Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబస్‌భవన్‌ 'ఏ' బ్లాక్‌పై స్పష్టత ఇవ్వండి

బస్‌భవన్‌ ‘ఏ’ బ్లాక్‌పై స్పష్టత ఇవ్వండి

- Advertisement -

ఎస్‌డబ్య్లూఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

టీజీఎస్‌ఆర్టీసీ బస్‌భవన్‌ ‘ఏ’ బ్లాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం కమర్షియల్‌ టాక్స్‌ (జీఎస్‌టీ) కార్యాలయానికి కేటాయించిందనే అంశంపై వెంటనే స్పష్టతనివ్వాలని టీఎస్‌ఆర్టీసీ స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. ఈమేరకు బుధవారం ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్‌ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత (2015 జూన్‌ 2) బస్‌ భవన్‌ ‘ఏ’ బ్లాక్‌ ఏపీఎస్‌ఆర్టీసీకి, అనంతరం టీజీఎస్‌ఆర్‌టీసీకి కేటాయించారని తెలిపారు. 11 ఏండ్లుగా ఆ బ్లాక్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ తన కార్యకలాపాలను నిర్వహించిందని పేర్కొన్నారు. ఏ బ్లాక్‌లోని మూడో అంతస్తులో టీజీఎస్‌ఆర్‌టీసీ స్క్వాడ్‌, వీటీపీఎస్‌ ప్రాజెక్టుతోపాటు డైనింగ్‌ హాల్‌గా వినియోగించుకున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భవవాన్ని టీజీఎస్‌ఆర్‌టీసీ ప్రమేయం లేకుండా ఆకస్మాత్తుగా ఏ బ్లాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం కమర్షియల్‌ శాఖకు కేటాయించారనడం సరైనది కాదని హెచ్చరించారు. దీనిపై టీజీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ యాజమాన్యాలు స్పందించాలని కోరారు. వాస్తవాలను కార్మికులకు, ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉమ్మడి ఆస్తుల ( 9వ షెడ్యూల్‌లో ఉన్న) సమస్యలు షీలాబేడీ కమిటీ ముందు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత వరకు దానిపై స్పష్టత రాలేదని విమర్శించారు. ఒకవేళ స్పష్టత వచ్చినా, ఆ బిల్డింగ్‌ మొత్తం టీజీఎస్‌ఆర్టీసీకా? లేదా ఏపీఎస్‌ఆర్టీసీకా? అనేదే తప్ప, ఇతర శాఖలకు కేటాయించే హక్కు ఉండదని తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీ విస్తరణ కోసం అనేక మంది దాతలు ఎకరాల కొద్ది భూములు ఆర్టీసీకి ఇచ్చారని గుర్తు చేశారు. ఆ భూములు, ఆస్తులు ఇలా ఎవరికీ పడితే వారికీ ఇవ్వడం వల్ల ఆర్టీసీ పట్ల ప్రజలకు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బస్‌భవన్‌ మొత్తం ఆర్టీసీదే అని ప్రకటించాలని, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసును బిల్డింగ్‌ నుంచి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంస్థ అప్పుల్లో ఉండి, కార్మికులు అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అప్పుడు, ఇప్పుడు దాని భవిష్యత్తు అవసరాలకోసం అనేక వందల ఎకరాల భూమిని సమాకూర్చుకుందని తెలిపారు. ఇప్పుడు టీజీఎస్‌ఆర్టీసీ ఆస్తులు, భూములు ప్రభుత్వం ఎవరికి పడితే వారికి ఇచ్చే పరిస్థితి ఉంటే, ఆర్టీసీ ఆస్తుల రక్షణ కోసం కార్మికులు పోరాటాల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. వెంటనే కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖకు ఇచ్చిన ఏ బ్లాక్‌ వెంటనే ఖాళీ చేయించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -