Monday, January 26, 2026
E-PAPER
Homeదర్వాజసామూహిక స్వప్నంలోకి మేల్కొలిపే కవిత్వం

సామూహిక స్వప్నంలోకి మేల్కొలిపే కవిత్వం

- Advertisement -

కాసింత చీకటి, కాస్త వెలుతురు, కొంచెం మట్టి, దానిమీదో సరస్సు. ఒండ్రుమట్టి ఒంటికి రాసుకుని నగరంలో ఆకాశ హర్మ్యాల మధ్య వీధుల్లో వెర్రికేకలేసే పిచ్చోడు. అలా గాల్లో చూస్తూ ఏవేవో కలలు కంటాడు. తనలో తాను మాట్లాడుకుంటాడు. కల్లోల కలలని తల్చుకుని కెవ్వుమంటాడు. పుటుకూ పుటుకూ కూకటి వేళ్లుతెగే చప్పుడు వింటూ రోదిస్తాడు. కవి చూపు త్రికాలాల్లో ప్రయాణిస్తుంది. మట్టినాశ్రయించిన బతుకులు. అక్షరాలా పక్కలో కొల్లేటి కొంగలతో పాటు పడుకుని వాటితో పాటే ఎగిరిన బాల్యం. కొన్నికాగడాలు, కొన్నిపిడికిళ్లు కొన్ని కొడవళ్లు.. చిన్న చిన్న జీవిత ఆనందాలు దు:ఖాల నాగేటి చాళ్లు… అక్షరాల్లో అగ్నీ నీరూ విధ్వంసం… బుద్ధుడి ఒళ్లో నిద్రించే పుష్పం.. కొండల మీది అడవుల స్వచ్ఛమైన ప్రకృతి, చిన్ని పాపగా మారిపోయి నవ్వుతుంది కవి పక్కనే నిలబడి. ఇదంతా తాను రాసిన కవిత్వమేనంటుంది.

అమ్మేమో ఆకలి అక్షరాలకి పాలుతాపి తృప్తిగా ఆనంద బాష్పమవుతుంది. ధ్యానం లాటి సాధన లాంటి జీవన శైలి ఉంది. సరిగ్గా ఆ జీవన రీతుల్లోంచే… ఆ జీవితాల గురించే తన తపన, తన వేదన, తన ఆకాంక్ష. అవన్నీ అతడి కవితలతో కొల్లేటి అలలై తాజాగా ఇలా ‘కొల్లేటి కలలు’ పుస్తకంలో పుటలై సాక్షాత్కరిస్తాయి. బహుజన హితుడైన ప్రసాద మూర్తి బహుముఖుడు, నిత్యజాగరూకుడు. మెలకువగా ఉంటూనే కలల్ని వదలడు. లేదా కలల్ని కంటూనే అలెర్టుగా ఉంటాడు. అంతా ఎవరి గానుగకి వారు గిరాగిరా తిరుగుతూండగా ధీరులూ యోధులూ తమ ముద్రలను వదిలి వెళ్లిపోతున్న సందర్భానికి స్పందించి కవితలు చెప్పాడు. కొల్లేటి కలలు పుస్తకంలోనే ప్రొఫెసర్‌ సాయిబాబా గురించి రెండు కవితలు రాశాడు.

”దేశమంతా చేతులు మొలిచి/ ఒక ఎలిజీరాస్తే / దాని శీర్షిక సాయిబాబా…” ఒక వ్యక్తి ఒక సామాజిక స్వప్న నిబద్ధుడై జన హృదయాల యోధుడై మొక్కవోని దీక్షతో పోరాడిన సందర్భం కొత్తకొత్త రూపాల్లో పడగలెత్తే ఫాసిజానికి వ్యతిరేకంగా జాతి యావత్తూ కనే ఒకే ఒక్క కలకి సాకార రూపం అవుతుంది. కవులు శాంతి కాముకులు. ఉన్మాదులు యుద్ధమనే సుడిగుండంలోకి అందర్నీ లాక్కున్నపుడు కవులు కత్తిపట్టి ముంజేతిని ఖండించినా పిడికిట్లో కత్తి వదలనంటూ ప్రతినబూనారు. ఈ ప్రమూ శాంతిని కోరుకుంటానంటాడు.. కాసేపు యుద్ధమే శాంతిరా బాబూ అంటాడు. ఇంకోసారి నేనూ యుద్ధం మధ్యలోనే ఉన్నానంటాడు. సమాజానికి సంకెళ్లు బిగించేవాడూ యుద్ధం చేస్తాడు. తెంచే వాడూ చేస్తాడు. ఇతడి అసలు తత్వం ఏమిటంటే సంకెళ్లు తెంచే మనిషి చేసే యుద్ధంలో తానుండటం స్వేచ్ఛతో కూడిన శాంతిని ప్రేమించడం. అదెలాగంటారా.? ఇదిగో ఇలా! ”క్రూరులు దాడులు చేస్తారు/ వీరులు యుద్ధం చేస్తారు/ రక్తదాహానికీ రక్త తర్పణకీ మధ్య/ వేలాడుతున్న దేశం ఏదైనా/ నేనక్కడ ఉంటాను/ … / కాలం నిలువెల్లా తడిసిన నెత్తుటి సాక్షిగా/ యుద్ధం అనివార్యమే కావచ్చు/ శాంతి అసాధ్యం కాదు.”

ప్రసాదమూర్తి నేరుగా సూటిగానూ చెప్పగలడు. ప్రతీకాత్మకంగానూ చెప్పగలడు. ఒక్కో చోట ప్రయోజనానికి కట్టుబడతాడు. ఇంకో చోట కేవలం కవిత్వ కళకి కట్టుబడతాడు. అదంతా సందర్భాన్ని అనుసరించి చేస్తాడు. రెంటినీ బాలెన్స్‌ చెయ్యగలడు. అందుచేత ఎంత సంక్లిష్టమైన అంశమైనా పాఠకుడికి చక్కగా ప్రసారం చేస్తాడు. ”కత్తులు దులిపిన చిలకల నత్యాలకు/ ఇల్లంతా రంగస్థలం చేసి/ రంగవల్లులు దిద్దిన రాజకీయాలు తెలిసినట్లు/ ఆమె నాకు తెలుసు” ఇది కేవలం ప్రమూ వ్యక్తిగతం కాదు. ఉద్యమాలకు సంబంధిచిన మనుషుల పట్ల ప్రేమాభిమానాలు ఈ కవితలో చెప్పుకున్నాడు అంతే. ఉద్యమాలను ప్రేమించే మనిషి కళలను ప్రేమించకుండా ఎలా ఉంటాడు. రంగుల దశ్యాలకు పరవశించే వాడు ఒక వర్ణచిత్రంలోనికి ప్రవేశించలేడా. ప్రవేశిస్తే ఏమవుతాడు. అతడు ఆమెగా… ఆమె విశ్వప్రేమగా మారిపోగలరా? ప్రముఖ చిత్రకారుడు రమణజీవి వేసిన ఒక బొమ్మ నుంచి ప్రేరణ పొంది కవిత రాశాడు.

మనం ఆ బొమ్మ చూడక్కర్లేదు. ఎందుకంటే అంతకంటే ఎక్కువ బొమ్మల్లోకి, బొమ్మల మధ్య మెటఫొరిక్‌ జర్నీలోకి తీసుకుపోయాడు ప్రమూ ‘జంట నీడలు’ కవితలో. నువ్వూ నేనూ కాలం అంటూ ఇంకో కవిత రాశాడు ప్రసాదమూర్తి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇద్దరూ ఒకటై ప్రవహించే కాలం. ముగ్గురి దోబూచులాట . ”నీ స్పర్శని మోసుకుంటూ నా ఆత్మ/ అనంత సంచారంలో అలసిపోయి/ కాలానికీ కాలానికీ మధ్య/ విరామ చిహ్నంలా/ విశ్రాంతి తీసుకుంటుంది… /……../ తేనె బొట్టులాంటి నీ కంఠంపై/ నా అధరాక్షరాల నిర్నిద్ర ముద్రల కవాతు/ నా జన్మ జన్మల కవిత్వం అవుతుంది/ ………./ నీలో నాలో విశ్వమంతా/ రెక్కల మనుషుల చుక్కల లోకమై/ ఏటవాలు సంధ్యలో/ కోటి రంగుల ఏటి కెరటాల పాటవుతుంది/ ……. కవిత్వమంటే/ ఒక స్త్రీని ప్రసవించడమే/ అని చెప్తాను” అంటాడు. కాలంతో సంభాషించేవాడు చెట్లతోనూ చేపలతోనూ సంభాషించడంలో ఆశ్చర్యం ఏముంది? నదితో సంభాషించడం కూడా ప్రమూకి చాలా మామూలు విషయమే.

అయితే వీరి భాష మామూలు భాషకాదు. ఒక మెటఫొరిక్‌ భాషలో మట్లాడతాడేమో నది కన్నీళ్లు పెట్టుకుని ఇతగాడిని కౌగలించుకుని ఏడుస్తుంది. మీరు అడుగుతారు నది అంటే ఏమిటని . అది నీరూ కాదూ కన్నీరూ కాదు. ఆ రెంటికీ మూలమైన ఒకానొక ప్రవాహం. అదేంటో కవిత చదివి ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. ”నీటి నుంచి నెత్తురు వేరు చేసే/ రాజహంసలెక్కడున్నాయని/ నది రోదిస్తోంది/ నది దు:ఖానికి ఆనకట్ట కట్టాలి/ ఎలా!?” అంటూ మనకి పెద్దసవాలే విసిరాడు.. అది కవి శుభసంకల్పం. ప్రతి కవితా హదయాన్ని స్పశించేదే. మచ్చుకి ఒకే ఒకటి. దీనిలో తల్లిని కీర్తించే కొడుకు లేడు. తల్లిని విసుక్కునే కొడుకున్నాడు. ”ఏం సుఖ పెట్టాడని నీకు/ ఏమి మిగిల్చాడని/ ఎప్పుడూ ఆయన్నే తల్చుకుని ఏడుస్తావ్‌/ అని కాస్త కసురుకున్నాను/ మిమ్మల్ని మిగిల్చాడు కద నాన్నా/ అంటూ అమ్మ నాకళ్ల లోకి చూస్తూ/ అదోలా నవ్వుతుంది/ ఆ నవ్వుకు వేలాడిన కాలంలో/ మిగులు జీవితం మొగలి వాసన” అదోలా నవ్వడం… దానికి కాలం వేలాడ్డం… మొగలి వాసన .. ఇక ఈ ఆఖరి రెండు లైన్లూ ఊహించ గల వాడికి ఊహించేంత.

కొల్లేటిని ఆశ్రయించి రెక్కల కష్టం మీద బతికే కొన్ని పక్షులుంటాయి. నీటిలో ముక్కు ముంచి బుడుంగున నీటిలోకి పోతాయి. ముక్కున చేపతో మళ్లీ ఇంకో చోట తేలతాయి. ప్రమూ కూడా కొల్లేరులో మునిగీత కొడతాడు. ఇంకో చోట తేలతాడు. తాటి దోనెలో చేపలు తీసుకుపోతాడు. అదే కొల్లేరు అతడి దుఖం. అదే కొల్లేరు అతడి సంతోషం. అదే కొల్లేటి అలలు… ముడతలు పడిన చెట్టుకు వెలాడే చీర ఉయ్యాల మడతలు. అదే కొల్లేరు అరకపట్టిన నాన్న తలపాగా. అందుకే అంటాడు కొల్లేటి విందు కవితలో నాన్నచావు విందుకు సకల పక్షిజాతులతో సహా వస్తున్నట్టు కొల్లేరు వర్తమానం పంపిందట. సమిష్టి క్షేత్రానికీ క్షేమానికి అరకపట్టిన నాన్నదీక్షకీ దక్షతకీ సాక్షిగా నిలిచిన కొల్లేరు ఇప్పుడొక సజీవ కళేబరమే… కానీ దాని కడుపులో నాన్న జ్నాపకం… తాటిదోనెలో ఎగిరే బొచ్చె చేప వాలకమే నంటాడు. రైతు వీరుడా నీకు జోహారంటూ సైబీరియా నుంచి ఆకివీడుదాకా పక్షుల్ని వెంటేసుకుని జీర్ణావస్థలో ఉన్న కొల్లేరు …కన్నీరు వర్షించుకుంటూ విందుకొస్తే ఎంత పెద్ద పీట వెయ్యాలి? ఎన్ని వేటల్ని కొయ్యాలి. కొల్లేటి పెద్దింట్లమ్మా కాస్త చెప్పమ్మా అంటాడు.

ఇంతకీ కొల్లేటి సరస్సు కడుపులో మీసం తిప్పిన రైతువీరుడి జ్ఞాపకం ఏమిటి? కొల్లేటి విందు కవిత చదవాల్సిందే. పక్షుల్ని పక్కలో పడుకోబెట్టుకుని కునికి పాట్లు పడే కవిని నిద్రపుచ్చడానికి కొల్లేరు తాటి దోనెలో వచ్చిందట. కవికి కొల్లేటి కలలున్నాయి. కొల్లేటికీ కవిని గురించిన కలలున్నాయి. ఇద్దరూ కలలు కలబోసుకున్నారు. కష్టసుఖాలు చెప్పుకున్నారు. కొల్లేరులోని చేపలన్నీ కలిసి రెండే రెండు కళ్లయిపోయాయట. అవి పెద్దింట్లమ్మ కళ్లట. వేలసంవత్సరాల పక్షివలసల జ్నాపకాలతో చేపకన్నుల పెద్దింట్లమ్మ కవిని చూసింది చల్లగా. అంటూ మొదలెట్టి కొల్లేటి విధ్వంసాన్ని కూడా చెప్తాడు. రొయ్యల మీసాలతో అసలుకే ఎసరు పెట్టిన వైనం చూపించాడు. ”ఇప్పుడు కొల్లేరంటే ..రొయ్యలు…చేపలు.. కాటాలు.. క్వింటాళ్లు ట్రక్కులు లెక్కలే…ఇప్పుడు నా అక్షరాలు మీకు అర్థం కావు…అవి ముక్కలైన ఒక అపార సరస్సు అస్థిపంజరాలు…” ”మనుషులూ పక్షులూ కలిసి వ్యవసాయం చేసిన సమిష్టి క్షేత్ర సామూహిక బంద గానాల్లేవు…ఇదిగో ఇలా నా అక్షరాల్లో కొల్లేటి కలలున్నాయి” అంటాడు.

కొల్లేటి జీవన వైభవాన్నీ.. విధ్వంసాన్నీ.. కూడా కొల్లేటికలల్లో చూపించాడు. ఆర్ధిక రాజకీయ శక్తుల రహస్యాలు విడమర్చాడు…విలపించాడు. కవిత కట్టడంలో ప్రమూ ఒడుపూ నేర్పూ చూడాలంటే ”సికింద్రాబాద్‌ స్టేషన్‌” కవిత చదవాల్సిందే.. అలాగే గోడమీది జ్ఞాపకం కవిత . గోడమీద ఫోటో ఉంది. అదెవరిదో నేను నెప్పను. కానీ అది కవికి అపురూపమైన జ్ఞాపకం. నువ్వున్నావు నా సమస్త ప్రేమానుభవ జ్ఞాపకాల నిశ్శబ్ద సంగీత సమ్మోహమై/నువ్వే నా మొదటి చివరి తత్వవేత్తవు/ గోడమీదున్నది నీ ఫోటో కాదు/అది నీతో నా సజీవ స్వానుభవం.. కావ్యం ఓలలాడిస్తుంది. బాధపెడ్తుంది. గాయాలక్కూడా పరిమళ భరితమైన రూపాన్నిస్తుంది.. సామూహిక స్వప్నంలోకి మేల్కొలుపుతుంది. ప్రసాదమూర్తి తాజా కవిత్వ పుస్తకం ‘కొల్లేటి కలలు’ నాకు అటువంటి కావ్యానుభవాన్నిచ్చింది. కవి ప్రసాద మూర్తికి అభినందనలూ వందనాలూ..

వసీరా, 9177727076

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -