ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం
ముంబై : మదురై నుంచి 76 మంది ప్రయాణికులతో ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి శనివారం పెను ప్రమాదం తప్పింది. విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవడానికి కొద్దిసేపటి ముందు, కాక్‌పిట్‌లోని ముందు అద్దానికి (విండ్‌షీల్డ్)కు పగుళ్లు రావడాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఆయన ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు తెలియజేశారు. విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమై అన్ని రకాల అత్యవసర ఏర్పాట్లు చేశారు. విమానం ఎలాంటి ఆటంకాలు లేకుండా ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం విమానాన్ని ప్రత్యేకంగా బే నంబర్ 95 వద్దకు తరలించి, ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఈ ఘటన కారణంగా ముంబై నుంచి మధురైకి వెళ్లాల్సిన తిరుగు ప్రయాణాన్ని రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విమానం అద్దం ఎందుకు పగిలిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని, దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
గాల్లో ఉండగానే విమానం ముందు అద్దానికి పగుళ్లు
- Advertisement -
- Advertisement -