Monday, December 15, 2025
E-PAPER
Homeఆటలుఆడుతూ పాడుతూ!

ఆడుతూ పాడుతూ!

- Advertisement -

ధర్మశాల టీ20లో భారత్‌ ఘన విజయం
రాణించిన అర్ష్‌దీప్‌, వరుణ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌
మెరిసిన అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌
దక్షిణాఫ్రికా 117/10, భారత్‌ 120/3

నవతెలంగాణ-హైదరాబాద్‌
ధర్మశాలలో టీమ్‌ ఇండియా ధనాధన్‌ విజయం నమోదు చేసింది. బంతితో బౌలర్లు..బ్యాట్‌తో బ్యాటర్లు అంచనాలు అందుకోవటంతో ఆడుతూ పాడుతూ మూడో టీ20లో అదిరే విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (35, 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ (28, 28 బంతుల్లో 5 ఫోర్లు), తిలక్‌ వర్మ (26 నాటౌట్‌, 34 బంతుల్లో 3 ఫోర్లు) రాణించటంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌ (61, 46 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. డొనొవాన్‌ ఫెరీరా (20, 15 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), ఎన్రిచ్‌ నోకియా (12, 12 బంతుల్లో 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/13), హర్షిత్‌ రానా (2/34), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/12), వరుణ్‌ చక్రవర్తి (2/11) వికెట్ల వేటలో మ్యాజిక్‌ చూపించారు. ఐదు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో 2-1తో భారత్‌ ముందంజ వేసింది. చివరి రెండు టీ20లు వరుసగా లక్నో, అహ్మదాబాద్‌లో జరుగుతాయి.

అభిషేక్‌ అదరహో
స్వల్ప లక్ష్యాన్ని మెరుపు వేగంతో ఛేదించాలనే కసితో ఆడాడు ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (35). మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో దండెత్తిన అభిషేక్‌ శర్మ.. పవర్‌ప్లేలో సఫారీ బౌలర్లతో ఆడుకున్నాడు. మరో ఎండ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (28) సైతం రెచ్చిపోవటంతో పవర్‌ప్లేలో భారత్‌ పవర్‌ఫుల్‌గా కనిపించింది. అభిషేక్‌ ఆరు ఓవర్లలోపే అవుటైనా.. భారత్‌ తొలి 36 బంతుల్లో 68 పరుగులు పిండుకుంది. కార్బన్‌ బాచ్‌ ఓవర్లో మార్‌క్రామ్‌ మెరుపు క్యాచ్‌తో అభిషేక్‌ ధనాధన్‌కు బ్రేక్‌ పడగా.. శుభ్‌మన్‌ గిల్‌ను యాన్సెన్‌ అవుట్‌ చేశాడు.

కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (12, 11 బంతుల్లో 2 ఫోర్లు)), తెలుగు తేజం తిలక్‌ వర్మ (00), శివం దూబె (10 నాటౌట్‌, 4 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఆ తర్వాత లాంఛనం ముగించారు. అభిషేక్‌ శర్మ ధనాధన్‌ జోరు తర్వాత మన బ్యాటర్లలో ఎవరూ ఆ తరహా దూకుడు చూపించలేదు. శుభ్‌మన్‌ గిల్‌, తిలక్‌ వర్మ సహా సూర్యకుమార్‌ యాదవ్‌ సావధానంగానే ఆడారు. అయినా, మరో 25 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ అదిరే విజయం నమోదు చేసింది. ఆఖర్లో శివం దూబె ఓ సిక్సర్‌, ఫోర్‌తో సూపర్‌ ముగింపు అందించాడు.

బౌలర్లు భళా
ధర్మశాలలో కీలక టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అర్ష్‌దీప్‌ సింగ్‌ తొలి ఓవర్లోనే భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్‌ (0) అర్ష్‌దీప్‌ సింగ్‌ సంధించిన నాల్గో బంతికే ఎల్‌బీడబ్ల్యూగా నిష్క్రమించాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న హర్షిత్‌ రానా.. సైతం మెరవటంతో ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (1), డెవాల్డ్‌ బ్రెవిస్‌ (2)లు పవర్‌ప్లేలోనే డగౌట్‌కు చేరుకున్నారు. 3.1 ఓవర్లలో 7 పరుగులకే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆ జట్టును ఎడెన్‌ మార్‌క్రామ్‌ (61) ఆదుకున్నాడు. మరో ఎండ్‌ నుంచి సహకారం లేకపోయినా.. ఆఖరు వరకు సఫారీ ఇన్నింగ్స్‌ను లాక్కొచ్చాడు.

మిడిల్‌ ఆర్డర్‌లో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (9), కార్బిన్‌ బాచ్‌ (4)లు ఆశించిన ప్రదర్శన చేయలేదు. డొనావాన్‌ ఫెరీరా (20) నుంచి చక్కటి సహకారం లభించటంతో ఎడెన్‌ మార్‌క్రామ్‌ విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన ఎడెన్‌ మార్‌క్రామ్‌.. సఫారీలకు గౌరవప్రద స్కోరు అందించేందుకు చెమటోడ్చాడు. పేస్‌ ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ (2)ను వరుణ్‌ చక్రవర్తి సాగనంపటంతో సఫారీలు ఆఖర్లో పెద్దగా పుంజుకోలేదు. ఎన్రిచ్‌ నోకియా (12), బార్ట్‌మాన్‌ (1)లను కుల్‌దీప్‌ అవుట్‌ చేశాడు. లుంగి ఎంగిడి (2 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/13), హర్షిత్‌ రానా (2/34), వరుణ్‌ చక్రవర్తి (2/11), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/12) రెండేసి వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌ పాండ్య (1/23), శివం దూబె (1/21)లు చెరో వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ : 117/10 (ఎడెన్‌ మార్‌క్రామ్‌ 61, డొనొవాన్‌ ఫెరీరా 20, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2/13, వరుణ్‌ చక్రవర్తి 2/11)
భారత్‌ ఇన్నింగ్స్‌ : 120/3 ( అభిషేక్‌ శర్మ 35, శుభ్‌మన్‌ గిల్‌ 28, తిలక్‌ వర్మ 25, లుంగి ఎంగిడి 1/23, బాచ్‌ 1/18)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -