బీఆర్ఎస్ నేతలు జుబేర్, ఎలమంచిలి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
పోచారం శ్రీనివాస్ రెడ్డి గోడ మీది పిల్లి.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు పడుతాడు. ఆయన ఎన్ని పార్టీలు మారితే లేనిది ఇతరులు పార్టీ మారగానే బాధ ఎందుకో అంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీటీసీ ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు, పార్టీ ముఖ్య నేత షేక్ జుబేర్ ఆరోపించారు. సోమవారం బీర్కూర్ మండల కేంద్రంలో బారాస పార్టీ కార్యాలయాన్ని బాన్సువాడ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ షేక్ జుబేర్, ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఎలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పోచారం శ్రీనివాస్ రెడ్డి నమ్మకద్రోహి అంటూ వ్యాఖ్యానించారు.
1983లో కాంగ్రెస్ లో ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాగానే ఆ పార్టీలోకి చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాగానే మళ్లీ ఆ పార్టీ జెండా పట్టుకున్నారు. గులాబి ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి పార్టీలో ఇవ్వనంత స్థానం కేసీఆర్ ,పోచారంకు కల్పిస్తే.. 2023లో బీఆర్ఎస్ ద్వారా బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలిచి, ఆరు నెలలకే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఆయన తనను నమ్ముకున్న వారిని నట్టేట ముంచారంటూ శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ఎలమంచిలి మండిపడ్డారు.
పోచారం శ్రీనివా రెడ్డికి అసెంబ్లీలో అతి ఉన్నత స్థానమైన శాసనసభాపతి పదవి బాధ్యతలు అప్పగించిన, గులాబీ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకు వెన్నుపోటు పొడిచి, ఆ పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తికి బాన్సువాడ నియోజకవర్గంలో పాలన చేసే అధికారం లేదంటూ ఎలమంచి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. తక్షణం భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రండి అంటూ ఎలమంచిలి శ్రీనివాసరావు సవాల్ చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తావో… ఓటమి పాలవుతావో నీకు ప్రజలే గుణపఠం చెప్తారంటూ ఎలమంచిలి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు దిగారు. పోచారం కుటుంబం దోపిడీకే ఎగబడ్డదని, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను ఎదగనివ్వకుండా చూడడమే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నార్ల రత్న కమార్, దామరంచ మాజీ సర్పంచ్ విట్టల్, కోటగిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, స్థానిక నాయకులు డాక్టర్ బాలకృష్ణ, సాయి యాదవ్, మేకల రాములు, పెద్ద ఎత్తున ఇతర గ్రామాల నుంచి వచ్చిన బారాస శ్రేణులు పాల్గొన్నారు.