ఇప్పటికీ చాలా మందే అడుగుతుంటారు ‘ఎవరు నీ స్పూర్తి?’, ‘ఎందుకు రాస్తున్నావు?’ అని. ప్రతిసారి ఓ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను కానీ ఎప్పుడూ నా హదయానికి నచ్చే స్థాయిలో సమాధానం ఇచ్చాననే భావన రాలేదు. మొదట్లో మాత్రం తిలక్ రాసిన ‘అమతం కురిసిన రాత్రి’ అనే కవిత్వ సంపుటి చదివినప్పటినుంచి నాలో ఏదో మెల్లగా మారిపోతోందనే అనుభూతి కలిగింది. అంతే కదా, అదే కారణం, స్పూర్తి కూడా ఇదేనేమో అనుకున్నా. కానీ అప్పుడప్పుడూ ప్రశ్నించుకునే వాడ్ని, ‘మొత్తం తిలక్కేనా కారణం?, ‘ఇంకా ఏదైనా ఉందేమో?’ అని.
దేశంలో ఏదైనా జరుగుతుంటే, చిన్న చిన్న సంఘటనలు మన మనసును తాకుతుంటే, స్పందించే మన హదయం కూడా స్పూర్తికదా? ఒక చెలిమి కోసం, ఒక జ్ఞాపకాన్ని పదబంధాలుగా మార్చాలనే తపనలో మనసు లాగి లాగి పుస్తకం ముందు కూర్చోబెడితే, అది స్పూర్తి కాదు అని అనలేం కదా? అవి కూడా స్పూర్తులే కానీ వాటితోపాటు, మచ్చుకి గుర్తుండిపోయేలా నిలిచిపోయింది తిలక్ కవిత్వం. నాలో ఎల్లప్పుడూ కదిలే తిలక్ కవిత్వం.
శ్రీశ్రీ ‘దేన్నైనా కవిత్వం చేయొచ్చు’ అని చెప్పినప్పుడు, తిలక్ ఆ మాటకి ప్రాణం పోసినవాడని నా నమ్మకం. తపాలా బంట్రోతు అనే సామాన్య జీవిని కవిత్వంగా చెక్కిన తిలక్ గొప్పతనం నిజంగా చిరస్మరణీయం. సామాన్యునిలోని అసామాన్యతను పట్టుకుని, శబ్దాలు లేని జీవితం కూడా పాటగా మలిచాడు. అలాంటి వాడిని స్పూర్తి అనకుండా ఎలా వదిలేస్తాను?
మనసులో ఎంత భావం ఉన్నా, దాన్ని శిల్పంలా చెక్కాలంటే కేవలం భావమే కాదు సరైన శైలి అవసరం. ఈ విషయంలో తిలక్ శైలి నాకు గమ్యం చూపిన మార్గదర్శిని. అతనివైపు చూస్తూ నేర్చుకున్నాను, పాఠకుని గుండెలో చేరాలంటే పదం కన్నా భావమే బలంగా ఉండాలి, అలాంటి భావాన్ని అందించే శైలిని నేర్పింది తిలక్ రాత.
అలాగే, తిలక్ తర్వాత నాకు కొంత ప్రభావం చూపినది శివసాగర్. అతని కవిత్వం చదువుతుంటే, నాకు నిజంగా అడవుల్లో అన్నలతో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. అమరుల చివరి ఊపిరిని నా చర్మంపై ఊపిరాడినట్టనిపిస్తుంది. ఆయన కవిత్వం చరిత్రలా ఉంది ఒక ధ్వని, ఒక నిరసన, ఒక గాథ. ప్యాపిలీ ఘటన గురించి మొదటిసారి చదివింది కూడా శివసాగర్ పుస్తకంలోనే. రచయిత అనగానే, కేవలం సాహిత్యమే కాదు సామాజిక చైతన్యాన్ని రగిలించే వ్యక్తిత్వం కూడా కావాలన్న నమ్మకాన్ని అతడు నాలో మరింత బలంగా నాటాడు.
అతని కవిత్వంలో గన్ క్రింద దాగిన వెన్నెల చల్లదనం ఉంది,బులెట్ చీల్చినా గుండెల్లో ఎగిసిన ఎర్రజెండా పాటలు ఉన్నాయి,ప్రభుత్వాన్ని కవితా తూటాలతో ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి,చరిత్రకారులు రాయకుండా వదిలేసిన చరిత్ర ఉంది,మానవతా తునకలున్నాయి,మనిషి తనపు గుబాళింపులూ ఉన్నాయి. ఇంతున్న అతని కవిత్వం స్ఫూర్తి కాకుండా ఎలా పోద్ది? చైతన్యం కూడా దగ్గరి పంథాలో వారి వారి శైలిలో చెప్పారు తిలక్ మరియు శివసాగర్ కూడా.
ఇక శేషేంద్ర ”ఆధునిక మహాభారతం” అనే గ్రంథం, ఒక వ్యక్తిగా, ఒక ఆలోచనశీలిగా నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. మనిషిలో నిత్యం జరిగే అంతర్మథనాన్ని అక్షరాలుగా మార్చిన అపూర్వ రచన. ప్రతి మాట కూడా ఒక ప్రశ్న. ప్రతి వాక్యం ఒక జవాబు. శేషేంద్ర కవిత్వం నన్ను నన్నుగా నిలబెట్టింది. నా లోపలి ధైర్యాన్ని మేల్కొల్పింది. ”నీ అంతర్మథనానికి నువ్వే సమాధానం కావాలి” అనే సందేశాన్ని పదే పదే నాలో నాటింది. ”ఆధునిక మహాభారతం” నన్ను తిడుతూనే, నా లోపల విప్లవాన్ని రగిలించింది. ఆ భావాల తుఫాను నన్ను లాక్కెళ్లి శేషేంద్ర వెనుక నిలబెట్టింది. ఈ పుస్తకం ఒక వ్యక్తికి మాత్రమే కాదు దేశానికి, మానవాళికి కూడా అవసరమైపోయింది. ఎందుకంటే ధైర్యం అనేది మానవత్వపు మరొక రూపం. ఆ రూపాన్ని శేషేంద్ర తన కలంతో మనకి అందించాడు.
ఈ ముగ్గురు: తిలక్, శివసాగర్, శేషేంద్ర. వారి రచనలు, భావాలు, శైలులు నాకు మాటలందించాయి. వాళ్ళు నాకు కలం ఇచ్చారు. చూపు ఇచ్చారు. దష్టి ఇచ్చారు. నా మాట నన్నే నాలానే చెప్పమన్నారు. తిలక్ అయితే నీలోంచే చొచ్చుకుని రావాలని బలంగా మెదడులో ముద్రించేసాడు. ఈ ముగ్గురు నా సాహిత్యయాత్రలో జాడలు వేసిన తొలి పాదరేఖలు. అస్సలు మొదలే కానీ నా ప్రయాణానికి వీరే స్పూర్తి అని గర్వంగానో, అమాయకంగానో ప్రకటిస్తున్నా.
– రామ ఫణీంద్ర పోశింశెట్టి
సామాన్య జీవి కవిత్వం
- Advertisement -
- Advertisement -