– చట్ట అమలు సంస్థలు, పరిశ్రమ సమన్వయం అవసరం : శిఖా గోయెల్
– కొత్త యాంటీ పైరసీ డిస్క్లెయిమర్, ఎస్‌ఓపీని ప్రారంభించిన టీజీసీఎస్‌బీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పైరసీ ఇప్పుడు అత్యంత వ్యవస్థీకృత సైబర్ నేర వ్యవస్థగా మారిందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ శిఖా గోయెల్ అన్నారు. సినిమా పైరసీని అరికట్టే ప్రయత్నంలో భాగంగా టీజీసీఎస్‌బీ కొత్త యాంటీ-పైరసీ డిస్‌క్లైమర్‌ను ప్రారంభించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) సహకారంతో ఈ ఏడాది జనవరి 5న ఏర్పాటు చేసిన యాంటీ పైరసీ యూనిట్ ఆధ్వర్యంలో కొత్త యాంటీ-పైరసీ డిస్‌క్లైమర్‌ను ప్రారంభించారు. థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు ముందు దీనిని ప్రదర్శిస్తారు. సినిమా పైరసీ, సినిమా హాళ్లలో క్యామ్-కార్డింగ్ చేయడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాల గురించి ప్రేక్షకుల్లో అవగాహన కల్పించడం దీని లక్ష్యం. టీజీసీఎస్‌బీ.. డిజిటల్ ఫిల్మ్ పైరసీపై చర్యలను బలోపేతం చేయడానికి, విచారణ, డిజిటల్ సాక్ష్యాల సేకరణ, అలాగే పైరసీ నెట్‌వర్క్‌లపై సమన్వయంతో చర్యలు తీసుకునే విధంగా ఒక నిర్మిత ఫ్రేమ్‌వర్క్‌ను స్థాపించేందుకు రూపొందించిన యాంటీ-పైరసీ కేసుల దర్యాప్తుకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను కూడా ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో శిఖా గోయెల్ మాట్లాడుతూ.. పైరసీని ఎదుర్కోవడానికి చట్ట అమలు సంస్థలు, పరిశ్రమ భాగస్వాముల సమన్వయంతో కూడిన స్పందన అవసరమని తెలిపారు. కొత్త ఎస్‌ఓపీ ద్వారా వేగవంతమైన, వ్యవస్థీకృత దర్యాప్తు సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే యాంటీ-పైరసీ డిస్క్లెయిమర్ ప్రజల్లో అవగాహన పెంచి అక్రమ రికార్డింగ్ మరియు పంపిణీపై నిరోధక ప్రభావం చూపుతుందని ఆమె వివరించారు. ఈ కార్యక్రమాలను టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్, టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్‌బాబు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. పైరసీ సినిమా పరిశ్రమపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపుతుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్‌బాబు అన్నారు.
వ్యవస్థీకృత సైబర్ నేరంగా మారిన పైరసీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



