Saturday, January 17, 2026
E-PAPER
Homeజాతీయంవ్యక్తిగతంగా హాజరుకండి

వ్యక్తిగతంగా హాజరుకండి

- Advertisement -

88 ఏండ్ల మాజీ విదేశాంగ కార్యదర్శికి ఈసీ నోటీస్‌

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (సర్‌)కు సంబంధించి ఈ నెల 27న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కృష్ణన్‌ శ్రీనివాసన్‌ (88)కు ఎన్నికల కమిషన్‌ నోటీసు జారీ చేసింది. రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి శ్రీనివాసన్‌, ఆయన భార్య బృందా శ్రీనివాసన్‌ (79)లకు కొల్‌కతాలో నఫర్‌కుందా రోడ్డులో ఉన్న వారి హజ్రా నివాసంలో బీఎల్‌ఓ దేవోలినా మైతీ నోటీసులు ఇచ్చారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్‌ శాసనసభ స్థానానికి చెందిన ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ) పేరిట ఈ నోటీసులు పంపారు.

‘గతంలో జరిగిన సవరణ సమయంలో రూపొందించిన ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నదని నిరూపించే వివరాలను మీరు పూర్తి చేయలేదు’ అని ఆ నోటీసులో తెలిపారు. గతంలో 92 సంవత్సరాల నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు, 81 ఏండ్ల నౌకాదళ మాజీ ప్రధానాధికారి అడ్మిరల్‌ అరుణ్‌ ప్రకాష్‌కు కూడా ఇలాంటి నోటీసులే పంపారు. కాగా బృందా శ్రీనివాసన్‌ ప్రస్తుతం కొల్‌కతాలో లేనందున తేదీని సవరించాలని కోరగా ఈ నెల 27న హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చారు. వయసు రీత్యా ఇంటి వద్దనే వివరాలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా హాజరయ్యేందుకే శ్రీనివాసన్‌ సిద్ధపడ్డారు.

2002లో ఓటరు జాబితాల సవరణ జరిపినప్పుడు తాము దేశంలో లేమని, ఆ సమయంలో తాను లండన్‌లో కామన్వెల్త్‌ సచివాలయ సెక్రెటరీ జనరల్‌కు రాజకీయ వ్యవహారాల డిప్యూటీగా విధి నిర్వహణలో ఉన్నానని శ్రీనివాసన్‌ చెప్పారు. గత నెలలో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయని, అయినా ఇప్పుడు నోటీసులు పంపడం ఆశ్చర్యంగా ఉన్నదని తెలిపారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో శ్రీనివాసన్‌ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కామన్వెల్త్‌ సచివాలయంలో కీలక పదవులు నిర్వహించారు.
ఇదిలావుండగా సర్‌ ప్రక్రియలో పదో తరగతి అడ్మిట్‌ కార్డులను రుజువులుగా చూపేందుకు అంగీకరించాలంటూ పశ్చిమబెంగాల్‌ ప్రధాన ఎన్నికల అధికారి చేసిన ప్రతిపాదనను ఎన్నికల కమిషన్‌ తోసిపుచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -