Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమరణాలను తగ్గించడమే పీఎం రాహత్‌ లక్ష్యం

మరణాలను తగ్గించడమే పీఎం రాహత్‌ లక్ష్యం

- Advertisement -

వీడియోకాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. 2021లో భారత లా కమిషన్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రమాదం జరిగిన గంటలోపే బాధితుడిని ఆస్పత్రికి చేర్చితే 50 శాతం మరణాలు తగ్గుతాయని చెప్పారు. అందుకే పీఎం రాహత్‌ పథకాన్ని ప్రవేశపెడుతున్నా మన్నారు. ఈ పథకం ద్వారా 1.5 లక్షల వైద్యచికిత్స ఉచితంగా అందుబాటులోకి వస్తుందన్నారు. పీఎం రాహత్‌ పథకంపై కేంద్ర మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా ఏడు రోజుల వరకు ఈ కవరేజీ అందిం చబడు తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడే ఇతర బాధితులకు సైతం సహాయం చేస్తామని ప్రకటించారు.

ప్రాణాపాయం లేని కేసు లో 24 గంటల వరకు, ప్రాణాపాయ స్థితిలో 48 గంటల వరకు స్థిరీకరణ చికిత్స ఇవ్వనున్నట్టు గుర్తుచేశారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం రాహత్‌ పథకంలో చేరడానికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రజాప్రభుత్వంలో రవాణా శాఖలో గతంలో లేని ఎన్నో సంస్కరణలు తెచ్చామని చెప్పారు. వాహన సారథి పథకంలో ఇటీవల తెలంగాణ చేరిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఆటోమెటిక్‌ టెస్టింగ్‌ సెంటర్లు, డ్రైవింగ్‌ స్టేషన్లు, లైసెన్సుల జారీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు వివరించారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ వాహనాలను ప్రోత్సహించడంతోపాటు పట్టణ ప్రాంతాలు ఈవీ బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పీఎం రాహత్‌ పథకంలో తెలంగాణ ప్రభుత్వం చేరడానికి సిద్దంగా ఉందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -