Friday, January 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకొలంబియాలో విమాన ప్రమాదం

కొలంబియాలో విమాన ప్రమాదం

- Advertisement -

15 మంది మృతి
వెనిజులా సరిహద్దు సమీపంలో ఘటన

ఒకానా (కొలంబియా) : కొలంబియా ఈశాన్య ప్రాంతంలో వెనిజులా సరిహద్దుకు సమీపంలో విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో స్థానిక శాసన సభ్యుడు సహా మొత్తం 15 మంది చనిపోయారు. విమానం గమ్య స్థానానికి చేరుకునే కొద్ది నిమిషాల ముందే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.

విమానం అదృశ్యం.. ఆపై విషాదాంతం
ప్రభుత్వ ఎయిర్‌లైన్‌ సటెనాకు చెందిన బీచ్‌క్రాఫ్ట్‌ 1900 విమానం కుకుటా నుంచి బయలుదేరి ఒకానా వైపు వెళ్తుండగా రాడార్‌ నుంచి అదృశ్యమైంది. ఉదయం 11.54 గంటలకు చివరకు కమ్యూనికేషన్‌ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. విమానం కనబడకపోవడంతో కటాటుంబో ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రాంతం పర్వతాలు, అడవులతో కూడిన క్లిష్ట భూభాగం. దీంతో ఇది గాలింపు చర్యలకు తీవ్ర అడ్డంకిగా మారింది. వాయు దళం, సైన్యం కలిసి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. గురువారం రోజున విమానం శకలాలు లభ్యమయ్యాయి. స్థానిక మీడియా విడుదల చేసిన చిత్రాల్లో విమానం పూర్తిగా ధ్వంసమై కనిపించింది.

ఎవరూ బతికిలేరన్న ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఈ విమానంలో 13 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది కలుపుకొని మొత్తం 15 మంది ఉన్నారు. వారంతా ఈ ప్రమాదంలో మరణించారు. మృతుల్లో స్థానిక శాసనసభ్యుడు డియోజెన్స్‌ క్వింటెరో, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి కార్లోస్‌ సాల్సెడో కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ ప్రమాదానికి గల కారణాలను వెల్లడించలేదు. కొలంబియా పౌర విమానయాన సంస్థ అధికారులు విమాన శకలాలలను పరిశీలించారు. దర్యాప్తు చేపట్టనున్నారు. నార్టే డి సాంటాండర్‌ రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయం మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -