ఈ సంపుటి చదివిన తర్వాత, ప్రతి పదం వెనక దాగిన మౌన గాథలు మన నాభికుండలోని బిందువును తాకుతాయి. ఇవి మన వేదనలూ కావచ్చు, మన తల్లుల దుఃఖాలూ కావచ్చు, దశాబ్దాలుగా మూలిగిపోయిన కలలూ కావచ్చు. అయితే వాటికి పరిణామం ఇచ్చినది ఒక్క అమ్మ ఆత్మవిశ్వాసం, ఒక్క మహిళ బంధించబడిన నిశ్శబ్దంలో ఉన్న విలయం.
కుందుర్తి గారి కవిత్వం, సగటు జీవితాన్ని గొప్ప సందేశంగా మార్చిన కళ. ‘జస్ట్ ఎ హౌజ్ వైఫ్’ అనే పదాన్ని తీసుకొని, దానికి అర్ధాల వితానం తెరిచి, ఒక్కొక్క కవితలోనూ, ఒక్కొక్క మనిషిని పలకరించారు. ఇవి కవితలు కాదు – తలపుల చరిత్రలు, మాతత్వపు మౌన గాథలు, దాచిన గాయాల భాష్యాలు.
ఒక తల్లి వంట గదిలో చేసిన ప్రతి వంట, ఒక్కో కవితలా మారినప్పుడు, మనసు తడవక తప్పదు.
”నిన్ను రాయిలా మేమెంత మార్చినా/ మెత్తదనాన్ని మిఠాయిలా దాచావు” అంటూ తల్లి మీద రాసిన ఈ పంక్తులు, కేవలం భావావేశమే కాదు, తల్లి మనిషిగా కాదు, ఒక దేవతగా ఎలా మారిందో మనకి గుర్తు చేస్తుంది. తల్లి తన కోరికలు చంపుకొని, పిల్లల కోసమే బ్రతికే జీవదానం ఇది.
ఇక ”నువ్వు గీయలేదుగానీ, నేనెన్నో గీతలు దాటాను” అనగానే ఒక్కసారిగా మన తండ్రి ముఖం కన్నీటి పొరల్లో తేలుతుంది. మన తండ్రుల ప్రేమ ఎప్పుడూ పదాల్లో ఉండదు. కానీ ఆ మౌనాన్ని ఎప్పటికైనా చదివే ఒక్క పంక్తి ఉంటే, అది ఈ లైన్. ఓ తండ్రి ముసిముసిగా పంచిన ప్రేమను, ఆమె పదం నిటారుగా పలికించినప్పుడు… మన గుండె లోపల కల్లబొరల కబుర్లు వినిపించ తొలుగుతాయి.
”గాజు పూల నేరుకున్న నేలని నేను, ముళ్ళతో మాలలు అల్లుకొని మనసులో తురుముకున్నా” అనే పదాలు కవయిత్రి అంతరంగిక ఉద్వేగాలను ఎంతో సున్నితంగా, ఆవేదనతో కలిపి చెబుతున్నాయి. ఆమె కవిత్వంలో ఉన్న భావోద్వేగాల సంక్లిష్టత మనసును కదిలిస్తుంది. ఆమె భావాలు విరుద్ధతల మేళవింపు – సంప్రదాయం పట్ల పూర్తి తిరస్కారం కాదు, అదే సమయంలో సమర్ధన కూడా కాదు. ఈమె దష్టికోణం జీవన పరిపక్వతతో కూడినది.
కుటుంబ బంధాలకు గౌరవం ఇస్తూనే, స్త్రీ వ్యక్తిత్వం కోసం పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించటం, ఆమె భావాల వైశాల్యానికి నిదర్శనం. ‘పరువు’ అనే పేరుతో బంధించే వ్యవస్థపై ఆమె నిశ్శబ్ద పోరాటం సాగుతుంది. ”తలలూపే గంగిరెద్దుల వదం” అంటూ వ్యవస్థల విలవిలల్ని తన భాషలో విరుచుకుపడుతుంది. ఆమె కవిత్వం నెమ్మదిగా తిరుగుబాటు చెబుతుంది. అది కోపంతో కాక, అర్థంతో.
తన రచనలు కొత్త దారుల కోసం వెతుకుతున్న సత్యాన్వేషణగా ఉంటాయి. సంఘానికి ఒక అద్దంలా నిలబడి, అందులోని వాస్తవాలను ప్రతిబింబిస్తూ, స్త్రీల పట్ల సమాజం తీసుకుంటున్న వైఖరిని ప్రశ్నిస్తాయి. కవిత గారి శైలిలో గౌరవం ఉంటుంది, కానీ దాసోహం ఉండదు. నిష్పక్షపాత దక్పథంతో భావాలను మలిచే ప్రయత్నం కవిత గారి కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలిపేస్తుంది.
”ఒంటరితనం మనిషిది కాదు, జ్ఞాపకాల కత్తులది” అన్న ఒకే ఒక్క వాక్యం, ఎన్నో ఖాళీలను నింపుతుంది. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, మన లైఫ్‌లో ఏదో మిగిలిపోయిన కోణాన్ని పిలుస్తుంది. ఆ ఒంటరితనం మనలో చాలా మందిలో ఉన్నా, అది మాటల్లోకి రావడం లేదు. ఆమె మాటల్లో అది వచ్చినప్పుడు, మనకు మనమే అర్థమవుతాము.
ఈ సంపుటిలోని కవిత్వం, నిస్సహాయతలో నిరాకరణ కాదు. అది ప్రతిస్పందన. ”జాలి కూడా పట్టని వారికి, ప్రశ్నించగలమనే ధైర్యం” ఆమె కలంలో ఉంది. అది ”వంటలు చేసే ఆడదానికి, ఒంటరి రాత్రుల్లో భయపడే తల్లికి, తానెవరో మరిచిపోయిన భార్యకు” ఇవ్వాల్సిన గౌరవం గురించి వినిపించే నినాదం.
ఒక ప్రావాసికురాలిగా దేశం కాని దేశంలో ఉండి, స్వదేశాన్ని కలగా అనుభవించిన బాధను ఆమె కవితల్లో పలకరించినప్పుడు మనకూ మన ఊరు, మన భాష గుర్తొస్తుంది. ”దేశం కాని దేశంలో, స్వదేశంపై ఒలకబోసుకున్న ప్రేమలు” అన్న పదజాలం కవిత్వానికి పుట్టిన గంగాజలంలా ఉంటుంది. అది తడవదు, అది ప్రవహిస్తుంది.
ఇక సమాజం గురించి ఆమె మాటల్లో వచ్చే ప్రతిబింబం ఒక బలమైన అద్దంలా ఉంటుంది. ఆకాశాన్ని తలపాపిటలా తీసుకొని, దాచిన వెలుగుల్ని చూపించాలంటే, శబ్దం చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్క పంక్తి చాలు… ”నాగరికత తెరచాటు నుండి తొంగి చూస్తున్న రూపంలోని దట్టమైన అడవుల్ని, అందులో రేగిన అలజడుల్ని ఏ కెమెరా కన్ను బంధించగలదు?”
ఈ పుస్తకంలో ఉన్న ప్రతి పదం, పుటలమీద చెక్కిన భావాలు కాదు. అవి మన జీవితం పుటలలో నిద్రిస్తున్న శబ్దాలు. వాటిని చదివిన ప్రతి మనిషి తన తల్లిని, తన భార్యను, తనలోని ఆడవాన్ని గుర్తు చేసుకోవాల్సిందే.
కవిత్వం అంటే కేవలం తీయటి మాటలు, భిన్నమైన రూపాలు కాదు, అది ఒక భావ పునాది. ఈ సంపుటి ఆ పునాదిని మనలో నిర్మించగలిగింది.
ఈ పుస్తక పరిమాణం చిన్నదైనా, దాని పరిణామం మాత్రం మన లోపల దాగిన ఎన్నో మౌన గాత్రాల్ని పలకించగలిగిన గొంతుకగా నిలుస్తుంది.
- గుర్రాల అనూష,
ఎం. ఎస్సీ