భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగ మార్గం పనుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ కాలువతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో అంతర్భాగమైన మెడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్‌ల పునరుద్ధరణ పనులపై ఆదివారం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ సొరంగ నిర్మాణ పనుల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సొరంగ మార్గం మిగిలిన భాగం పూర్తి చేయడానికి అవసరమైన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన ఏరియల్ ఎలాక్ట్రో మాగెటిక్ సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరిందని తెలిపారు.
భౌగోళికంగా ప్రతికూల పరిస్థితిలు ఏర్పడితే ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టదానికి ఈ సర్వే ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు శాస్త్రీయ పద్దతిలో నిరంతరం అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణకై ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఆపరేషన్ బృందానికి చీఫ్ ఇంజనీర్‌ను నియమించాలని సూచించారు. డిజైన్ ప్రకారం నిర్మాణం కొనసాగేందుకు ప్రత్యేకంగా నియమించిన చీఫ్ ఇంజినీర్‌కు సహకరించేలా స్వతంత్ర కన్సల్టెంట్‌ను నియమించాలన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షిస్తుందని చెప్పారు.
సొరంగ మార్గంలో ఏర్పడుతున్న మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు గాను ప్రత్యేక జియో టెక్నీకల్, జియాలజికల్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం బ్యారేజ్‌ల పనుల పునరుద్ధరణ పనులు వేగవంతంచేయడానికి అవసరమైన సాంకేతిక సంస్థలు, డిజైన్ కన్సల్టెంట్ల సూచనలను పాటించాలన్నారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించే పరీక్షల షెడ్యూల్, ప్రాజెక్ట్ డిజైనర్ల పనితో సమన్వయం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫిబ్రవరి 16 తర్వాత ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీతో సమావేశం నిర్వహించాలని అధి కారులకు సూచించారు. పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.



