అరెస్ట్, రిమాండ్ : వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివరాంరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
నల్లగొండ జిల్లా కేంద్రంలో విద్యార్థిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. నల్ల్లగొండ పట్టణ సమీపంలోని జీకే అన్నారం గ్రామానికి చెందిన నిందితుడు గడ్డం కృష్ణ.. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల కింద 17 ఏండ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చాట్ చేసేవాడు. ఈ నెల 7వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో బాలిక తన గ్రామం నుంచి కాలేజీకి ప్రతిరోజూ వెళ్లే ఆటోలో నల్లగొండకు వచ్చింది. గడ్డం కృష్ణ బైక్‌పై నల్లగొండకు వచ్చి ఆమెను కలిశాడు.
అక్కడి నుంచి అతని స్నేహితుడు బచ్చలకూరి మధుకు చెందిన ఆటోలో షంషూనగర్, రోడ్ నెంబర్ 8లో మధు కిరాయికి తీసుకున్న రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ కృష్ణ ఆమెపై బలవంతంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలికకు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయింది. అది చూసి భయపడిన కృష్ణ.. వెంటనే రూమ్‌కు తాళం వేసి పారిపోయి తనకు తెలిసిన వ్యక్తికి సమాచారం ఇవ్వగా అతను పోలీసులకు తెలియజేశాడు. కృష్ణ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. మధును కూడా అదుపులోకి తీసుకొని పూర్తి విచారణ చేశారు. వారి వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై టుటౌన్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్డులో రిమాండ్ చేశారు. కేసును త్వరితగతిన ఛేదించిన టుటౌన్ సీఐ ఎస్. రాఘవరావు, వన్‌టౌన్ సీఐ ఏ.రాజశేఖర్‌రెడ్డి, టుటౌన్ ఎస్‌ఐ వై.సైదులును ఎస్పీ శరత్ చంద్రపవార్ అభినందించారు.
విద్యార్థిని హత్య కేసులో నిందితులపై ‘పోక్సో’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES