Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో వడ్ల రైతుకు అవస్థలు

గ్రామాల్లో వడ్ల రైతుకు అవస్థలు

- Advertisement -

– దొడ్డు రకం వడ్లను తీసుకునేందుకు వెనకాడుతున్న రైస్ మిల్లర్లు 
– కల్లాలపై కుప్పలు, కుప్పలుగా దొడ్డు రకం వడ్లు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని పలు గ్రామాల్లో వడ్ల రైతులు అవస్థలు పడుతున్నారు. మొన్నటివరకు తుఫాన్ ప్రభావంతో కురిసిన వరుణుడి దెబ్బతో ధాన్యం నీళ్ల పాలు, నేల పాలు అయ్యింది. మిగిలిన చేతికొచ్చిన పంటను రైతులు కోతలు పూర్తిచేసుకుని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించింది. గత రబీలో సన్నాలకు బోనస్ ఇవ్వాలనే తాపత్రయంతో సన్నం వడ్లు తీసుకొని, ఇటీవల కొందరికి ప్రభుత్వం బోనస్ పేరిట డబ్బులు వేసింది. అయితే ఇక మిగిలిన దొడ్డు రకం వడ్లు రైస్ మిల్లర్ల దగ్గరకు వెళ్ళి ఆగిపోతున్నాయి. ప్రస్తుతం కూడా రైస్ మిల్లర్లు దొడ్డు వడ్లను తీసుకునేందుకు వెనుకాడుతున్నట్టు తెలిసింది. తడిసిన దొడ్డు వడ్లు మిల్లింగ్ చేస్తే బియ్యం గింజ విరిగి నూక శాతం ఎక్కువగా వస్తుందని, ప్రభుత్వానికి తాము ఇవ్వాల్సిన బియ్యం శాతంలో తరుగు ఏర్పడడం మూలంగా తాము నష్టపోతామని రైస్ మిల్లర్లు దొడ్డు వడ్లను తీసుకునేందుకు ముందుకు రావడం లేదని రైతులు అంటున్నారు.

ప్రభుత్వం కూడా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియాన్ని అందిస్తుండడంతో దుడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయని రైస్ మిల్లర్లు దొడ్డు వడ్లు తీసుకునే విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో రైస్ మిల్లర్లు దొడ్డు రకం వడ్లు దించుకోకపోవడంతో గ్రామాల్లో వడ్ల కల్లాల్లో కుప్పలు, కుప్పలుగా దొడ్డు రకం వడ్లు అలాగే ఉండిపోతున్నాయి. దొడ్డు రకం పంట వేసిన రైతులు తమ వడ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దొడ్డు వడ్లు పండించిన రైతుల పరిస్థితి ఇలా ఉంటే, ప్రభుత్వం ఒకపక్క తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మొత్తం కొనాలని చెబుతున్న మాటలు ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయి. క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రభుత్వం చెప్పినట్లు జరగడం లేదని, అనేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమ్మర్ పల్లి సింగిల్ విండో పరిధిలో రైతులు ఎక్కువ మొత్తంలో సన్న వడ్లను సాగు చేసిన నేపథ్యంలో ఇక్కడి రైతులకు అంతగా ఇబ్బందులు లేవు. కానీ చౌట్ పల్లి, కోన సముందర్, కోనాపూర్ సింగిల్ విండోల పరిధిలో రైతులు 80 శాతానికి పైగా దొడ్డు వడ్లనే సాగు చేశారు. ఈ విండోల పరిధిలో ధాన్యాన్ని తీసుకోవలసిన రైస్ మిల్లర్లు ఆసక్తి చూపించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

రైతుల ఇబ్బందులపై నాయకులు దృష్టి పెట్టాలి…
వరి ధాన్యాన్ని విక్రయించడంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆయా గ్రామాల్లో నాయకులు దృష్టి పెట్టాలని మండలంలోని అమీర్ నగర్ గ్రామ రైతు తోట ప్రసాద్ అన్నారు.వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వెళ్లిన స్థానిక నాయకులు ఈ విషయం పై దృష్టి పెట్టి రైతులను పట్టించుకోవాలన్నారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేయాలని ప్రసాద్ కోరారు. రైస్ మిల్ యజమానులు దొడ్డు రకం వాడను దించుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో ఏం చేయాలో పాలు పోనీ పరిస్థితుల్లో రైతుల అనేకమంది ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, నాయకులు అధికారులు సానుకూలంగా స్పందించి, రైతుల ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -