ఆధునిక సామాజిక తత్వవేత్త, అస్తిత్వ ఉద్యమాల ఆదిగురువు మహాత్మా జ్యోతిబా ఫూలే సామాజిక స్వరూపాన్ని ప్రతిబింబించే బహత్కవిత్వసంకలనం ‘ధిక్కార’. ఇందులో దాదాపు 157 మంది ప్రసిద్ధకవులు తమ పాటలతో, పద్యాలతో, కవిత్వంతో ఫూలే వ్యక్తిత్వాన్ని అక్షర పూలతో అభిషేకించారు. ఇది తెలుగు సాహిత్యంలో నిజంగా చెరిగిపోని చారిత్రక రికార్డే.
బహుజనుల జీవితాల్లో కొత్తవెలుగులు నింపాలని, సమాజంలో సింహభాగమైన బహుజనులను చైతన్యపు దారుల్లో నడిపిస్తూ సమసమాజ నిర్మాణం కోసం సత్యశోధక సమాజ్‌ని స్థాపించి సామాజిక విప్లవయోధునిగా నిరంతరం కషి చేసిన ధీరోదాత్తుడు మహాత్మా ఫూలే. అటువంటి మహనీయుని జీవితాన్ని ప్రేరణగా తీసుకొని ఆ విశేషాలను యావత్ దేశంలో ఎంతోమంది కళాకారులు రకరకాల కళారూపాల్లో, భాషల్లో వ్యక్తపరిచారు. అందులో భాగంగా మన ప్రసిద్ధ తెలుగుసాహితీకారులు వనపట్ల సుబ్బయ్య, డా. సంగిశెట్టి శ్రీనివాస్ చొరవతో ఈనాటి ఈ విశిష్ట ”ధిక్కార” కవిత్వసంకలనం ప్రాణంపోసుకుంది. ఈ ”ధిక్కార”కి డా. సంగిశెట్టి శ్రీనివాస్ సుధీర్ఘమైన ”దీపదారి ఫూలే” అనే ముందుమాటలో ఫూలే కాలంనాటి సామాజిక, రాజకీయ, సాంస్కతిక కోణాల్ని, పూలేకి వ్యతిరేకంగా జరిగిన రకరకాల సామాజిక, రాజకీయ కుట్రల్ని చాలా విపులంగా చర్చించి ఈ గ్రంథానికి అదనపు బలాన్ని చేకూర్చి ఒక కొత్త చర్చకు తెరలేపారు.
ఈ సంకలనంలో ఒక్క బి.సి. కవులే కాకుండా బీసీయేతర కవులు కూడా తమ వంతు బాధ్యతగా కవితామాలలు అల్లడం ఆయనకిచ్చే గొప్పనివాళి. ఆయన సమాజంలోని బలహీనుల పక్కన నిలబడి భరోసా ఇస్తూ వారి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం కోసం నిరంతరం తపించాడు. మనిషికోసం, మానవత్వంకోసం, సమాజంలోని ప్రజలంతా చైతన్యవంతులై సుఖసంతోషాలతో జీవించాలని ఆరాటపడుతూ తనదైన ప్రత్యేకమైన దష్టితో క్రాంతదర్శిలా ఆలోచించి జీవితాన్ని త్యాగం చేసిన బహుజనోద్యమ స్ఫూర్తి ప్రధాత.
అటువంటి గొప్పసంస్కర్తను తెలుగు సాహితీలోకానికి మొదటగా ‘మహాత్మాఫూలే’ కవితలో… ”సిగ్గుపడుతున్నాను చితికిపోతున్నాను/ ఈ మట్టిలోపుట్టి మూడున్నర దశాబ్దాలైనా/… క్షమించు మహాత్మా!” అని బి.ప్రసాదమూర్తి పరిచయం చేసినప్పటి నుంచి అప్రతిహతంగా కవులందరూ పూలేను తమ కవిత్వంలో మననం చేసుకుంటూనే ఉన్నారు. డా.ఎస్.రఘు ‘నిర్మాణాత్మక విధ్వంసం’ కవితలో ”కులం కుత్తుకలను కత్తిరిస్తూ/… భస్మంచేసిన/ బహు’జనమేజయుడవని” కీర్తిస్తాడు. యావత్ భారతీయుల గుండెల్లో జ్ఞానదీపాల్ని వెలిగించిన పూలేను మౌనశ్రీమల్లిక్ తన అక్షరాల్లో ”మనిషి అంటే ఒప్పుకోను/ అతడు/ మహిళాభ్యుదయానికై/ విరబూసిన కాంతిపుంజం” అని కొనియాడతాడు.
ఆ మహనీయుని నిబద్ధతని, ఆయన సమాజంలోని బడుగు బలహీనవర్గాల జీవితాల్లో పొడిచిన పొద్దుపొడుపుగా తన జీవితాన్ని ఎలా త్యాగం చేశారో ఒక్కోకవి ఒక్కోరకంగా కవితాగానంతో కీర్తిస్తారు. అన్నవరం దేవేందర్ ‘విప్లవసుతారి’ కవితలో…. ”బ్రహ్మజముల్ల ముళ్లపొదల నుండి/… విరబూసిన మానవహక్కుల ఇంద్రధనస్సు” అంటూ ఈ బానిస భావాల ముక్తిప్రధాతను కొనియాడతాడు.
”నా వెన్నెముకను నేను స్పర్శించగానే/ నా మెదళ్ళో తేజోబింబం ప్రత్యక్షమవుతుందని/ ఆ వెన్నెముక ఏంటని చూస్తే ఆయనే ఫూలే” అంటూ మట్టిబిడ్డల మనోమైదానాల్లో జ్ఞానాన్నినింపే కాంతిపుంజమని డా. చింతంప్రవీణ్ కుమార్ కైకడతాడు. డా.చెమన్ ”ఫూలే మహాశయుడు అందించిన ప్రశ్నని ఈ తరం చూపుడు వేలుపై తొడుగుతానంటూ… నీ పాదముద్రల జాడలగుండా మా ప్రయాణాన్ని ఎప్పుడూ అలసిపోనివ్వమని ఆయన ఆశయాల్ని ఈ కాలపు ముఖపత్రం చేస్తాన”ని కవితాగానం చేస్తాడు.
అక్షరజ్ఞానంతో బలహీనవర్గాల ప్రజలు చైతన్యం పొందుతారని అప్పుడే వాళ్ళు బానిస మనస్తత్వాన్ని వీడి నిటారుగా నిలబడగలరని నిరంతరం వాళ్ళను చైతన్య పరిచాడు. అక్షరాలు ఆలోచింపచేయటమే కాదు అవి బానిససంకెళ్ళను తెంచే ఆకురాళ్లు, ఇంకా బానిస బతుకుల్ని దహించే నిప్పురవ్వలు కూడా అంటారు ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ‘నిజమైన మనిషి’ కవితలో. డా. వెల్డండి శ్రీధర్ ”మనిషిని ఖడ్గంగా నిలబెట్టావు/ శిరస్సుకు నిటారుదనం నేర్పి లోపలిపొరల్లో ప్రవహించే రక్తమంతా ఒక్కటే” అని చాటావంటాడు.
అగ్రవర్ణ ఆధిపత్య ధోరణిని ఎండగట్టి బహుజన తాత్విక దక్పధానికి ఊపిర్లూది చైతన్యపు దారులవెంట నడిపించిన మహాత్మాపూలే ఔన్నత్యాన్ని వర్ణిస్తూ కటుకోజ్వల ఆనందాచారి ‘ఉద్యమ పతాకాలు’ అనే కవితలో…వాళ్ళంతే/ ఎవరో పంపబట్టే వస్తారు/ అహర్నిశం నరాలను/ స్వరాలను జనాలకోసం సవరిస్తూనే ఉంటారని ఫూలే చేపట్టిన ఉద్యమ పతాకాన్ని ఎగరేస్తాడు.
కరుడుకట్టిన హంతకులను సైతం ఆదర్శ అధ్యాపకులుగా మలిచి, బ్రూణహత్యలకు చరమగీతం పాడిన ఈ నవచరిత్రకారుణ్ణి మానవసమాజం ఉన్నంతకాలం బహుజనులే కాక బహుజనేతరులు కూడా హదయపూర్వకంగా అక్షరాంజలి ఘటిస్తూనే ఉంటారు. వారిలో కొల్లాపరం విమల ఓ మహాత్మా…/ నా ఆకుపచ్చ కలం ఆవిష్కరించి తీరుతామని కరాఖండిగా చెబుతున్నారు. సి.హెచ్. ఉషారాణి ‘ఒక్క అడుగు’ కవితలో లోకమంతా అతని ఆదర్శాల హరివిల్లులతో నిండిపోయిందని అక్షరనీరాజనం పడుతుంది.
జూలూరు గౌరీశంకర్ ‘క్రాంతిబాయి’ కవితలో కాలే కడుపులకు పట్టెడన్నమాయే/మూఢనమ్మకాలమీద ఎత్తినజెండా ఆమె/ ఆకాశంలో సగానికి అందివొచ్చిన అస్త్రమామే” అంటూ ఆ చదువుల తల్లిని తన అక్షరాలతో అభినందిస్తాడు. ఒడినే బడిగా మలచి బతుకు విలువను బోధించిన పురాతన శంఖలాలను ఛేదించి, అణగారిన జాతిగుండెలో విముక్తగీతమై ప్రతిధ్వనించిన సావిత్రి బాయిని పూలే కోసం డా. కోయి కోటేశ్వరరావు అక్షరాల జ్యోతిని వెలిగిస్తాడు. డా. పసునూరి రవీందర్ ‘బహుజన నాయిన-ఫూలే’ కవితలో ”జంధ్యం పోగుల భాగోతాలను బట్టబయలు చేసి మేమిలా నిటారుగా నిలబడి కొట్లాడేలా చేసిన నాయినా.. నాలుగు బాటల కాడా నువ్వు/ ఇవాళ ఉత్త విగ్రహానివే కాదు/ నాలుగు వేల ఏండ్ల ఈ దేశ ఆత్మగౌరవ పతాకనివి అంటూ…ఆత్మగౌరవకంఠాన్నితన పదునైన కవిత్వగొంతుతో నినదిస్తాడు.
ఈ సంకలనంలో ఎంతోమంది ప్రతిభావంతమైన కవులు రాసిన అద్బుతమైన ఎన్నో కవితలున్నాయి. అన్నింటిని ఈ వ్యాసంలో చర్చించటం సాధ్యం కాదు కాబట్టి మిగతావి పాఠకులకు వదిలేస్తున్నాను.
– డా. బాణాల శ్రీనివాసరావు, 9440471423