Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజనవరి 5 నుంచి పీఎన్‌ఎం రాష్ట్ర మహాసభలు

జనవరి 5 నుంచి పీఎన్‌ఎం రాష్ట్ర మహాసభలు

- Advertisement -

– 7 వరకు నిర్వహణ
– తెలంగాణ జానపద ఉత్సవాలు
– హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదిక
– పోస్టర్‌ ఆవిష్కరించిన సినీనటుడు మాదాల రవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రజా నాట్య మండలి (పీఎన్‌ఎం) రాష్ట్ర మూడో మహాసభలతో పాటు తెలంగాణ జానపద ఉత్సవాలు వచ్చేఏడాది జనవరి ఐదు, ఆరు, ఏడు తేదీల్లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్‌, కరపత్రాన్ని శనివారం హైదరాబాద్‌లో సినీనటుడు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు మాదాల రవితో పాటు ప్రధాన కార్యదర్శి ఎన్‌ మారన్న, దర్శకుడు, మిమిక్రీ కళాకారుడు మల్లం రమేష్‌, ఏఐఐఈఏ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య, పోస్టల్‌ యూనియన్‌ ఉమ్మడి ఏపీ సర్కిల్‌ మాజీ కార్యదర్శి డీవీఎస్‌ఏ ప్రసాద్‌, ఎస్‌ఆర్‌ శంకరన్‌ ఐఏఎస్‌ అకాడమి ఏవో కె సతీశ్‌కుమార్‌ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదాల రవి మాట్లాడుతూ కళ కల కోసం కాసుల కోసం కాదు ప్రజల కోసం, చైతన్యం కోసమని అన్నారు. ప్రజల సమస్యలే ఇతివృత్తంగా తీసుకుని పీఎన్‌ఎం పాటలు, కళారూపాల ద్వారా వారిలో చైతన్యాన్ని పెంపొందిస్తున్నదని చెప్పారు. ఎంతో మంది నటులు, కళాకారులు, గాయకులు, నిర్మాతలు, దర్శకులను తయారు చేసిన ఘనత పీఎన్‌ఎంకు ఉందన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సామాన్యులను తిరుగు బాటు చేసే స్థాయికి చేరేలా చేసిందని అన్నారు. మాభూమి నాటకం వీధివీధిన వేసి ప్రజలను ప్రేరేపితం చేసిందని వివరించారు. ప్రజా సమస్యలపైనే గళం ఎత్తిందన్నారు. వామపక్ష పార్టీలు చేసే పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచిందని చెప్పారు. వైద్యుడు మనుషులకు ఉన్న జబ్బును నయం చేయాలనీ, ప్రజా కళాకారులు సమాజానికి పట్టిన జబ్బును వదలగొట్టాలని అన్నారు. వందేండ్ల సినీ చరిత్రలో అద్భుతమైన చిత్రాలు వచ్చాయంటే పీఎన్‌ఎం కళాకారుల కృషి ఉందన్నారు. విద్యావైద్యంతోపాటు సినిమాలు, సీరియల్స్‌ కూడా వ్యాపారమయం అయ్యాయని విమర్శించారు. వ్యవస్థ మారాలంటే కళాకారుల చేతుల్లోనే ఉందన్నారు. సాంస్కృతిక విప్లవం రావాల్సిన అవసరముందన్నారు. ప్రజా కళాకారులు, అభ్యుద యవాదులు ఐక్యం కావాలని కోరారు. ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌ మారన్న, దర్శకుడు, మిమిక్రీ కళాకారుడు మల్లం రమేష్‌, ఏఐఐఈఏ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య మాట్లాడుతూ జానపద కళలకు జీవంపోసి ప్రజా చైతన్యాన్ని రగిలించింది పీఎన్‌ఎం అని అన్నారు. మనిషిలో ఉన్న మానవ తాన్ని మేల్కొల్పడం ప్రజా కళాకారులందరి కర్తవ్యమని చెప్పారు. జనవరి ఐదు, ఆరు, ఏడు తేదీల్లో జరిగే పీఎన్‌ఎం రాష్ట్ర మూడో మహా సభలకు ప్రజా వాగ్గేయకారులు, రచయితలు, గాయకులు, జానపద కళాకారులతోపాటు 600 మంది ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. తెలంగాణ జానపద ప్రజా కళారూపాల సంపదను భావితరాలకు అందించడం కోసం విదేశీ విష సంస్కృతిని తరిమికొట్టడం కోసం కార్యాచరణను రూపొందిస్తామని అన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోస్టల్‌ యూనియన్‌ నాయకులు సురేశ్‌, ఎన్పీఆర్డీ నగర కార్యదర్శి ఆర్‌ వెంకటేశ్‌, పీఎన్‌ఎం రాష్ట్ర మహాసభల గౌరవ సలహాదారులు కెఎన్‌ రాజన్న, పి మల్లేశ్‌, కోశాధికారి కళ్యాణ్‌, పీఎన్‌ఎం నాయకులు కొండూరి భాస్కర్‌, సూరి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -