Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెన్షన్‌ వ్యవహారంపై వివరణ ఇవ్వండి

పెన్షన్‌ వ్యవహారంపై వివరణ ఇవ్వండి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పెన్షన్‌ లెక్కింపు కోసం టెంపరరీ సర్వీస్‌ను లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఏమేరకు అమలు చేశారో వివరణ ఇవ్వాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశించింది. తాత్కాలిక సర్వీసును పెన్షన్‌ లెక్కింపునకు గమనంలోకి తీసుకోలేదంటూ గవర్నమెంట్‌ హోమియో మెడికల్‌ కాలేజీ రిటైర్డ్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ హేమావతి వేసిన పిటిషన్లను చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌ ఆధ్వర్యంలోని బెంచ్‌ విచారించింది. 2022లో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పిటిషన్లు దాఖలు చేసే పరిస్థితులను ప్రభుత్వం ఎందుకు చేస్తోందని ప్రశ్నించింది. ప్రభుత్వ వివరణ నిమిత్తం విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.

విచారణకు హాజరవ్వండి
అక్రమ నిర్మాణాల వల్ల సమస్యలు తీవ్రమవుతాయని హైకోర్టు అభిప్రాయపడింది. తాగునీరు, మురుగునీరు, రోడ్లు వంటివి కల్పన జఠిలం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఘట్‌కేసరి మండలం పార్వతపురంలో సర్వే నెం.17లోని 175 చదరపు గజాల్లో అనుమతులు పొందిన దానికంటే రెండంతస్తులు అదనంగా కడుతున్నారనే పిటిషన్‌ను జస్టిస్‌ విజయ్ సేన్‌ రెడ్డి విచారించారు. పిటిషనర్‌, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణం చేసే ప్రతివాది ఇద్దరు అన్నదమ్ములు తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాలని ఆదేశించారు.

లోకాయుక్త ఆర్డర్‌పై స్టే
మహబూబాబాద్‌లోని అనంతారం గ్రామంలోని 1.07 ఎకరాల భూమిని సేవాలాల్‌ మందిరానికి లీజుకు లేదా మార్కెట్‌ ధరకు ఇచ్చే అంశాన్ని పరిశీలన చేయాలని లోకాయుక్త ఇచ్చిన ఆర్డర్‌ను హైకోర్టు స్టే చేసింది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ ఇతరులకు నోటీసులు జారీ చేసింది. నాయక్‌ మరో నలుగురు కలిసి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి చెందిన సుమారు 15 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ ఒక రైతు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఆ ట్రస్ట్‌కు లీజు లేదా మార్కెట్‌ ధరకు భూమి ఇచ్చే అంశాన్ని పరిశీలన చేయాలని అధికారులకు లోకాయుక్త ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ హైకోర్టులో అప్పీల్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఏకే సింగ్‌, జస్టిస్‌ మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ గురువారం విచారించి స్టే ఆదేశాలను జారీ చేసింది. విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -