పింక్ లీగల్’ అలా ఒక ఎన్‌సైక్లోపిడియాలా పని చేస్తుందంటున్నారు మానసి.
పింక్ లీగల్ కాన్సెప్ట్ నచ్చి మానసితో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు ‘లా- విద్యార్థులు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417



