– జనఔషధి సరఫరా శ్రేణికి ఉప్పల్ గిడ్డంగి వెన్నెముకగా నిలుస్తుంది : రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
– ఉప్పల్‌లో ‘పీఎంబీఐ-లార్వెన్ జనఔషధి డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ గిడ్డంగి’ ప్రారంభం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రధాన్‌మంత్రి భారతీయ జనఔషధి పరియోజన (పీఎంబీజేపీ) అనేది ప్రజారోగ్య అవసరాలు, ఖరీదైన బ్రాండెడ్ ఔషధాల మధ్య ఉండే అంతరాన్ని తగ్గించే విప్లవాత్మక కార్యక్రమం అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో ‘పీఎంబీఐ-లార్వెన్ జనఔషధి డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ గిడ్డంగి’ని గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న జన ఔషధీ కేంద్రాల ద్వారా ఖరీదైన వైద్య భారాన్ని తగ్గించేలా విప్లవాత్మక కార్యక్రమాన్ని పీఎంబీజేపీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం విప్లవాత్మకం అని కొనియాడారు. తెలంగాణలోని ప్రతి పౌరునికీ చవక, అందుబాటులో ఉండే, నాణ్యమైన ఆరోగ్య సేవలందించాలన్న లక్ష్యంలో ఇది ముఖ్యమైన ముందడుగు అవుతుందని అన్నారు. ఈ ఉప్పల్ గిడ్డంగి, తెలంగాణ జనఔషధి సరఫరా శ్రేణికి వెన్నెముకగా నిలుస్తుందన్నారు. సుమారు 3వేల అవసరమైన ఔషధాలు, శస్త్ర చికిత్సా వస్తువులను నిల్వ చేసే సామర్థ్యంతో ఈ గిడ్డంగిని నిర్మించినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నిబద్ధత గల ప్రయివేటు భాగస్వాములు కలసి పని చేస్తే ఎంతటి ఫలితాలు సాధించవచ్చో చూపిస్తుందన్నారు. ఇది ఉద్యోగాలను సృష్టిస్తుందనీ, చిన్న వ్యాపారవేత్తలకు అవకాశాలు ఇస్తుందనీ, జనరిక్ ఔషధాల నాణ్యతపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని చెప్పారు. చవకైన ఔషధం పొందడం విలాసం కాదనీ, అది మౌలిక హక్కు అని స్పష్టం చేశారు. ఆరోగ్యాన్ని అందుబాటులోకి తేవడం ద్వారా, మరింత బలమైన, సమానత్వం కలిగిన భారతదేశాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం నుంచి ప్రేరణ పొంది, ప్రతి భారతీయుడికీ నాణ్యమైన ఆరోగ్య సేవలు హక్కుగా లభించే భవిష్యత్‌ను నిర్మించడానికి మనమందరం కట్టుబడి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘పీఎంబీజేపీ’ విప్లవాత్మక కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES